అధికార పార్టీ బాస్‌ ఆవిర్భావం | In BJP Boss Amit Shah | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ బాస్‌ ఆవిర్భావం

Published Sat, Sep 2 2017 8:40 AM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

అధికార పార్టీ బాస్‌ ఆవిర్భావం - Sakshi

అధికార పార్టీ బాస్‌ ఆవిర్భావం

జాతిహితం
కామరాజ్‌ తర్వాత ఇన్నేళ్లకు అమిత్‌ షా నిజంగా శక్తివంతుడైన అధికార పార్టీ నేతగా ఆవిర్భవించారు. అలా అని ఆయన ప్రధాని మాటను కాదన్నదిగానీ, ఆయనపై ఏదైనా నిర్ణయాన్ని రుద్దిందిగానీ లేదు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, శక్తివంతమైన శాఖల, సంస్థల అధిపతులు సైతం అధికారం ఇప్పుడు ప్రధాని కార్యాలయంతో పాటూ మరో చోట కూడా ఉన్నదని గుర్తిస్తున్నారు. తదనుగుణంగా సర్దుబాటు అవుతున్నారు. తాజా మంత్రివర్గ పునర్వ్యవïస్థీకరణ ఈ కొత్త ‘సాధారణ స్థితి’ని మరోసారి రూఢి చేస్తుంది.

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నివాసంలోని ముందు హాలు అతి తక్కువ వస్తువులు, అలంకారాలతో పాత తరం రాజకీయవేత్తల ఇంటిలా ఉంటుంది. ఆయన తనకు ఇష్టమైన మధ్య సోఫాలో కూచుని సందర్శకులతో మాట్లాడుతుంటారు. ఆ హాలు గొడకు ఒకవైపున ఉన్న చాణక్యుడు లేదా కౌటిల్యుని చిత్రం మరో వైపున ఉన్న సావర్కర్‌ చిత్రం సందర్శకుల కంట పడకుండా ఉండవు. షా రాజకీయాలను నిర్ణయించేది ఆయనకు ఆరాధ్యనీయులైన ఆ ఇద్దరే. వారిలో కౌటిల్యుడు ఆయన రాజకీయ చతురతకు, సావర్కర్‌ ఆయన హిందుత్వ జాతీయవాద భావజాలానికి నిర్దేశకులు.

అయితే షా, ఆ గోడకు మరొకరి చిత్రాన్ని కూడా తగిలించవచ్చు. అది కూడా వారిద్దరి మధ్య అయితేనే ఉత్తమం. ఆయన పక్కా కాంగ్రెస్‌ వారే కావచ్చు. రాజకీయ, ప్రభుత్వ అధికారం, తాత్వికమైన ప్రేరణ ఇప్పటికే ఆ ఇద్దరి నుంచీ ఆయనకు సంక్రమించినవి, కాకపోతే ఆయన రాజకీయ శైలి, ఆయన తన సొంత పార్టీపై నెరపుతున్న అధికారం దివంగత కాంగ్రెస్‌ అధ్యక్షునిగా (1963–67) కే కామరాజ్‌ ఉచ్ఛదశలో ఉన్న కాలాన్ని గుర్తు చేస్తాయి. కామరాజ్‌ తర్వాత మరెన్నడూ మంత్రులంతా ఇలా అధికార పార్టీ అధ్యక్షుని కార్యాలయంలో చేరి, తమ స్వీయ సాఫల్యాల, ఫలితాల నివేదికను చదివి వినిపించడం లేదా పార్టీ పనికి అంకితం కావడం కోసం రాజీనామాలు చేయడం జరగలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న ప్రస్తుత తరుణంలో ఆ నాటకం నేడు ప్రదర్శితమవుతోంది.

1963–67లో కామరాజ్‌ అధ్యక్షునిగా తొలి దఫా బాధ్యతలు నెరపిన తర్వాత మళ్లీ ఎన్నడూ పూర్తి కాలపు పార్టీ అధ్యక్షుడు ఇంత అధికారాన్ని నెరపి ఉండలేదు. స్పష్టత కోసం మనం పూర్తికాలపు పార్టీ అధ్యక్షుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం అని గుర్తుచేయాల్సి వస్తోంది. కాంగ్రెస్‌ ప్రధాన మంత్రులే పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు లేదా పార్టీ అధ్యక్షులే పరిమిత అధికారాలు గల ప్రధానిని ‘నియమించేవారు’. దేవ్‌కాంత్‌ బారువా, చంద్రశేఖర్‌ (జనతా), వాజపేయి హయాంలో పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారూ పరిమితమైన అధికారాలను మాత్రమే కలిగి ఉండేవారు. కాబట్టి వారు కామరాజ్, అమిత్‌షాల కోవకు చెందినవారు కారు.

అమిత్‌ షా అధికారం తీరే వారు
నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి అమిత్‌ షా కారణం కాదు కాబట్టి, ఆయనకున్న అధికారం మరింత విశిష్టమైనది. పైగా అందుకు విరుద్ధమైనదే జరిగింది. 2014 ఎన్నికల ప్రచార సారధిగా మోదీనే అమిత్‌ షాను ఎంపిక చేశారు. మీరు ఎంత కష్టపడైనా వెదకండి, వైద్య రోగనిర్ధారణవేత్తలు అనేట్టుగా అత్యంత ఉన్నత స్థాయి అనుమానంతో చూసినా గానీ, ఒక సమస్యపై ఆయన, ప్రధానికి విరుద్ధ వైఖరిని తీసుకున్నారనడానికి ఎలాంటి ఆధారాలూ దొరకవు. ప్రధాని మాటను తోసిపుచ్చడం లేదా ఏదైనా నిర్ణయాన్ని ఆయనపై రుద్దడం జరిగిన దాఖలాలు ఇప్పటివరకైతే లేవు.

బీజేపీ, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సారధ్య బాధ్యతలను అమిత్‌ షాకు అప్పగించిన సందర్భంగా నేను 2013 జూలై 13 నాటి నా జనహితంలో ‘‘వాళ్లు ఏం వింటున్నారు, చదువుతున్నారు, యోచిస్తున్నారు ఇలా చేయడానికి?’’ అని ప్రశ్నించాను. నేను తప్పని రుజువయిందనడం నిస్సందేహం. యూపీలోని 80 సీట్లలో 73 స్థానాలను ఆయన సాధించిపెట్టారు. బీజేపీ మరో మారు అటల్‌ బిహారీ వాజ్‌పేయి తరహా ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కోరుకుంటోందని నేను అప్పట్లో భావించాను.

పార్టీ వైఖరి ప్రస్తుత మధ్యేవాద స్థితిని తలకిందులు చేయని మృదువైన హిందుత్వతో, సమ్మిళిత వైఖరిని అవలంబిస్తున్నదని అనుకున్నాను. నేను ఆధారపడ్డ ఆ ప్రమేయం తప్పని తర్వాత అర్థమైంది. ఆ విశ్వాసమే నిజమై ఉంటే నిజంగానే ఉత్తరప్రదేశ్‌కు షాను ఎంపిక చేయడం తప్పే అయి ఉండేది. కానీ నేను అలా ఊహించి తెలివితక్కువతనం ప్రదర్శించానని రుజువైంది.

ఆ తర్వాతి రాజకీయాలు, నా ప్రమేయం ఎలా తప్పు అనేదాన్ని మరిం తగా ప్రబలంగా తెలియజేశాయి. వాజ్‌పేయి ముద్ర గల మరో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి బదులుగా, మోదీ–షాలు ఎలాంటి సంజాయిషీలూ అవసరంలేని బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ల ‘‘నిజమైన’’ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృష్టితో ఉన్నారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో చాలా కీలక శాఖలు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందని వారి చేతుల్లో ఉండటం వల్ల ఆ ప్రభుత్వం ఎంత మాత్రమూ బీజేపీ ప్రభుత్వం కాదనే అవగాహన కూడా ఉండేది. అది జార్జ్‌ ఫెర్నాండెజ్‌ వంటి కీలక మిత్రులకు రక్షణ శాఖను అప్పగించడానికే పరిమితం కాలేదు. జస్వంత్‌ సింగ్, యశ్వంత్‌ సిన్హా, రంగరాజన్‌ కుమార మంగళమ్, అరుణ్‌శౌరి వంటి వారిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీల సొంత భావజాలాన్ని గలిగిన వారుగా పరిగణించే వారు కారు.

భావజాల పరిశుద్ధతకే పట్టం
వాజ్‌పేయి ప్రభుత్వాన్ని నేడు తమ భావజాలాన్ని గలిగిన, తమ పార్టీకి చెందిన నిజమైన ప్రభుత్వంగా చూడటం లేదు. నేటి ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధమైన కొసకు చెందినది. భావజాలపరమైన పరిశుద్ధతను ముందు షరతుగా చేయడం వలన ప్రభుత్వ విధులను నిర్వహించడానికి తగిన నైపుణ్యాలు కొరవడ్డాయి. అలాంటి వారికోసం ఇప్పుడిక ఎంత మాత్రమూ బయటివారిని అన్వేషించడం మానేశారు. పరిపూర్ణమైన భావజాల పరిశుద్ధతను కలిగినవారికి లేదా దశాబ్దాల తరబడి పార్టీకి సేవ చేసిన వారికి మాత్రమే అధికారాన్ని అప్పగిçస్తున్నారు. ఆ పనిని అమిత్‌ షా ఏ మాత్రం కనికరం లేకుండా ముందుకు తీసుకుపోతున్నారు.

ఆ అర్థంలో చూస్తే నేటి బీజేపీ/ఎన్‌డీఏ ప్రభుత్వం మునుపటి దానికి పూర్తిగా భిన్నమైనది. ఇప్పుడు బీజేపీ తనంతట తానుగా మెజారిటీని కలిగి ఉండటమే ఈ తేడాకు కారణం నిజమే. కానీ ఎల్‌కే అద్వానీకి లేదా ఢిల్లీకి బాగా పరిచితులైన బీజేపీ పాత తరం నేతలు మరెవరిౖకైనా ఇలాంటి మెజారిటీని అందించినంత మాత్రాన... ఇలా ఏ మాత్రం గజిబిజి లేని, భావజాలపరమైన నిబద్ధతగలిగిన ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగి ఉండేవారని కచ్చితంగా చెప్పలేం. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌లను, విశ్వాసంగల యువ నేతలను... వారు రాజకీయంగా అంత పలుకుబడిగల వారు కాకున్నా మోదీ.. హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర మ¬ఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. అటు పిమ్మట అమిత్‌ షా, తను ఎంపిక చేసిన వారితో ముందుకు వచ్చారు. గుజరాత్‌లో విజయ్‌ రుపానీని, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను, భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎంపిక చేశారు. తొలుత షా ఎంపిక చేసిన వారి పేర్లను పార్టీకి కూడా తెలియకుండా రహస్యంగా ఉంచారు.

1963 గాంధీ జయంతి రోజున కామరాజ్‌ తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ పనికి పునరంకితం అవుతానంటూ రాజకీయ కల్లోలాన్ని రేకెత్తించారు. ఆయనను అనుసరించి ఆరుగురు కేబినెట్‌ మంత్రులు, ఐదుగురు ముఖ్యమంత్రులు కూడా రాజీనామాలు చేశారు. దీంతో మొరార్జీ దేశాయ్, జగ్జీవన్‌ రామ్‌ వంటి వారు సైతం అధికారంపై ఆశలను వదులుకోçక తప్పలేదు. కామరాజ్‌ చేపట్టినది అత్యంత క్రూరమైన పార్టీ అంతర్గత ప్రక్షాళన. కామరాజ్‌ ప్లాన్‌గా అది పేరు మోసేసరికి, ఆయన ఇంకా పార్టీ అధ్యక్షుడు సైతం కారు. అదంతా జ్ఞాపకాల మరపున పడిపోయింది. కానీ అది స్టాలినిస్టు ప్రమాణాలలో సాగిన సుదీర్ఘ ప్రక్షాళన. కాకపోతే అది రక్తపాతరహితంగా, ‘‘స్వచ్ఛందంగా’’జరిగినది. అది రాజకీయ వ్యంగ్య చిత్రకారులను, వ్యంగ్య రచయితలను చాలా కాలంపాటూ తలమునకలయ్యేట్టు చేసింది. అప్పటికే క్షీణ దశలో ఉన్న నెహ్రూను ఇది బాగా ప్రభావితుడ్ని చేసింది. దీంతో ఆయన కామరాజ్‌ను పార్టీ అధ్యక్షుడ్ని చేయాలని కోరారు. నెహ్రూ మరణం తర్వాత, ప్రధాని కావాలని బలంగా ఆశలు పెంచుకున్న మొరార్జీదేశాయ్‌ ఆశలను వమ్ము చేసి... మొదట లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఆ తర్వాత ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారాలకు హామీని కల్పించారు. 1963–67 మధ్య కాలంలోని ఆ అత్యంత శక్తివంతుడైన కాంగ్రెస్‌ నేత అనుగ్రహం కోసం అంతా వెంటపడేవారు. ‘‘పార్కలామ్‌’’(చూద్దాం) అనే తమిళ మాట అప్పటి నుంచే భారత రాజకీయ పదజాలంలో చేరింది.

కామరాజ్‌ తరహా ప్రక్షాళన
అమిత్‌ షాకు కూడా అలాంటి ఇష్టమైన మాట ఏదైనా ఉందేమో మనకు ఇంకా తెలియదు. కానీ, కామరాజ్‌ రాజకీయ శైలికి సంబంధించిన అన్ని అంశాలూ ఆయనలో ఉన్నాయి. ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చిన ప్రధాని తప్ప, మంత్రులంతా ఆయన ముందు వరుస తీరుతారు. ఆయన వారితో ‘‘స్వచ్ఛందంగా’’రాజీనామాలు సమర్పించి, పార్టీ పనికి పునరంకితం కావాలంటారు. వారంతా నవ్వు ముఖాలతోనే బయటకు వస్తారు. తమ హృద యం ఛిద్రమైనా విధేయమైన పార్టీ కార్యకర్తలమని చెప్పుకుంటారు. 2024 వరకు మోదీ–షా నాయకత్వమే కొనసాగుతుందని, కాలం గడిచే కొద్దీ వారి బలం మరింత పెంపొందుతుందని భావిస్తారు. షా తమ పార్టీ పనిని చూసి ఎప్పటికో ఒకప్పటికి తిరిగి వెనక్కు పిలుస్తారనే ఆశతో వారు ఉంటారు.

ఒక అర్ధ శతాబ్ది పాటూ, కేంద్రంలో నిజమైన అధికార పార్టీ అధ్యక్షుడు ఉండటం మనం చూడలేదు. అందుకు తగ్గట్టు సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది. అమిత్‌ షా ఇతర గణనీయమైన మార్పులను కూడా తెచ్చారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు ఇప్పుడు బీజేపీ పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. ప్రధాని సైతం అక్కడికి వచ్చి ఆ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రధాన మంత్రికి అనువుగా ఉండటం కోసం ఇలాంటి సమావేశాలను ప్రధాని నివాసంలో జరపడం స్థిరపడ్డ రివాజు. కేంద్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రులు, చివరకు అత్యంత శక్తివంతమైన శాఖల, సంస్థల అధిపతులు సైతం ఇప్పుడు అధికారం ప్రధాని కార్యాలయంతో పాటుగా మరో చోట కూడా ఉన్నదని గుర్తిస్తున్నారు. తదనుగుణంగా వారు సర్దుబాటు అవుతున్నారు. ఈ మంత్రివర్గ పునర్వ్యవïస్థీకరణ ఈ కొత్త సాధారణ స్థితిని మరోసారి రూఢి చేస్తుంది.

వ్యాసకర్త దప్రింట్‌ వ్యవస్థాపకుడు, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
(https://theprint.in)
శేఖర్‌ గుప్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement