ద్రౌపది-ఎర్రకృష్ణుడు
మహాభారతంలో ద్రౌపదికి ఎప్పుడు కష్టం వచ్చినా కృష్ణుడు ఆదుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఆమెను తూలనాడితే నల్లనయ్య సహించడు. వర్తమాన భారతంలో మహాభారతం సీరియల్‌లో ద్రౌపదిగా నటించింది రూపా గంగూలీ. ఇప్పుడు కొందరు రూపా గంగూలీ సేవా కార్యక్రమాలకి అడ్డంపడి, ఆమెను అవమానపరిచే విధంగా మాట్లాడితే ఎర్రకృష్ణులు అండగా రావడం విశేషం.
ఇది పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. కాబట్టి ఎర్ర కృష్ణులు అంటే కామ్రేడ్లే. ఉత్తర 24 పరగణాల జిల్లా హబ్రా అశోక్‌నగర్ వరదలతో ముంపునకు గురైంది. అక్కడ బాధితులకు అత్యవసర వస్తువులు అందించడానికి రూపా గంగూలీ వెళితే, చేదు అనుభవం ఎదురైంది. దీనితో సురాజ్యకాంత్ మిశ్రా అనే నేత ఈ ధోరణిని తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వేతర సంస్థలకీ, ఆఖరికి మనసున్న ఎవరికైనా బాధితులను ఆదుకునే హక్కు ఉంటుంది. దీనిని ఎవరూ ఆపలేరు అని ఎలుగెత్తి చాటారు. అయితే రూపా గంగూలీ ఇప్పుడు బీజేపీ నాయకురాలు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఖండించిన మిశ్రా సీపీఎం నాయకుడు. తనను తూలనాడినవాళ్లు తృణమూల్ కార్యకర్తలేనని రూపా ఆరోపించడం దీనికి కొసమెరుపు. శుక్రవారం నాటి వరదలకు కోల్‌కతా మోకాలి లోతు నీళ్లలో నానుతోంది.