దావోస్ దొంగాటకంతో పెట్టుబడులొస్తాయా? | does chandrababu's davos drama bring investments to ap, c. ramachandraiah slams | Sakshi
Sakshi News home page

దావోస్ దొంగాటకంతో పెట్టుబడులొస్తాయా?

Published Sun, Jan 24 2016 1:33 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

దావోస్ దొంగాటకంతో పెట్టుబడులొస్తాయా? - Sakshi

దావోస్ దొంగాటకంతో పెట్టుబడులొస్తాయా?

చంద్రబాబుది ‘కార్పొరేట్ విజన్’. 2004 ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన.. బీజేపీతో పొత్తు, వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం సహా తాను అనుసరించిన విధానాలు సరికావని పలుమార్లు ఒప్పుకున్నారు. తాను మారిపోయానని, తనను నమ్మమని ప్రజలను పదేపదే కోరారు. నమ్మి ఆయనకు తిరిగి ప్రజలు పట్టం కట్టారు. మారని ‘చంద్రబాబు’ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ల యొక్క, కార్పొరేట్ల కొరకు, కార్పొరేట్ల చేత పరిపాలన యథేచ్చగా సాగిపోతోంది.

 

టక్కుటమార విద్యల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సాటి ఎవరూ లేరు! సింగపూర్, టోక్యో లను తలదన్నేలాంటిదన్న అమరావతి రాజధాని నిర్మాణాన్ని వదిలి... ప్రస్తుతం ఆయన రాష్ట్రంలోకి పెట్టుబడుల వరదలను పారించడానికి కాలికి బలపం కట్టుకుని ప్రత్యేక విమానాల్లో దేశాలు చుట్టి వస్తున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుతో పెట్టుబడులు వెల్లువెత్తుతాయన్నారు. కాగితాల మీద ఒప్పందాలు అమలు దశకు చేరేదెన్నడో, ఎన్ని మలుపులు తిరుగుతాయో ఎవరు చెప్పగలరు? పెట్టుబ డులు రాష్ట్రానికి అవసరమే.

 

కానీ, ప్రత్యేక హోదా వల్ల రాయితీలు అందితేనే... ఆశించి నట్టు పెట్టుబడులు వస్తాయి. ఆ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టి చేసే ప్రయత్నాల వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఆ విషయం చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. కానీ, వాస్తవాలను వెల్లడించడం లేదు. ప్రచార ఆర్భాటంతో, అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది. పెట్టుబడుల కోసమంటూ చంద్రబాబు, మందీ మార్బలం సహా... ఏటా దావోస్‌లో జరిగే ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’కు తరలివెళ్లారు.  గతంలోనూ ఆయన ఆరేడు సార్లు దావోస్ వెళ్లారు, వచ్చారు. రాష్ట్రానికి ఎన్నడూ ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చిన దాఖలాలు లేవు.

 

వైఫల్యాలకు సాకులు

ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలకు... అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలలుగా ఆ పార్టీ ప్రభుత్వం సాగిస్తున్న కార్యక్రమాలకు పొంతన లేదు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలి, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తలకెత్తుకున్న  ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణం 20 నెలలు దాటినా పునాదిరాయిని దాటి ముందుకు సాగలేదు. పైగా ఓ ప్రహసనంగా మారింది. తుళ్లూరు ల్యాండ్ ఫూలింగ్ కోసం నిద్రాహారాలు మానిన అమాత్యులు... భూములిచ్చిన రైతులు తమ ప్లాట్ల మ్యాప్‌లు మాస్టర్‌ప్లాన్‌లో కనబడటం లేదెందుకని అడుగుతుంటే.. ముఖాలు చాటేస్తున్నారు. అంతులేని కథలా సాగుతున్న రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగభృతి వంటివి అప్రధాన అంశాలైపోయాయి. పెట్టుబడులను ఆకర్షించే ప్రత్యేక హోదా హక్కును పక్కనబెట్టి, పెట్టుబడుల కోసం దేబిరిస్తున్న చంద్రబాబు వైఖరి హాస్యాస్పదం.

 

ప్రభుత్వ అర్థరహిత విధానాల వల్ల అనివార్యంగా కలిగే వైఫల్యాల బాధ్యతను ప్రతిపక్షాలకు అంటగట్టేందుకు తగిన వ్యూహాన్ని, పూర్వరంగాన్ని అధికార పార్టీ అప్పుడే సిద్ధం చేసుకుంటున్నది. బాబు పెట్టుబడుల కోసం చెమటోడుస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు కులాల కుంపట్లను, వర్గ వైషమ్యాలను, ప్రాంతీయ విద్వేషాలను లేవనెత్తుతున్నాయనీ, వాటివల్ల స్వదేశీ, విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కుపోయే ప్రమాదం ఉందనీ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దాన్నే సూచిస్తున్నాయి. కానీ, 20 నెలల చంద్రబాబు పాలనలోని వైరుధ్యాలు ప్రజల కళ్లకు కడుతున్నాయి.

 

లోటు బడ్జెట్‌తో రాష్ట్రం కునారిల్లుతోందం టూనే... ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న దుబారాను ప్రజలు గమనిస్తున్నారు. విభజిత రాష్ట్రానికి మేలు జరిగేలా లోటు బడ్జెట్ భర్తీ నుంచి అనేక ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు వరకు అవసరమైన అన్ని అంశాల్నీ విభజన బిల్లులో చేర్పించింది కాంగ్రెస్ నేతలే. సదరు సంస్థల శంకుస్థాపన సభల్లో పాల్గొంటున్న టీడీపీ, బీజేపీ నేతలు అవి విభజన బిల్లు ఫలితమనే వాస్తవాన్ని దాచి... అంతా తమ ప్రతిభే అనడంలోని కపటాన్ని ఆలస్యంగా నైనా ప్రజలు గ్రహించక మానరు. ఇక హైదరాబాద్‌లోని ఏపీ ప్రజలకు భద్రతలేదని, ఫోన్ ట్యాపింగ్ నేరానికి పాల్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని నిప్పులు చెరిగిన చంద్రబాబు... ఆ తర్వాత మహామౌనిలా మారారు! ‘ఓటుకు నోటు’ కేసు ఇక ముగిసిన కథేనని  తెలిసిందే. ఇరు రాష్ట్రాల సీఎంలూ తమ స్వీయ రాజకీయ ప్రయోజ నాల దృష్ట్యానే ‘కాల్పుల విరమణ’ ఒప్పందం చేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే.

 

 

ప్రభుత్వ ద్వంద్వ వైఖరి వల్లనే కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న అంశం మరోసారి వివాదంగా మారుతోంది. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌కు టీడీపీ ఎన్నికలకు ముందు సానుకూలతను తెలిపింది. దాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. కాపుల సంక్షేమానికి ఏటా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందింది. బీసీలకు నష్టం జరక్కుండానే కాపులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నా మన్న వాదనతో టీడీపీ ముందుకు సాగాల్సింది. బీసీ సంఘాలు, నేతలతో చర్చించి వారి మద్దతును కూడా కూడగట్టుకొని కాపులకిచ్చిన  హామీని నెరవేర్చడం దాని బాధ్యత, అదే రాజనీతి. కానీ కాపుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకే ఈ ప్రభుత్వం ఏడాదిన్నర కాలం తీసుకుంది. పైగా రెండు బడ్జెట్‌లలో కలిసి రూ. 2,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా... రూ.100 కోట్లు విదిలించింది. ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి వచ్చే విధంగా ఉన్న ఈ చర్యల వల్ల కాపులకు, బీసీలకు మధ్య అపార్ధాలు వస్తే అందుకు ప్రతిపక్షాలను, దివంగత ైవె.. ఎస్. రాజశేఖరరెడ్డిని నిందించడం ఏమిటి?

 

కులతత్వాన్ని, ప్రాంతీయ అసమానతలను పెంచుతున్నారు

అన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తేనే, సమన్యాయం చేస్తేనే సామాజిక న్యాయం సాధ్యం. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ప్రభుత్వం కుల, వర్గ రాజకీయాల్ని ప్రోత్సహిస్తోంది. ఈ 20 నెలల్లోని ప్రభుత్వ నియామకాల్లో సింహభాగం సీఎం తన సొంత కులానికి కట్టబెట్టారు. ప్రభుత్వ సలహాదారులలో బలహీ నవర్గాలకు స్థానమే లేదు. కార్పొరేషన్ల చెర్మన్‌లు, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్లు వంటి కీలక పదవుల్ని ఒకట్రెండు కులాలకే పంచారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని నామినేటెడ్ పదవులన్నీ ఒకే కులానికి కట్టబెట్టారని ఆ పార్టీ నేతలే అభ్యంతరం తెలిపారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవుల పందేరంలో బడుగు, బలహీనవర్గా లకు అన్యాయం జరుగుతోంది. గతంలో ఎస్సీల వర్గీకరణ విషయంలో మాదిగలవైపు మొగ్గు చూపిన టీడీపీ ఇప్పుడు ఆ అంశంపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది! 

 

రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఉండాలని (లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్) పదేపదే కేంద్రా న్ని కోరుతున్న చంద్రబాబు సొంత రాష్ట్రంలోని ప్రాంతాలు, జిల్లాల నడుమ అటువంటి లెవెల్‌ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పరచాలని విస్మరిస్తున్నారు. ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటులో రాయలసీమ జిల్లాలకు జరుగుతున్న అన్యాయంపై ఆ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి  రగులుతోంది. తాజాగా, అమరావతి నిర్మాణం కోసం కృష్ణా జిల్లాలోని అటవీ భూముల్ని డీనోటిఫై చేయించి పరిశ్రమల స్థాపనకు ఉపయోగిస్తామనీ, వాటికి బదులుగా కడప జిల్లాలో అడవుల్ని పెంచుతామనీ కేంద్రానికి నివేదించారు. వివక్షాపూరితమైన ఈ  నిర్ణ యం కడప జిల్లా ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రజల ప్రయోజనాలతో ముడిప డిన అంశాలపై... వివిధ పార్టీలు, ప్రజా సంఘాలతో చర్చించి, వారి అభిప్రాయాలను స్వీకరించాలన్న మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని కాలరాయడం ఇదే మొదలు కావచ్చు.

 

 

చంద్రబాబుది‘కార్పొరేట్ విజన్’. 2004 ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన, బీజేపీతో పొత్తు, వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం సహా తాను అనుసరించిన విధానాలు సరికావని పలు సందర్భాల్లో ఒప్పుకున్నారు. తాను మారిపోయానని, తనను నమ్మమని ప్రజలను పదే పదే కోరారు, అవి నమ్మే చంద్రబాబుకు తిరిగి ప్రజలు పట్టం కట్టారు. మారని ‘చంద్రబాబు’ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. దాని ఫలితంగానే   ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ల యొక్క, కార్పొరేట్ల కొరకు, కార్పొరేట్ల చేత పరిపాలన యథేచ్చగా సాగిపోతోంది.

 

 - సి. రామచంద్రయ్య

 వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి విపక్షనేత  మొబైల్ : 8106915555

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement