
నేను తెలుసుకున్న కామ్రేడ్ సుందరయ్య
దక్షిణ భారతదేశంలోని తొలి తరం కమ్యూనిస్టు నేతల్లో నిరుపమాన వ్యక్తిత్వం కలిగిన ఒక గొప్ప నాయకుడి జ్ఞాపకాల కలబోత ‘నేను తెలుసుకున్న కామ్రేడ్ సుందరయ్య’. 1934లో కమ్యూనిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి 1985 అస్తమయం వరకు పుచ్చలపల్లి సుందరయ్య సుదీర్ఘమైన రాజకీయ జీవితంలోని వివిధ చారిత్రక ఘట్టాల సమాహారం ఈ పుస్తకం. రెండు దశాబ్దాలపాటు సుందరయ్య వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ ఏపీ విఠల్ ఆయన జీవిత పరిణామక్రమాన్ని ఈ పుస్తకంలో వివరించారు.
కమ్యూనిజం పేరు వింటేనే గొంగళిపురుగులు పాకినట్లు మధ్యతరగతి మేధావులు, సోషల్ మీడియా వ్యాఖ్యాతలు భావిస్తున్న ప్రస్తుత కాలంలో, దశాబ్దాలుగా శ్రామిక జనావళి విముక్తి ప్రదాతగా వెలుగొందిన కమ్యూనిస్టు ఉద్యమం వెనుకపట్టు పట్టినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో.. సుందరయ్య గురించి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఏమిటి? చట్టసభలో సభ్యులుగా ప్రమాణం కూడా చేయకముందే ఈ పార్టీనుంచి ఆ పార్టీలోకి ఫిరాయింపుదారులు జంప్ చేస్తున్న రోజుల్లో సుందరయ్య గొప్పతనం ఎవరికి కావాలి? అనేది మనముందు పెను ప్రశ్నగా నిలుస్తోంది. కానీ రాజకీయరంగంలో కనిపిస్తున్న విలువల దిగజారుడుతనం ఇలాగే కొనసాగితే నామమాత్రపు ప్రజాస్వామ్యంపైన కూడా ప్రజల విశ్వాసం పూర్తిగా క్షీణిస్తుంది. కేంద్రం, రాష్ట్రం అంటూ తేడా లేకుండా అన్ని పార్టీలూ, నేతలూ విలువల పతనం విషయంలో ఒకే తాను ముక్కలుగా ఉన్న స్థితిలో రాజకీయ రంగం ప్రక్షాళన కావాలంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, మానవీయ లక్షణాలను పుణికి పుచ్చుకోవడం, ప్రజలకోసం పోరాటం ఎలా చేయాలో, విరమిం చాల్సి వస్తే ఎలా విరమించాలో తెలిసి ఉండ టం... ఈ గుణాలకోసమే దేశంలోని, తెలు గు రాష్ట్రాల్లోని రాజ కీయ నాయకులతోపాటు యువతీయువకులు కూడా సుందరయ్య జీవిత విశేషాలు చదవటం అవసరం.
1930లో మాలపర్రు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు 18 ఏళ్లలోపు వయస్సులో అరెస్టయి తంజావూరు బోర్ట్సల్ స్కూలులో జైలు జీవితం సుందరయ్యను తీవ్ర అధ్యయన కర్తగా మార్చి కమ్యూనిస్టు భావజాలంతో పరి చయం కలిగించింది. విడుదలైన తర్వాత 1931లో అమీర్ హైదర్ ఖాన్‌తో కమ్యూనిస్టు పార్టీకి పూర్తికాలం కార్యకర్తగా ఉంటానని మాట ఇచ్చిన సుందరయ్య ఆ తర్వాత 1985లో కన్నుమూసేవరకు 55 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉమ్మడి సీపీఐలోనూ, తర్వాత సీపీఎంలోనూ కొనసాగారు. పార్టీ తాననుకున్న మార్గంలో నడవలేదని గ్రహించినప్పుడు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేంద్రంలో తన పదవులకు 1978లో రాజీనామా చేసి పార్టీ లక్ష్యాల సాధనకు నాటి ఆంధ్రప్రదేశ్‌ను కార్యక్షేత్రంగా చేసుకుని జీవించినంత కాలం ఆ కర్తవ్యంలోనే గడిపిన జననేత సుందరయ్య. కేంద్ర కమిటీ నుంచి మళ్లీ కింది స్థాయిలోకి వచ్చి పనిచేయడం అత్యంత అరుదు. దానికీ సుందరయ్యే ఆద్యులు కావడం విశేషం.
మద్రాసులో ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్లను యాజమాన్యం తిరస్కరించినప్పుడు కార్మికులు సమ్మె చేస్తే పత్రిక వ్యవస్థాపకులు కాశీనాధుని నాగే శ్వరరావు సుందరయ్యతో సంప్రదింపులు జరిపి కొంతమేరకు కార్మికుల డిమాండ్లను ఆమోదించారు. ఈ సందర్భంగా కాశీనాథుని నాగేశ్వరరావు మాట్లాడుతూ కొంత అదనంగా సొమ్ము ఖర్చుపెట్టడం పెద్ద సమస్య కాదనీ, ఆంధ్రపత్రికలో కూడా సమ్మె అన్నది సంస్థ పరువుకు సంబంధించిన విషయమని, కొంచెం ముందుగానే నువ్వు నన్ను కలిసి వివరించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని నొచ్చుకున్నారు. సమస్యను పట్టువిడుపుల వైఖరితో పరిష్కరించడంలో సుందరయ్య నేర్పును ఈ ఉదంతం తెలుపుతుంది.
ఆయన పదేపదే చెప్పే విషయం ఏమిటంటే ‘‘ఈ సమాజగమనం ఒక్క మిల్లీమీటరయినా ముందుకు వెళ్లేం దుకు ప్రతి కమ్యూనిస్టూ ప్రయత్నించాలి. ఇదీ సాధ్యం కానప్పుడు కనీసం ఉన్న దశనైనా నిలబెట్టేందుకు కృషి చేయాలి. మన లక్ష్యం సిద్ధించిందా లేదా అన్నది ప్రధానం కాదు. దానిని బట్టి మన గమనాన్ని మార్చుకోవచ్చు. కానీ మనం అసలా దిశలో మానవాళి పురోగమన ప్రస్థానంలో నడుస్తున్నామా లేదా అన్నది ముఖ్యం’’. 55 సంవత్సరాల ఉద్యమ జీవితం సాక్షిగా మనిషి లక్ష్యం కోసం ఎందుకు నిలబడాలో చెబుతున్న సుందరయ్య జ్ఞాపకాలను అందుకే తెలుసుకోవాలి. ప్రతులకు: సాహితీ మిత్రులు– విజయవాడ ‘ మొబైల్: 93929 71359
కె. రాజశేఖరరాజు