పుట్టి మునుగుతున్నా పట్టదా? | congress present situation in india special story | Sakshi
Sakshi News home page

పుట్టి మునుగుతున్నా పట్టదా?

Published Sun, Jul 23 2017 3:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పుట్టి మునుగుతున్నా పట్టదా? - Sakshi

పుట్టి మునుగుతున్నా పట్టదా?

పలుకున్న కాంగ్రెస్‌ నాయకులను చూసి ప్రత్యర్థుల కంటే పార్టీ అధిష్ఠాన దేవతలే ఎక్కువ భయపడతారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకూ ఈ ధోరణి  స్పష్టంగా కనిపిస్తుంది. మూడేళ్ళుగా కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్న ప్పటికీ దెబ్బ మీద దెబ్బ తింటున్నదే కానీ కోలుకునే ప్రయత్నం చేయడం లేదు. వైఖరి మార్చుకోవడం లేదు. శుక్రవారం గుజరాత్‌ నాయకుడు శంకర్‌సిన్హ్‌ వఘేలా కాంగ్రెస్‌కు రాంరాం చెప్పడానికి ఈ తీరే కారణం.

ఇందిరాగాంధీ 1966లో ప్రధానిగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెను కీలుబొమ్మను చేసి ఆడించాలనుకున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులను పూర్వపక్షం చేయడానికి ఆమె రాష్ట్రపతి ఎన్నికలలో అధికారపార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని బలపరచకుండా వరాహగిరి వెంకట గిరిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టడం, ఆత్మప్రబోధం ఆలకించి మరీ ఓటు వేయవలసిందిగా కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యులకూ, శాసనసభ్యులకూ చెప్పడం, సంజీవరెడ్డిని ఓడించడం వరకూ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆమె రాజకీయ చతురతను అభినం దించారు. నిజలింగప్ప, కామరాజ్‌ నాడార్, అతుల్యఘోష్, ఎస్‌కె పాటిల్, మొరార్జీ దేశాయ్, సంజీవరెడ్డి వంటి సీనియర్‌ నాయకులకు ప్రజలలో విశే షమైన మద్దతు లేకపోవడంతో ఇందిర తిరుగుబాటును ఆమోదించారు. ప్రారంభంలోనే ఇందిరలో ప్రవేశించిన అభద్రతాభావం చివరి వరకూ వెంటా డుతూనే ఉన్నదని పపుల్‌ జయకర్‌ (మెహతా) 1985లో రాసిన జీవితకథ (ఇందిరాగాంధీ, ఎ బయోగ్రఫీ) చదివినవారికి అర్థం అవుతుంది. సిండికేటు బెడద తొలిగిన అనంతరం కూడా కాసు బ్రహ్మానందరెడ్డిని అస్థిరపరిచారు. ఏ రాష్ట్రంలోనైనా ఒక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి స్వతంత్రంగా నిర్ణయాలు తీసు కుంటూ, ప్రజల ఆమోదం పొందుతూ, బలపడుతున్నాడంటే అతడిని తొల గించేవరకూ అసమ్మతివాదులను ప్రోత్సహించేవారు. అందువల్ల కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నిత్య అసంతృప్తి రావణకాష్టంలాగా రగులు తూనే ఉండేది.

అసమ్మతి రాజకీయాలు
ఏ మాత్రం బలం లేని వ్యక్తులు  పార్టీ అధిష్ఠానం ఆశీస్సులతో ముఖ్యమంత్రులు కావడం, పరిపాలనలోనూ, రాజకీయ నిర్వహణలోనూ దారుణంగా విఫలం కావడం, ఆయన స్థానంలో మరో అర్భకుడిని నియమించడం, అతడూ చతికిల పడిపోవడం, ఇంకో ముఖ్యమంత్రిని తెరమీదికి తేవడం, చివరికి నవ్వులపాలు కావడం కాంగ్రెస్‌కు అలవాటైంది.

ఇందిరాగాంధీ ఒరవడినే ఆమె తనయుడు రాజీవ్‌గాంధీ అనుసరించారు. పివి నరసింహారావు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలోనూ ముఖ్య మంత్రుల మార్పులు పాత ఫక్కీలోనే జరిగాయి. అంతర్గత ప్రజాస్వామ్యం మాటవరుసకైనా లేదు.  నందమూరి తారక రామారావు 1983లో అద్భుత విజయం సాధించడానికి ఆయన ప్రజాకర్షణ, అద్భుతమైన ప్రచారశైలితో పాటు కాంగ్రెస్‌ సహకారం చాలా ఉంది. 1978లో కాంగ్రెస్‌ను గెలిపించిన చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి చేసి, ఆ తర్వాత అంజయ్యను కూర్చోబెట్టి, ఆయననూ దింపివేసి శాసనమండలి సభ్యుడైన భవనం వెంకటరామ్‌ను గద్దెపైన కూర్చోబెట్టి, ఆయననూ తొలగించి నాలుగో ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డికి అధికారం అప్పగించారు. అయిదేళ్ళలో నలుగురు ముఖ్యమంత్రులను నియ మించినందుకు మూల్యం చెల్లించారు.

1989లో ఎన్టీఆర్‌ను ఓడించిన అనం
తరం మళ్ళీ చెన్నారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సారథ్యం అప్పగించారు. అనంతరం ఆయన స్థానంలో నేదురుమల్లి జనార్దనరెడ్డిని నియమించారు. చివరికి మళ్ళీ కోట్లకే మరోసారి ఎన్నికల ముందు పగ్గాలు అప్పగించారు. రెండోసారి ఎన్‌టి రామారావుకు అధికారం అప్పగించవలసిన పరిస్థితిని కోట్ల తప్పించుకోలేక పోయారు.

సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న సోని యాగాంధీ సైతం అదే మార్కు రాజకీయం కొనసాగించారు. స్థానిక రాజకీయ మతలబులు తెలియవు. సలహాదారులపైన ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రాలలో నాయకులు ఎవ్వరూ బలపడటానికి వీలులేదు. కానీ కాంగ్రెస్‌కి ఎన్నికలలో విజయం సిద్ధించాలన్న గొంతెమ్మ కోరిక. రాష్ట్రాలలో నాయకులు బలంగా ఉంటేనే పార్టీకి విజయావకాశాలు ఉంటాయని సోనియా చుట్టూ పరి భ్రమించే అహ్మద్‌ పటేల్, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌ వంటి నేతలకు తెలి యకపోలేదు. ఆమెకు చెప్పరు. ఆమె కుమారుడు రాహుల్‌కి చెప్పినా అర్థం కాదు. సోనియా ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఆమె కొన్ని మినహాయింపులతో నైనా కాంగ్రెస్‌ను సవ్యంగా నడిపారనే చెప్పవచ్చు.  ఇప్పుడు రాహుల్‌ పెత్తనంలో తప్పుడు నిర్ణయాలూ, అనాలోచిత నిర్ణయాలూ పార్టీకి తీవ్రమైన హాని చేశాయి.

వఘేలా బులెట్‌పై మోదీ
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, అమిత్‌షాని పార్టీ అధినేతగా నియ మించిన అనంతరం ఢిల్లీలో, బిహార్‌లో పరాజయం పాలైనప్పటికీ అనంతరం బీజేపీ క్రమంగా కోలుకొని కాంగ్రెస్‌నూ, ఇతర ప్రతిపక్షాలనూ చిత్తుగా ఓడిస్తూ వస్తున్నది. ఈ విజయపరంపరకు మోదీ–ఆమిత్‌షా జోడీ వ్యూహరచనతో పాటు కాంగ్రెస్‌లో పెరుగుతున్న బలహీనతలు కూడా కారణం.

యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రాహుల్‌ ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ముక్కలుగా చించి ప్రధానిని అవమానిం చిననాడే ఆయనకు మర్యాద తెలియదనీ, పరిపక్వత లేదనీ జాతీయ స్థాయిలో జర్నలిస్టులందరూ అనుకున్నారు. ఎన్నికల వ్యూహాలలో విఫలం కావడమే కాకుండా జనబలం ఉన్న కాంగ్రెస్‌నేతలను పార్టీలో కొనసాగే విధంగా నచ్చ జెప్పడంలో రాహుల్‌ విఫలం అవుతున్నారు.

ప్రజాసంబంధాలు బలంగా కలిగిన నాయకులను కాంగ్రెస్‌ నుంచి ఆకర్షిం చడానికి బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చింది. అస్సాంలో హిమంతా బిశ్వాస్‌ అద్భుత మైన వ్యూహకర్త. జనాకర్షణ కలిగిన నాయకుడు. ఆయనను కాంగ్రెస్‌ చిన్న చూపు చూసింది. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ రాహుల్‌గాంధీ బిశ్వాస్‌ను పట్టిం చుకోలేదు. ఇందుకు భిన్నంగా అమిత్‌షా బిశ్వాస్‌ను సాదరంగా ఆహ్వానించారు. అస్సాం ఎన్నికలలో  బీజేపీ ఘనవిజయం సాధించడంలో బిశ్వాస్‌ పాత్ర అద్వితీ యమైనది. అదేవిధంగా యూపీలో రీటా బహుగుణ. తనకు కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్ష పదవి లభించినా ఇంకా ప్రాధాన్యం దక్కలేదనే బాధ ఆమెకు ఉంది. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ నాయకుడు, రీటా సోదరుడు విజయ బహుగుణదీ అదే పరిస్థితి. ఆయన  బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. రీటా బహుగుణ జోషీ విలువ తెలిసిన బీజేపీ ఆమెకు స్వాగతం చెప్పింది. ఆ అంశంతో పాటు మరెన్నో అంశాలు తోడై యూపీలో కాంగ్రెస్‌ దారుణ పరాజయం, పరాభవం ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్నికలలో ఓడిపోయిన పార్టీ గుణపాఠాలు నేర్చుకొని ప్రజల సమస్యలను పట్టించుకుంటూ వారి విశ్వాసాన్ని తిరిగి సంపాదించాలి. ఇందుకు పార్టీ నాయకత్వానికి ఆత్మవిశ్వాసం ప్రధానం.

1977లో చిత్తుగా ఓడిన ఇందిరాగాంధీ 1980లో కెరటంలాగా పైకి వచ్చారు. కాంగ్రెస్‌ నాయకులలోనూ అవినీతికి అతీతంగా, సమర్థంగా, వివేకంగా, జనరంజకంగా వ్యవహరిస్తున్న నాయకులు ఇప్పటికీ కొందరు ఉన్నారు. వారిని గుర్తించి బీజేపీ తన శిబిరంలోకి లాక్కుంటున్నది. ముందు చూపులేని కాంగ్రెస్‌ పార్టీ మంచి నాయకులను పోగొ ట్టుకుంటున్నది. ఓదార్పు యాత్రకు అనుమతివ్వకుండా జగన్‌ మోహన్‌రెడ్డి వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టుకోలేకపోవడం క్షేత్రవాస్తవికత తెలియకపోవడం, సలహాదారుల సలహాలు వినడం వల్లనే.

పంజాబ్‌ గెలుపు కెప్టెన్‌దే
పంజాబ్‌ విషయంలో మాత్రం రాహుల్‌ సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని కలకు సంవత్సరం ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలంటూ ఆంటోనీ కమిటీ చేసిన సిఫార్సును కొంచెం ఆలస్యంగానైనా అమలు చేశారు.  కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ను పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నిర్ణయం సత్ఫలితం ఇచ్చింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ విజయానికి ప్రధాన కారణం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ నాయకత్వమే. రాహుల్‌గాంధీ ప్రభావం ఏ మాత్రం  కాదు.

అదే విధమైన ధోరణిని కొనసాగించి గుజరాత్‌లో శంకర్‌సిన్హ్‌ వఘేలాకు నాయకత్వం అప్పగించి అభ్యర్థుల ఎంపికలో స్వేచ్ఛ ప్రసాదించినట్లయితే వచ్చే డిసెంబర్‌లో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు ప్రస్ఫుటంగా కని పించేవి. నిజానికి గుజరాత్‌ కాంగ్రెస్‌లో అత్యంత ప్రాబల్యం కలిగిన  నాయ కుడు శంకర్‌సిన్హ్‌ వఘేలా. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో చురుకైన పాత్ర పోషించిన వఘేలా బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉండగా వఘేలా బులెట్‌ బండిపైన నరేంద్రమోదీ వెనక కూర్చొని రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ పర్యటించారు. 2014లో గుజరాత్‌ అసెంబ్లీ నుంచి సెలవు తీసుకున్న సందర్భంలో మోదీ స్వయంగా ఈ సంగతి చెప్పారు. ఇద్దరూ చాలా సన్నిహితంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించేవారు. 1977లో కపడ్‌భంజ్‌ నియోజక వర్గం నుంచి వఘేలా లోక్‌సభకు ఎన్నికైనారు. 1980లోనూ గెలు పొందారు. జనతా పార్టీ చీలిపోయిన సందర్భంలో భారతీయ జనతా పార్టీని గుజరాత్‌లో ఆవిష్కరించిన నాయకులలో వఘేలా ఒకరు.

జనం ఆయనను ‘బాపూ’ అని ఆప్యాయంగా పిలుస్తారు. 1995 గుజరాత్‌ శాసనసభ ఎన్నికలలో వఘేలా, మోదీ, కేశూభాయ్‌ దేశాయ్‌లు కలిసి బీజేపీని గెలిపించారు. కార్య కర్తలు కోరుకున్న వఘేలాను కాకుండా బీజేపీ అధిష్ఠానం కేశూభాయ్‌ని ముఖ్య మంత్రిగా నియమించింది. వఘేలాకు ఆశాభంగం కలిగినప్పటికీ తమాయించు కున్నాడు. ఈ దశలో మోదీ వఘేలాకు దూరమైనారు. వఘేలా తట్టుకోలేక పోయారు.  1996 లోక్‌సభ ఎన్ని కలలో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయారు. 47 మంది శాసనసభ్యులతో కలిసి పార్టీపైన తిరుగుబాటు చేశారు. రాష్ట్రీయ జనతా పార్టీని (ఆర్‌జేపీ) నెలకొల్పారు. కేశూభాయ్‌ని గద్దె దించి కాంగ్రెస్‌ మద్ద తుతో ప్రభుత్వం నెలకొల్పారు. ముఖ్యమంత్రి కావాలన్న కోర్కె తీరింది. కానీ   బీజేపీ వఘేలా సర్కార్‌ను పడగొట్టింది. ఆర్‌జేపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

పతీదార్ల తిరుగుబాటు
దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నా వఘేలాకు కాంగ్రెస్‌ అధిష్ఠా నంలో ఆదరణ లేదు. ఉత్తర గుజరాత్‌లో పతీదార్ల ప్రాబల్యం ఎక్కువ. తమను ఓబీసీలుగా పరిగణించాలని కోరుతూ పతీదార్లు  బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మించారు. వారి యువనాయకుడు హార్దిక్‌పటేల్‌ తొమ్మదిమాసాలు జైలు జీవితం గడిపాడు. గుజరాత్‌ జనాభాలో 14 శాతం ఉన్న పతీదార్లు ఎదురు తిరగడం బీజేపీకి పెద్ద దెబ్బ. వఘేలా వంటి నాయకుడు కాంగ్రెస్‌లో కొన సాగితే, పీసీసీ అధ్యక్షుడు భరత్‌సిన్హ్‌ సోలంకీతో కలిసి పనిచేయగలిగితే కాంగ్రెస్‌ విజయం దాదాపు ఖాయం. అందుకే వఘేలాను తమవైపు లాక్కోవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తాపత్రయం.

వఘేలా అసంతృప్తిగా ఉన్నారనీ, బీజేపీ ఆయనను కోరుకుంటున్నదనీ స్పష్టమైన సంకేతాలు ఉన్న సమయంలో  అధి ష్ఠానం (అంటే, తల్లీకొడుకూ) జాగ్రత్తపడి ఉంటే, భేషజానికి పోకుండా ఉంటే గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఇరవై ఏళ్ళ తర్వాత విజయపతాకం ఎగరవేయగలిగేది.  2019 ఎన్నికలకు అది మంచి సానుకూల వాతావరణం సృష్టించేది. దేశం గురించీ, దేశప్రజల గురించీ స్పష్టమైన అవగాహన ఉన్న ఇందిరాగాంధికే ఆధిక్య      భావం నష్టం కలిగించినప్పుడు సోనియా, రాహుల్‌ అన్ని సందర్భాలలోనూ తమదే పైచేయి కావాలనుకుంటే కుదురుతుందా?  వాస్తవిక దృష్టితో, పట్టువిడు పులు ప్రదర్శిస్తేనే బలహీనమైన పార్టీని బలమైన శక్తిగా మలచగలగుతారు. లేక పోతే కాంగ్రెస్‌ మనుగడ కష్టం.








-కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement