గూగుల్ @ హైదరాబాద్ | google @ hyderabad | Sakshi
Sakshi News home page

గూగుల్ @ హైదరాబాద్

Published Mon, May 18 2015 12:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

గూగుల్ @ హైదరాబాద్ - Sakshi

గూగుల్ @ హైదరాబాద్

(విశ్లేషణ)

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులు, నిపుణులు అయిన లక్షలాదిమంది ఇంజనీర్లు, యువతీ యువకుల నిధి ఉందని గూగుల్‌కు తెలుసు కాబట్టే అది హైదరాబాద్‌ను తన తదుపరి కేంద్రంగా ఎంచుకుంది. కానీ గూగుల్ నిర్ణయం పట్ల ఆంధ్రా సీఎం చంద్రబాబు స్పందించక పోగా, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలుపకపోవడం విచారకరం. హైదరాబాద్‌లో గూగుల్ కేంద్రం అనేది ఒక ప్రాంత విజయం కాదు. అది తెలుగు ప్రజలందరి విజయం. దీన్ని గుర్తించటమే రాజకీయ పరిపక్వత.

 ప్రపంచంలోనే తన మూడో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెల కొల్పనున్నట్లు గూగుల్ ఇటీవలే ప్రకటించింది. ఆ ఘటనతో ఆంధ్ర ప్రభుత్వం చేష్టలుడిగిపోగా, తెలంగాణ ప్రభుత్వం హర్షాతిరేకం ప్రకటిం చింది. ఇది చంద్రబాబు తనయుడిపై కేసీఆర్ కుమారుడి ఘనవిజయంగా కనిపిస్తోంది (వీళ్లిద్దరూ ఇటీవలే అమెరికాలో పర్యటించారు). ఈ అభిప్రా యం సమర్థనీయం కాదు. మన తెలుగు నేతలు చక్కటి సూట్‌లను ధరించి నందుకో, కొంతమంది ఎన్నారైలు సహాయం చేసినందుకో గూగుల్ హైదరా బాద్‌కు రాలేదు. పైగా గూగుల్ ఆంధ్రప్రదేశ్‌ను తిరస్కరించలేదు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ వారి జాబితాలో లేదు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో 30 ఏళ్లుగా తెలుగు ప్రజల ఐటీ, సాఫ్ట్‌వేర్ కౌశలాల ఫలితంగా హైదరాబాద్ అనేక అనుకూలతలను సాధించుకుంది. గూగుల్ అత్యంత కుశాగ్రబుద్ధితో నిర్ణయాలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావం తులైన, నిపుణులైన లక్షలాదిమంది ఇంజనీర్లు, యువతీ యువకుల నిధి ఉందని గూగుల్‌కు తెలుసు కాబట్టే అది హైదరాబాద్‌ను ఎంచుకుంది. అలాంటి కేంద్రం పుణే, బెంగళూరు లేదా మరే ప్రాంతంలోనైనా నెలకొల్పితే అటువంటి ప్రతిభ ఆ సంస్థకు కడు దూరంలోనే ఉండిపోయేది.

 హైదరాబాద్ సహజ ఎంపిక
 సమాచార సాంకేతిక రంగంలో అత్యంత ప్రతిభ, అనుభవాల కలబోత హైదరాబాద్ నగరం. సిలికాన్ వ్యాలీ తెలుగు ప్రజలకు పెట్టింది పేరు కాబట్టే గూగుల్ నిర్ణయం ఒక సహజమైన ఎంపిక. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోందని గూగుల్ పసిగట్టింది. నిజానికి గూగుల్ హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత నరేంద్రమోదీకే దక్కాలి. ఆయన అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ వస్తున్నారు. మన నేతల కమ్మటి పలుకులు లేదా మన సీఎంల మేధోతనానికి ఇందులో ఏ పాత్రా లేదు. హైదరాబాద్‌కు ముఖ్యమంత్రే లేకున్నప్పటికీ, అది రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పటికీ తెలుగు ప్రజల ప్రతిభా కౌశలాల కారణంతోటే గూగుల్ దాన్ని ఎంపిక చేసుకునేది.

 హైదరాబాద్‌లో గూగుల్ కొత్త కేంద్రం 10 వేలమందికి ఉద్యోగాలు, మరో లక్షమందికి  ఉపాధి అవకాశాలు కల్పించనుంది. కాని ఈ పది వేల మంది ఉద్యోగులలో కనీసం 5 వేలమంది ఔట్‌సైడర్లు లేదా సెటిలర్లే ఉంటారన్నది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇది అందరికీ విజయమే. గూగుల్ సంస్థే ఒక పెద్ద ఔట్‌సైడర్ కాబటి,్ట గిల్లికజ్జాలను రేపి, ఔట్‌సైడర్లను నిందించడం కాకుండా శాంతి సామరస్యాలను ప్రోత్సహించడాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. తెలంగాణ ఇప్పటికీ సమస్యలతో ఉంటోందని, దాని వైఖరి బాగాలేదని పసిగట్టారంటే గూగుల్ వంటి సంస్థలు బయటకి తరలిపోవడం ఖాయం. గూగుల్, భీతితో పారిపోవడానికి న్యూయార్క్ టైమ్స్‌లో తెలంగాణపై కొన్ని  ప్రతికూల రివ్యూలు అచ్చయితే చాలు. గతంలో ఆ పత్రికలో థామస్ ఫ్రీడ్‌మన్ కథనాల వల్లే బెంగళూరుకు అంతటి ప్రాచుర్యం లభించింది. అందుకే హైదరాబాద్‌కు గూగుల్ రాక తెలుగువారందరి విజయంగానే గుర్తించాలి. ఇకనుంచి తాను భిన్నంగా ఉంటానని తెలంగాణ చాటుకోవలసిన అవసరముంది.

 తెలంగాణను బాబు అభినందించాలి
 గూగుల్ ప్రకటనతో ఏపీ సీఎం చంద్రబాబు నోట మాట రాకుండాపోయింది. కేసీఆర్‌ను, తెలంగాణను అభినందించడంతో పాటు, తాను గతంలో సీఎంగా వ్యవహరించిన హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు గూగుల్‌కి కూడా బాబు కృతజ్ఞతలు తెలిపి ఉంటే బాగుండేది. అలా జరిగి ఉంటే నిజంగా మంచి రాజకీయాలు, మంచి పాలనకు గుర్తుగా ఉండేది. కానీ ఆంధ్రలో ఇప్పుడు మంచి ప్రభుత్వం, స్మార్ట్ రాజకీయాలు ఉన్నాయని ఎవరంటున్నారు? బిల్‌గేట్స్‌ను, సత్య నాదెళ్లను (మైక్రోసాఫ్ట్ బాధ్యతలు స్వీకరించాక 20 వేల మంది ఉద్యోగాలు ఊడబెరికాడు) తదితరులను పొగడటం తప్పితే, గూగుల్ ప్రకటనపై ఆశ్చర్యకరమైన మౌనం పాటిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో విఫలం అయినట్లే. పైగా బిల్ గేట్స్, తదితరులు తమ డబ్బును రెంటచింతల (భారత్‌లోనే అత్యంత ఉష్ణ ప్రాంతం)లో మదుపు చేసి దాన్ని 140 డిగ్రీల వేడిలో వేయిస్తారని బాబు ఆలోచిస్తున్నారు. శ్వేత జాతి విదేశీయులు ఆరోగ్యం రీత్యా ఎండలో నిలబడి నల్ల చర్మం సాధించాలంటే వారు ఎంచక్కా ఏ మియామీకో వెళతారు కానీ రెంటచింతలకు, విజయవాడకు రారు. చివరకు పర రాష్ట్రాల్లోని వారు సైతం ఈ రెండు ప్రాంతాలకు వెళ్లి వడదెబ్బను కొని తెచ్చుకోవాలని కోరుకోరు.

 కొత్త రాజధానిలో వినోదం అవసరమని చంద్రబాబు నొక్కి చెబుతు న్నారు. సాయంకాలానికి బార్లు తెరిస్తే అందరూ వేడి గురించి మర్చిపోతారని కూడా ఆయన భావిస్తున్నారు. ఇది మంచి ఆలోచనే కావచ్చు. తాగండి.. మీ ఆందోళనలన్నింటినీ మర్చిపోండి. కాని బాధలను మర్చిపోవడానికి ఆల్క హాల్ వైపు ప్రజలను మళ్లించడం కంటే చంద్రబాబు చేయవలసిన ఇతర పను లు చాలానే ఉన్నాయి. కృష్ణానది పొడవునా బార్లు, కేబరేలు ఏర్పడతాయి కానీ గూగుల్, ఇతర  విదేశీ సంస్థలు ఇలాంటి విషయాలపై ఆసక్తి చూపడం లేదు. విదేశీ పెట్టుబడులకు దేశంలో ఏర్పడిన అనుకూల వాతావరణాన్ని ఉప యోగించుకునే దిశలో ఆంధ్రప్రదేశ్ సాగటం లేదు. అది ఇంకా పాతకా లపు ఆలోచనల మధ్యే ఇరుక్కుపోతోంది కనుకే విఫలమవుతోంది. కొత్త రాష్ట్రం కాబట్టి ఆంధ్ర ఏదైనా కొత్తదానికి ప్రయత్నించాలి. తాను బాధల్లో ఉన్నానని, నిధులు ఇవ్వమని పదే పదే కేంద్రాన్ని వేడుకోవడం ఆపి  తన  రాజకీయ పరి పక్వతను ఏపీ ఇప్పుడు భిన్నరీతిలో ఉపయోగించాలి. చంద్రబాబు ప్రభు త్వం ఎక్కడ తప్పు చేస్తున్నట్లు మరి? కొన్ని అంశాలను చూద్దాం.

 1. ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు కొత్త రాజధాని పట్టి పీడిస్తోంది. దేశంలోనే అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం మధ్యలో మరో సింగపూర్‌ను తీసుకురావా లన్న ఆకాంక్షే నవ్వులపాలవుతోంది. ఏర్పడిన తొలి రోజునుంచి ప్రభుత్వం ఎలాంటి చర్చా లేకుండానే గుంటూరును ఎంచుకుంది. తర్వాతే అది నిపుణుల గురించి, సింగపూర్ గురించి మాట్లాడటం ప్రారంభించింది. కానీ సింగపూర్ అంటే కేవలం సిమెంటు, ఇటుకలే కాదు కదా. మనం సింగపూర్ కంటే భిన్నంగా ఉంటున్నాం కనుకే ఈ ఐడియా విఫలం కాక తప్పదు.
 2. అలాగే పురాతన రోమ్ వంటి భారీ రాజధాని ఆంధ్రాకు ఉండాలన్న ఆలోచనే తప్పు. పెద్ద సంస్థలు సైజును పట్టించుకోవు. వాటికి కావలసింది చురుకుదనం, చాతుర్యం మాత్రమే. పెద్ద కంపెనీలు ఇలాంటి ఆలోచనలను చూసి నివ్వెరపోతున్నాయి. ఒక ప్రభుత్వం తన డబ్బుమొత్తాన్ని తీసుకుపోయి ఇటుకలు, సిమెంటుమీద పెట్టవచ్చా అన్నది వాటి ప్రశ్న.
 3. ఇజ్రాయెల్ గొప్పగా అభివృద్ధి చెందిందని పదే పదే చెబుతుంటారు. కానీ అమెరికాతో సహా ప్రపంచమంతటి నుంచి, యూదులు పెద్ద ఎత్తున పంపిస్తు న్న నిధుల ద్వారానే అక్కడ అభివృద్ధి జరిగింది. కాని మన ఎన్నారైలు మాత్రం కొత్త రాజధానిలో రియల్ ఎస్టేట్‌పై నిధులు గుమ్మరించి సట్టా లాభాల కోసం కాచుక్కూచుని ఉన్నారు.
 4. భూసేకరణ సమస్యల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం రాజధాని కోసం, విమానాశ్రయాలు, రేవులు, హైవేల కోసం లక్షలాది ఎకరాల భూమిని కోరుతోంది. ఎయిర్‌పోర్టులు, రేవులు నిర్మించినంత మాత్రానే విమానాలు, ఓడలు వెనువెంటనే ఊడిపడవు. జపాన్‌లాగా డజన్ల కొద్దీ రేవులు నిర్మిస్తే ఓడ లు దిగిపోతాయనుకోవడం హాస్యాస్పదం. పైగా మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు పెట్టినందునే చైనా వృద్ధి రేటు మందగించిందని మరవరాదు.
 5. పారిశ్రామిక కార్యాచరణను ఆంధ్రా కోరుతున్నట్లయితే, అది సిలికాన్ వ్యాలీని, బెంగళూరు, హైదరాబాద్‌లను అధ్యయనం చేయాలి. సిలికాన్ వ్యాలీ ఐటీ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగులను నియమించింది. విశాఖ పట్నానికి సమీపంలో ఉన్న అరకు వంటి వాతావరణం బాగుండే ప్రాంతా లను ఏపీ ప్రభుత్వం ఎంచుకోవాలి. రాష్ట్రంలో ఒక్క విశాఖపట్నంలోనే ఆర్థిక కార్యాచరణ ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని విస్మరిస్తోంది. గూగుల్ వంటి కంపెనీలు విజయవాడ, గుంటూరు వంటి చోట్ల ఆఫీసులను తెరుస్తాయని కల్లో కూడా భావించొద్దు. వాటి గమ్యస్థానం విశాఖే అవుతుంది.

 ఏపీకి కావలసింది భూటాన్ తరహా హ్యాపీనెస్ ఇండెక్స్‌లే కానీ బోగస్ రియల్ ఎస్టేట్ లేదా అలాంటి తరహా సూచికలు కావు. భారీ భూసేకరణలు, వృథా ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్‌లు పక్కనబెట్టి రాష్ట్రంలోనూ, రాష్ట్రం బయ టా ఉన్న అపారమైన మేధో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే చాలు రాష్ట్రం ఒక టాలెంట్ క్రియేటర్ అవుతుంది. పురోగతి దానంతటదే వస్తుంది. భవం తులు, కాంక్రీట్ అనేవి పురోగతి చిహ్నాలు కావు.

చివరిగా.. చంద్రబాబు 3 ఫోన్‌కాల్స్ చేయాలి. హైదరాబాద్‌కు వస్తున్నందుకు గూగుల్‌కు తొలి కాల్ చేయండి. గూగుల్‌ని హైదరాబాద్‌కు రప్పించగలుగుతున్నందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ రెండో కాల్ చేయండి. 2013 నూతన భూ సేకరణ చట్టం కింద పోలవరం డ్యామ్ ప్రాంతం మొత్తానికి ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మూడో కాల్ చేయండి.
     

 

వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు(రాజకీయ విశ్లేషకులు)  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement