బెల్టుషాపులు రద్దు చేయాలి | Inbox - 06.05.2015 | Sakshi
Sakshi News home page

బెల్టుషాపులు రద్దు చేయాలి

Published Wed, May 6 2015 1:32 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

బెల్టుషాపులు రద్దు చేయాలి - Sakshi

బెల్టుషాపులు రద్దు చేయాలి

 ఇన్ బాక్స్

 రాష్ట్రవ్యాప్తంగా కష్టజీవుల శ్రమను బెల్టు షాపులు, గుడుంబా, కల్తీ కల్లు, నాటు సారా వంటివి దోచుకుంటున్నాయి. ప్రకృతి సహజమైన కల్లును స్పిరిట్ తదితర విషపదార్థాలను కలుపుతూ పట్టణాల్లో కల్తీకల్లు అమ్మించి ప్రజల జీవితాలను హరీమనిపిస్తున్నారు. మత్తుకు లోనైన వారు భార్యా పిల్లలను మర్చిపోవడమే కాకుండా నేరాలు ఘోరాలకు పాల్పడటం ద్వారా శాంతిభద్రత లకు భంగం కలిగిస్తున్నారు. 2004కి ముందు టీడీపీ హయాంలో ప్రజలకు మంచినీరు కన్నా బెల్టుషాపుల్లోని మద్యమే ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బెల్టు షాపులు రద్దు చేస్తూ దశల వారీగా మద్యపాన నిషేధం చేయాలి. రాష్ట్ర ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులు రావాలంటే విద్యలో, ఉద్యోగాల్లో, వృత్తుల్లో పొరుగు రాష్ట్రంతో పోటీ పడాలంటే అన్నిటికంటే ముందు బెల్టు షాపులను రద్దు చేయాలి. ఇలా అయితే మాత్రం పరిపూర్ణ ఆరోగ్యవంతులతో కూడిన బంగారు తెలంగాణ నిజంగా సాధ్యమ వుతుంది. బెల్టుషాపులతో పాటు గుట్కా, ఖైని, అంబర్ వంటి విషపదార్థాలను కూడా నిషేధించాలి. కట్టుకున్న భార్య కన్నా వీధుల్లో దొరికే కల్తీ కల్లు, చీప్ లిక్కరే మద్యంరాయుళ్లకి ముఖ్యమై కుటుంబ జీవితం ధ్వంసమవుతోంది. రాష్ట్రంలోని ప్రతి వీధిలో, వాడలో తాగుడు మూలంగా జరుగుతున్న కుటుంబ ఘర్షణలను మనం చూడవచ్చు. లక్షలాది గృహాలను కబళిస్తున్న మద్యపానాన్ని అరికట్టాలంటే, బెల్టు షాపులను రద్దు చేయడం ఒకటే మార్గం. కేసీఆర్ ప్రభు త్వం చిత్తశుద్ధితో సత్వరం స్పందించాలని కోరుతున్నాము.

 కొలిపాక శ్రీనివాస్  బెల్లంపల్లి, ఆదిలాబాద్
 
 కృత్రిమ ఎరువుల కొరత
 ఒకవైపు అకాల వర్షపాతం లేదంటే అనావృష్టితో కునారిల్లుతున్న తెలంగాణ రైతాంగానికి ఎరువుల కృత్రిమ కొరత వీడని పీడలా దాపురిస్తోంది. ఈ ముప్పేట దాడిని ఎదుర్కొనలేక కుప్పగూలుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు తీసుకోకుంటే వ్యవసాయానికి మంగళం పలికే రోజులు తప్పదు. తెలంగాణ రాష్ట్రం లో ఏర్పడిన ఎరువుల కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో ఏర్పడిన డిమాండ్ కారణంగా కొందరు వ్యాపారస్తులు, డీలర్లు అక్రమ నిల్వలకు పాల్పడి కృత్రిమ కొరతను సృష్టించి, ధరలను విపరీతంగా పెంచేశారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, లభ్యం కాని నాణ్యమైన విత్త నాలు, బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కాకపోవడం ఇత్యాది కారణాల వలన ఇప్పటికే పలు సమస్యలలో కూరుకుపోయిన రైతాం గానికి తాజాగా ఎరువుల కొరత మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా ఉంది. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామన్న తెరాస ప్రభు త్వం తన మాట నిలుపుకుని తక్షణం ఎరువుల కొరతను తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి. రైతు సమస్యల పరిష్కారా నికి, కృత్రిమ ఎరువు కొరత నివారణకు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఎరువుల కర్మాగారాల స్థాపనకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి.
 సీహెచ్ సాయిఋత్విక్  పాన్‌గల్ రోడ్డు, నల్లగొండ

 నిరుద్యోగుల వెతలు
 తెలంగాణలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1, 2 ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తున్నారే కానీ పని మాత్రం జరగటం లేదు. రాష్ట్ర విభజనలో భాగంగా ఉద్యోగుల పంపిణీ పూర్తి కాలేదన్న సాకుతో ఇంకె న్నాళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాయిదా వేస్తారు. ఇప్పటికే వేల మంది నిరుద్యోగులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైద రాబాద్‌కు తరలివచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. బీఈడీ, డీఎడ్ తదితర ఉపాధ్యాయ శిక్షణలు పూర్తి చేసుకున్న వారు సైతం డీఎస్సీ లేకపోవడంతో గ్రూప్ పరీక్షలకు సీరియస్‌గా సన్నద్ధమ వుతున్నారు. మరోవైపు ఎమ్మెస్సీ, ఎమ్మే తదితర పోస్ట్ గ్రాడ్యు యేషన్, ఇంజనీరింగ్ కోర్సులు చదివినవారు కూడా ఉద్యోగాలు లేక గ్రూప్స్ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటూ వేలరూపా యలను ఖర్చు పెట్టుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే తెలం గాణ ప్రభుత్వం మరికొన్నాళ్లు ఈ వ్యవహారాన్ని నానబెట్టే ప్రమా దం కనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల బాగోగులను పట్టించుకుంటే మంచిది. ఇకనైనా ప్రభుత్వం దృఢంగా పూనుకుని లక్షలాది నిరుద్యోగులు ఆశగా చూస్తున్న తెలంగాణ పీఎస్‌సీ ద్వారా గ్రూప్ 1, 2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ను త్వరగా విడుదల చేయాలి.
 పి.శ్రీనివాస్  అమ్మక్కపేట, కరీంనగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement