బాబేఝరీ... జోడేఘాట్... నిజాం ప్రభువును ఉలిక్కిపడేలా చేసిన గోండు గూడేలు. ఆంధ్రమహాసభ అప్పుడప్పుడే రాజకీయాంశాలపై మాట్లాడు తున్న సమయంలో కొమురం భీం జల్, జంగిల్, జమీన్‌పై హక్కు కోసం పోరాడాడు. ఆదివాసులకు నేతృత్వం వహించి స్వయం పాలన డిమాండ్‌తో నిజాం పాలకుల వెన్నులో వణుకు పుట్టించాడు. ‘మా ఊళ్లో మా రాజ్యం’ అంటూ ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ తాలూకాలోని జోడెన్ ఘాట్, పట్నా పూర్, బాబేఝరి, నర్సాపూర్, కల్లెగాం మొదలైన 12 గూడేల గోండులు జాబేఝరీ లొద్దులో తుడుం మోగించారు.
1940 సెప్టెంబర్ 16న 200 మం ది నిజాం పోలీసులు గాఢ నిద్రలో ఉన్న గోండులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. వెతికి మరీ కాల్చి చంపారు. కొమురం భీం నవల రచయితలు అల్లం రాజయ్య, సాహు పేర్కొన్నట్టు సెప్టెంబర్ 1 నాటికే గోండుల తిరుగు బాటు అణచివేతకు గురికాలేదు. ఆ రోజునే భీం చనిపోలేదు. ఆ పోరాటం సెప్టెంబర్ 16 వరకు సాగి, భీంతోపాటు మరో 30 మంది అమరత్వంతో ఆగి పోయింది. స్థానిక వకీళ్లు, విచారణ కమిటీలు వెల్లడించిన విషయాలతో పాటు, కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి రాసిన నివేదిక, గోలకొండ పత్రికలో వచ్చిన వార్తలు, స్థానిక న్యాయవాదుల ప్రకటనలు సెప్టెంబర్ 16వ తేదీనే సరైనదని సూచిస్తున్నాయి.
ఆదివాసులు పవిత్ర దినంగా భావించే పౌర్ణమినాడు భీం అమరుడయ్యాడని ప్రచారంలో ఉంది. తిథిని బట్టి చూసి నా ఆ ఏడాది సెప్టెంబర్ 16 పూర్వ భాద్రపద పౌర్ణమి రోజే. గోలకొండ పత్రిక అసిఫాబాద్ విలేకరి 1940 అక్టోబర్ 17న రాసిన ‘గోండుల గోడు... కొత్తగా తెలిసిన సంగతులు’ అనే కథనం ప్రకారం...ఒక్క బాబేఝరీలో మాత్రమేగాక మొత్తం జిల్లావ్యాప్తంగా ఘర్‌పట్టీ, నాగర్‌పట్టీ, చౌబీనా, బంచ రాయి తదితర శిస్తులను తగ్గించాలని, మాఫీ చేయాలని కోరుతూ భీం తన నలుగురు అనుచరులను పంపాడు.
భీం దూతలుగా వచ్చిన ఆ నలుగురిని తాలూక్దార్ మోసంతో బంధించి, ఆ తర్వాత రాత్రి బాబేఝరిపై అమానుష దాడికి పాల్పడ్డాడు. మృతుల సంఖ్య 20 నుంచి 30 మంది వరకు ఉం డొచ్చని అంచనా. 75 ఏళ్ల క్రితం కొమురం భీం రాజేసిన నెగడు ఇంకా మండుతూనే ఉండటానికి కారణం అడవిపై, నీళ్లపై, నేలపై ఆదివాసు లకు హక్కు ఇంకా దక్కకపోవడమే కారణం. 1/70 చట్టాన్ని ధిక్కరించి వేలాది ఎకరాల ఆదివాసి భూములను ఆక్రమించుకున్న వారిని వెళ్లగొ ట్టలేని ప్రభుత్వాలు అడవి బిడ్డలను మాత్రం అడవిలోకి అడుగుపెట్టనివ్వడం లేదు. బాక్సైట్ ఖనిజాల కోసం, ఓపెన్‌కాస్ట్ గనుల కోసం, పోలవరం వంటి ప్రాజెక్టుల కోసం ఆదివాసుల చిరకాల ఆవాసమైన అడవులను కబళిస్తూ సాగి స్తున్న మహావిధ్వంసానికి సమిధలవుతున్నది కూడా వారే. అడవి బిడ్డలను అడవుల నుంచి తరిమేస్తున్నంత కాలం బాబేఝరీ, జోడెన్ ఘాట్‌లు పునరా వృతమవుతూనే ఉంటాయి.
బాబేఝరీ తిరుగుబాటుకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా...
నుగునూతుల యాకయ్య వరంగల్. ఫోన్: 9010200249
తుడుం మోగుతూనే ఉంటుంది మళ్లీ మళ్లీ
Published Tue, Sep 15 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement