ఏవీ నిరుడు కురిసిన హిమసమూహములు...
కమ్యూనిస్టు పార్టీ మారిన పరిస్థితుల నేపథ్యంలో 2001లో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది. ప్రజల ఆకాంక్షను గుర్తించే పేరిట రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని పోరుబాట పట్టింది. ఈ క్రమంలో విమర్శలనూ ఎదుర్కొంది.
భావి కాలపు స్వర్ణ సౌధం కుప్పకూలింది. బెర్లిన్ గోడ తునాతునకలైంది. సోవియెట్ యూనియన్ చరిత్ర మరుగైంది. రాష్ట్ర విభజన పూర్తయింది. నూతన రాష్ట్ర ఆవిర్భావానికి జూన్ 2వ తేదీ గడువు ఖరారయింది. రాష్ట్ర విభజనతో పాటే కమ్యూనిస్టు పార్టీలూ రెండేసి శాఖల్ని ఏర్పాటు చేసుకున్నాయి. నియమిత తేదీకి ముందే సీపీఎం వేరుపడింది. సీపీఐ ఈనెల 23న లాంఛనంగా విడిపోయింది. 20వ శతాబ్దపు వీరోచిత పోరాటాల్లో ఒకటైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అనంతరకాలంలో చీలికలు పేలికలయింది. కమ్యూనిస్టు ఉద్యమానికి ఉగ్గుపాలు పట్టిన ఉమ్మడి రాష్ట్ర చరిత్రతో పాటే కమ్యూనిస్టు పార్టీల చరిత్రా ఇక గతమే.
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ 1928 డిసెంబర్‌లో ఏర్పాటయినప్పటికీ 1934లో తీవ్ర నిర్బంధాన్ని చవిచూసింది. ఈ దమనకాండ 1942 వరకు నిర్విరామంగా సాగింది. కష్టాల నుంచే కమ్యూనిస్టులు పుట్టుకొస్తారన్నట్టుగా ఈ మధ్య కాలంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి పునాదులు పడ్డాయి. పుచ్చల పల్లి సుందరయ్య కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగి ఎవరెవర్నో కలసి సంఘటితం చేశారు. బెజవాడ పటమటలోని కాట్రగడ్డ నారాయణరావు ఇంటిని కేంద్రంగా చేసుకున్నారు.
ఆ కృషి ఫలితమే యావత్ దక్షిణ భారతానికే తలమానికంగా నిలిచిన లేబర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు. మద్రాస్ కేంద్రంగా ఆరే ఆరు నిబంధనలతో ఈ లీగ్ నడిచింది. సుందరయ్యకు పోలేపెద్ది నరసింహమూర్తి, మద్దుకూరి చంద్రశేఖరరావు, అల్లూరి సత్యనారాయణ రాజు, తనికెళ్ల వెంకట చలపతి, చండ్ర రాజేశ్వరరావు లాంటి వాళ్లెందరో సన్నిహితులయ్యారు. ఆ తర్వాత కమ్యూనిస్టు నేతలయ్యారు. 1934లో పోలేపెద్ది నరసింహమూర్తి కార్యదర్శిగా ఏర్పాటయిన ఈ లీగ్ ఆంధ్రాలో పెద్దఎత్తున కార్యకలాపాలు చేపట్టింది. కమ్యూనిస్టు పార్టీకి బాటలు వేసింది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత మహత్తర పోరాటాలు నిర్వహించింది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం పరితపించింది. అందువల్లే ఏమో - తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం- తెలంగాణ, ఆంధ్రకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చినప్పటికీ తోసిపుచ్చింది.
1960 దశకంలో పార్టీలో చీలిక వచ్చినప్పటికీ, వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ తెలుగు జాతి సమైక్యతకే కట్టుబడ్డాయి. జై ఆంధ్ర ఉద్యమకాలంలో సీపీఐ కార్యాల యాలపైన, నాయకులపైన, వారి ఆవాసాలపైన దాడులు జరిగినా, దగ్ధం చేసినా వెరవలేదు. శాసనసభలో నాటి సీపీఐ నేత వేములపల్లి శ్రీకృష్ణ ఇంటికి (గుంటూరు) దుండగులు నిప్పు పెట్టడం సంచలనం సృష్టించింది. అసెంబ్లీ యావత్తు అట్టుడికింది. సమైక్యమే తమ నాదంగా వినిపించింది. అటువంటి కమ్యూనిస్టు పార్టీ మారిన పరిస్థితుల నేపథ్యంలో 2001లో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది.
ప్రజల ఆకాంక్షను గుర్తించే పేరిట రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని పోరుబాట పట్టింది. ఈ క్రమంలో విమర్శలనూ ఎదుర్కొంది. తమ సొంతమని చెప్పుకునే తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొందరు అపహాస్యం చేస్తున్నా, అసెంబ్లీ వేదికగా నైజాం నవాబును వేనోళ్ల కీర్తిస్తున్నా మిన్నకుండి పోయింది. ఆ పోరాటంలో 4 వేల మందిని ఎందుకు బలిపెట్టాల్సి వచ్చిందో చెప్పలేకపోయింది. మరోపక్క సీమాంధ్రలో పెల్లుబికిన అసమ్మతినీ, ప్రజాగ్రహాన్ని చల్లార్చడంలోనూ తన వంతు పాత్ర పోషించలేకపోయింది.
ఆంధ్రా ఉద్యమంలో మాదిరి కమ్యూనిస్టు పార్టీ తన వంతు పాత్ర పోషించి ఉంటే ప్రజల్ని సమాధానపరిచి ఉండేదన్న అభిప్రాయమూ ఉంది. దానికి బదులు ప్రకటనలు, కరపత్రాలకే పరిమితం కావడంతో ఓ ప్రాంత ప్రజలకు బాగా దూరమైంది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే నాటికి సీమాంధ్రలో పార్టీ కుదేలవ్వగా రాష్ట్ర విభజనకు జైకొట్టినా తెలంగాణలోనూ పునాదుల్ని పటిష్టం చేసుకోలేకపోయింది. జాతీయ విధానానికి భిన్నంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చేతులు కాల్చుకుంది.
వామపక్షాలతో వైరాన్ని తెచ్చుకుంది.ఏమైనా, కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అదో ముగిసిన అధ్యాయం. ఎక్కడైతే నివారించడా నికి వీలులేని అసమ్మతి, అసంతృప్తి ఉంటుందో అక్కడ విభజనా అనివార్యమని చరిత్ర చెబుతోంది. కుతర్కం మాటున ఇతరుల్ని నిందించీ ఉపయోగం లేదు. మనకిప్పుడు కావాల్సింది మరింత విధ్వంసం, విద్వేషం కాదు. భిన్న వర్గాల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం. ప్రస్తుతం కమ్యూనిస్టుల ముందున్న సవాలు అదే..
- ఎ.అమరయ్య