అభినయ రుషి | Akkineni Nageswara Rao..Legendary Actor | Sakshi
Sakshi News home page

అభినయ రుషి

Published Thu, Jan 23 2014 12:38 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

అభినయ రుషి - Sakshi

అభినయ రుషి

నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించుకోవడం (రీఎన్వెంటింగ్).
 
 ఒక వ్యక్తితోనే ఒక పరిశ్రమ నిలబ డదుగానీ, ఆ వ్యక్తి లేకపోతే ఆ పరిశ్రమలో ఎప్పటికీ పూరించలేని ఒక ఖాళీ ఏర్పడవచ్చు. అక్కినేని లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇలాంటిదే.
 
 అక్కినేని జీవిత చరిత్ర, సినిమా చరిత్ర మనకు తెలిసిందే. ఆయనలా అధికంగా ఇంటర్వ్యూలు ఇచ్చినవారు, అసాధారణ జ్ఞాపకశక్తితో గతాన్ని అవలీలగా మనకు అందించిన వారు ఎవరూలేరు. తెలుగు సిని మారంగంలో, ఆమాటకొస్తే దక్షిణ భారత సినిమారంగంలో నటనకు ఉన్న అర్ధాన్నీ , రూపురేఖలనూ మార్చిన ఘనత ఆయనది. దక్షిణ ప్రాంతం సినిమాల్లో నాయకుల నటన నాటక రంగ అభినయానికి  దగ్గరగా ఉన్న రోజులలో ఓవరాక్షన్  గొప్ప నటనగా చలామణి అవుతున్న కాలంలో అండర్‌ప్లే అంటే ఏమిటో చేసి చూపించిన ప్రతిభ అక్కినేనిది. నాటకరంగంలో నటనకూ, చలనచిత్ర నటనలో ఉన్న తేడాను బహుశా మొట్టమొదట గుర్తించిన నటుడు నాగేశ్వరరావుగారే.
 
 అక్కినేని సినీజీవితాన్ని విహంగవీక్షణం చేస్తే, పురా ణ పాత్రలు, జానపద నాయక పాత్రలతో సినీరంగ ప్రవే శం చేశారు. కానీ ఆ రెండూ నిజానికి ఆయనకు నప్పే పాత్రలు కావు. ఆ విషయాన్ని అందరికంటే ముందు గ్రహించింది బహుశా ఆయనే.
 
 పరిమితులు తెలుసునన్నంత మాత్రాన అక్కినేని సవాళ్లకు భయపడ్డారనికాదు. ఎలాంటి సవాలైనా స్వీకరిం చే సత్తా ఆయనకుంది. దేవదాసు పాత్ర ఒప్పుకోవడమే ఒక పెద్ద సవాలు. మిస్సమ్మలో తన ప్రధాన ప్రత్యర్థి ఎన్టీ రామారావు నాయకుడని తెలిసీ అప్రధాన హాస్య పాత్రను స్వీకరించడం మరో సవాలు. అన్నిటికంటే గొప్ప సవాళ్లు భూకైలాస్, శ్రీకృష్ణార్జునయుద్ధం చిత్రాల్లో ఎన్టీఆర్ దేదీప్య మానంగా వెలిగిపోతాడని తెలిసీ, తనకు మామూలుగా ఒప్పని పాత్రలు (నారదుడు, అర్జునుడు) స్వీకరించి మెప్పించడం.
 
 నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్ష కుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించు కోవడం (రీఎన్వెంటింగ్). గంభీరమైన కుటుంబ కథా నాయకుడిగా లెక్కకు మించి బోరు కొట్టించే సంఖ్యలో సినిమాలు చేశాక, 1970లలో గ్రామీణ అల్లరి పిల్ల వాడిగా, స్టెప్పులు వేసిన సాహసం ఈ పునః సృజనలో భాగమే. అన్ని కథలూ ఒకేలా తయారవుతున్న తరు ణంలో నవలలను తెరకెక్కించడానికి సంపూర్ణంగా మద్ద తు ఇవ్వడం, ఆ పాత్రలకు తనదైన సృజనను అందిం చడం కూడా ఇటువంటిదే. వయసు పైబడటంతో సిని మాలకు స్వస్తి చెప్పక, మామూలు యాంత్రికమైన తండ్రి పాత్రలతో సరిపెట్టుకోక, సీతారామయ్యగారిగా నటించ డం కూడా ఈ పునః సృజనలో భాగమే.
 
 ఆయనతో స్నేహం గొప్ప అనుభూతి- వెండి తెరమీద చూసి ఆనందించిన నటుడితో పరిచయం అవుతుందనీ, గంటలకొద్దీ వారితో మాట్లాడతామని అనుకోము. కానీ అక్కినేనిగారిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించిన సందర్భంగా 1990లో దూరదర్శన్ కోసం ఇంట ర్వ్యూ చేసిన నాటి నుంచి ఆయనతో ఒక అరుదైన స్నేహం ఏర్పడింది. సాహిత్య సభల్లో నా ప్రసంగాలను ఆయన మెచ్చుకున్నపుడు, మా యూనివర్శిటీలో మహాసభలకు ఆయన కోసం నేను ఆంగ్లంలో ఉపన్యాసం రాసి ఇచ్చినపుడూ, తన పేరిట స్థాపించిన జాతీయ పురస్కారం కోసం తొలిసారిగా దేవానంద్‌ని ఎంపిక చేసి, నన్ను మాస్టర్ ఆఫ్ సెరిమనీస్‌గా ఉండి, ఆ సభను ఇంగ్లీషులో నిర్వహించమని ఆయన కోరినపుడూ, వరల్డ్ స్పేస్ రేడియో కోసం నాకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చినపుడూ... ఇలా ఎన్నో సంభాషణలూ... అపుడపుడూ ఫోన్లో కూడా.
 ఒక్క సన్నివేశం బాగా గుర్తు. నేను హడావిడిగా యూని వర్శిటీకి బయల్దేరుతున్నపుడు, నా లాండ్‌లైన్ మోగింది.
 
 నేను తీయగానే ‘ఎవరండీ?’ అన్నా.
 ‘నాగేశ్వరరావు’ని అన్నారు.  
 ‘ఏ నాగేశ్వరరావండీ?’ అని విసుగ్గా అన్నాను, అప్పటికే బస్సు మిస్సయ్యానన్న చికాకుతో.
 ‘అక్కినేని నాగేశ్వరరావు అంటారండీ నన్ను’ అన్నారు ఎంతో సౌమ్యంగా.
 మరో సన్నివేశం- వరల్డ్ స్పేస్‌లో ఉన్నప్పుడు మా కొత్త స్టూడియోని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే ఒప్పుకున్నారు. కారు పంపుతానని చెప్పాను.
 
 ‘మీకు కారున్నట్టుందిగా’ అన్నారు.
 ‘ఉంది కానీ అది చిన్నది. మారుతీ జెన్. మంచి కారు పంపుతాను’ అని గొణిగాను.
 ‘‘మీకు బాగున్నది నాకెందుకు బాగుండదూ. పైగా మీతో వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు.’’ అని నా కారులోనే స్టూడియోకు వచ్చారు.
 
 అక్కినేనిగారు మా అమ్మాయి పెళ్లికి వచ్చి, రెండు గంటలకుపైగా ఉండి, మామూలు బంధువులా మా వాళ్లందరితోనూ కలిసిపోయి మాట్లాడారు. అన్నపూర్ణమ్మగారు కాలం చేసినపుడు, పరామర్శకు వెళ్లిన సందర్భంలో ఆయన నాతో గంటకుపైగా ఎన్నో విషయాలు మాట్లాడారు. ‘‘చాలా ఇంటర్వ్యూలు ఇచ్చానుగానీ, మీరు చేసిన ఆ పాత ఇంటర్వ్యూ నాకెంతో ఇష్టం’’ అన్నారాయన.  ‘ఎందుకో తెలీదుగానీ మిమ్మల్ని నేను చాలా అడ్మయిర్ చేస్తాను’’ అని అన్నారు అక్కినేనిగారు. ఆయన్ని ఈరోజు ఆఖరిసారిగా చూస్తున్నప్పుడు ‘‘మనిషంటే ఇలా తృప్తిగా, పరిపూర్ణ జీవితం గడిపి, ప్రశాంతంగా శాశ్వత నిద్ర చేస్తూ తనలా ఉండమని మనకు స్ఫూర్తినివ్వాలి’’ అనిపించిది. బహుశా అదే మనం ఆయనకు ఇవ్వగలిగిన నివాళి.
 
 మృణాళిని,  విమర్శకురాలు, సాహిత్యవేత్త
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement