తగునా ‘పాఠాల’పై ఈ వేటు?
కొత్త కోణం
పిల్లలు తమ శక్తియుక్తులను పెంపొందించుకొని, తన హక్కులను గుర్తించడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించడానికి పాఠ్యాంశాలు ఉపయోగపడాలి. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల పట్ల సంయమనాన్ని, మానవత్వాన్ని, శాంతిని ప్రబోధించే విలువలకు కూడా పాఠ్యాంశాల్లో స్థానం కల్పించాలి. విద్యార్థుల్లో సమాజం పట్ల సరైన అవగాహనను పెంపొందించే పాఠాలను మరిన్నిటిని చేర్చే బదులు ఉన్నవాటినే తొలగిం చడం ద్వారా ఏపీ ప్రభుత్వం సామాజిక అంశాల పట్ల తన వైఖరిని చెప్పకనే చెప్పింది.
‘‘నా పేరేమిటి?’’ విచిత్రంగా ఉన్నా అశేష స్త్రీ జనవాహినిని మానసిక సంక్షోభంలోకి నెట్టే ప్రశ్న ఇది? వివాహానంతరం ఒకమ్మాయి కొద్ది కొద్దిగా తన అస్తిత్వాన్ని కోల్పోయి, చివరకు తన పేరుని కూడా మరచిపోయిన వైనంపై ప్రముఖ తెలుగు రచయిత్రి పి. సత్యవతి రాసిన ‘ఇల్లలకగానే...’ అనే అద్భుతమైన కథ ఇది. పెళ్లయిన తరువాత ఒకరికి భార్యగా, పిల్లలకు తల్లిగా, అత్తమామలకు కోడలుగా, పనిమనిషికి చిన్నమ్మగా.. రకరకాలుగా పిలిపించు కునే ఆమెను సొంత పేరుతో పిలిచే వారెవరూ అత్తవారింట ఉండరు. పాఠశాల రికార్డులను పరిశీలించి, సర్టిఫికెట్లలో చూసి ఆమె చివరకు తన పేరు శారద అని నిర్ధారించుకుంటుంది. మన వ్యవస్థలో స్త్రీల జీవితాలకు అద్దంపట్టే ఈ అద్భుతమైన కథ అవిభక్త తెలుగు రాష్ట్ర 10వ తరగతి ఇంగ్లిషు పాఠ్య పుస్తకంలో ఎనిమిదవ అధ్యాయంలో ఉండేది. చిన్ననాటి నుంచే బాలబాలిక లలో స్త్రీ, పురుష సమానత్వాన్ని, సామాజిక అవగాహనను పెంపొందిం చేందు కోసం దాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ఆ పాఠాన్ని ఇప్పుడా పాఠ్య పుస్తకంలోంచి తొలగించారు. దానితో పాటూ అసమానతలను ధిక్కరించే చైతన్యాన్ని అందించే పలు ఇతర పాఠ్యాంశాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిలబస్ నుంచి తొలగించింది.
సమానత్వ బోధన నేరమా?
‘‘పిల్లలు తమ జీవితానికి ఒక సార్ధకతను ఏర్పరుచుకొని, శక్తియుక్తులను పెంపొందించుకొని, తన హక్కులను గుర్తించడంతో పాటు, ఇతరుల హక్కు లను కూడా గౌరవించడానికి పాఠ్యాంశాలు ఉపయోగపడాలి.’’ అంటూ 2005వ సంవత్సరంలో నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ సమర్పించిన నివేదిక పేర్కొంది. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల పట్ల సంయమనంతో మెలగడం, మానవత్వాన్ని, శాంతిని ప్రబోధించే విలువలకు కూడా పాఠ్యాం శాల్లో స్థానం కల్పించాలని అది స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దానికి భిన్నంగా పాఠ్యాంశాల్లో పొందుపరచిన అటువంటి అనేక పాఠ్యాంశాలను ఈ సంవత్సరం తొలగించి, సామాజిక అంశాల పట్ల తన వైఖరిని చెప్పకనే చెప్పింది. అదే పాఠ్యపుస్తకంలోని ‘‘సామాజిక సమస్యలు’’, ‘‘మానవ హక్కులు’’ అనే రెండు అధ్యాయాలను తొలగించారు. విద్యార్థుల్లో సమాజం పట్ల సరైన అవగాహనను పెంపొందించే పాఠాలను మరిన్నిటిని చేర్చే బదులు ఉన్నవాటినే తొలగించడం ఎంత మాత్రం ఆహ్వానించదగినది కాదు.
గత పాఠ్య పుస్తకంలో ఐదవ అధ్యాయంలో ఉన్న స్టొరీడ్ హౌస్-1, స్టొరీడ్ హౌస్-2 పాఠాలు ఉండేవి. ఇవి గ్రామాల్లో కొనసాగుతోన్న కుల వివక్షకు దర్పణం పట్టేవి. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో మహర్ కులానికి చెందిన భయ్యాజీ కొంత కాలం ముంబై డాక్‌యార్డ్‌లో పనిచేసి సొంత ఊరికి తిరిగి వస్తాడు. ఆయన జీవితాశయం పలు అంతస్తుల భవనం కట్టుకోవడం. కూడబెట్టిన డబ్బుతో ఆయన తన కల నెరవేర్చుకోవాలనుకుంటాడు. ఆయ నకు ఆరుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్లలో ఒక్క చిన్న కొడుకు తప్ప అందరూ స్థిరపడ్డారు. తండ్రి ఆలోచనను విన్న పిల్లలంతా సంతోషపడ్డారు. అయితే ఆ గ్రామ పెత్తందారు దాన్ని హర్షించలేకపోయాడు. ‘‘నువ్వు అటు వంటి భవనం కడితే ఇక్కడ ఉండవు’’అతడు భయ్యాజీని బెదిరిస్తాడు. అయినా దళితుడైన భయ్యాజీ ఇంటికి శంకుస్థాపన జరిగింది.
బయటకు చిన్న ఇల్లు లాగానే కనిపించేట్టు ఉంచి, లోపల పైన ఒక అంతస్తు వేస్తాడు. గృహ ప్రవేశానికి ఆహుతులంతా వస్తారు. ఆధిపత్య కులస్తుడైన గ్రామ పెత్తందారు కూడా వస్తాడు. అసూయ, ద్వేషం ఆయన మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. అంతలోనే ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై, చూస్తుండ గానే భయ్యాజీ కలల ప్రపంచం కూలి బూడిదవుతుంది. గోడల పైన ఉన్న బుద్ధుడు, అంబేడ్కర్ బొమ్మలను తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళిన భయ్యాజీ పూర్తిగా కాలిపోతాడు. ‘‘నాకు ఎటువంటి కోరికా లేదు. ఇక్కడ అంతస్తుల భవనం కట్టాలనుకున్నాను. అది నెరవేరలేదు’’ అంటూ కన్నుమూస్తాడు.
సాంప్రదాయం ప్రకారం భయ్యాజీ అంత్యక్రియలు జరిగాక భయ్యాజీ కొడుకులు ఏడుపుని దిగమింగుకొని, తమ తండ్రి అంతస్తుల భవనం కట్టాల నుకున్న చోటనే దాన్ని తిరిగి నిర్మించడానికి పునాదులు తవ్వడం మొదలు పెడతారు. తండ్రి చనిపోయిన వెంటనే ఈ పనేమిటంటే... ఆ భవవాన్ని కట్టనిదే మా నాన్న ఆత్మకు శాంతి లేదు’’ అని చెప్పడంతో కథ ముగుస్తుంది. ఈ పాఠం సమాజంలో నెలకొన్న సామాజిక అసమానత లపై అవగాహన కల్పించి, అవి న్యాయం కాదన్న విలువను కూడా విద్యార్థులకు బోధిస్తుంది. పెత్తందారు ద్వేషం వల్లనే ఆ అగ్ని ప్రమాదం జరిగిందనేది విద్యార్థుల ఊహకు స్ఫురిస్తుంది. ఇలాంటి పాఠ్యాంశాలు విద్యార్థులను ఆలోచింప జేస్తాయి. పైగా ఈ పాఠం చివర కులం సమస్యలపై అంబేడ్కర్ అభిప్రాయా లను పొందుపరిచారు. కులం దేశ అభివృద్ధికి ఆటంకమని చివర న తెలిపారు. దేశ పురోగతికి అడ్డంకిగా ఉన్న కుల సమస్యను తొలగించాలనే సందేశాన్ని అందించే ఈ పాఠాన్ని ఏపీ ప్రభుత్వం తొలగించింది. సామాజిక సమస్య అనే అధ్యాయం మొత్తాన్ని పాఠ్యపుస్తకం నుంచి తొలగించారు. ఇది ఒకరకంగా కుల ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ప్రభుత్వ దృక్పథానికి అద్దం పడుతోంది.
అంబేడ్కర్ బోధనలకూ కత్తెరేనా?
ఒకవైపు బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా జరుపు తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఇటువంటి చర్యకు పూనుకోవడం పాలకుల కుటిల నీతికి అద్దం పడుతోంది. కుల వివక్ష, అంటరానితనం ఎంతటి విధ్వంసం సృష్టించగలవో ఆ పాఠంలో వివరించారు. ఒకరకంగా అది విద్యార్థుల మనసుల్లో అంటరానితనం నేరమనే భావన ఏర్పడుతుంది. కానీ ఏపీ విద్యాశాఖ ఈ పాఠ్యాంశాన్ని తొలగించడం ద్వారా ఏం సాధించ దల్చుకున్నదో తెలియదు. ఉపాధ్యాయుల్లో చాలామంది ఈ పాఠాన్ని తొలగించాలని అడిగారని, ఈ పాఠం చెప్పడం ఇబ్బందిగా ఉన్నదని కుంటి సాకులు చెప్పడం బాధాకరం.
ఒకవేళ అదే నిజమైతే, ఉపాధ్యాయుల్లోని కుల తత్వాన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. వారికి కూడా సరైన అవగాహన కల్పించిన తర్వాతే బోధనకు అర్హులని ప్రకటించాల్సి ఉంటుంది. అంటరాని తనం, అంటరాని కులాల పట్ల వివక్ష తరతరాలుగా సమాజంలో గూడు కట్టుకొని ఉన్నది. దానిని శాశ్వతంగా నిర్మూలిస్తే తప్ప ఒక సమభావన ఏర్పడదు. పాఠ్యాంశాల్లో ఏవైతే ఈ సమాజానికి తప్పనిసరి అవసరమో వాటినే తొలగించడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో ఆలోచించచడం అవ సరం. అంబేడ్కర్ కులంపై ఎంతో శాస్త్రీయంగా రాసిన విషయాలను కూడా తొలగించడం విద్వేషపూరితమైన చర్య. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడానికిగాను నిరంతరం మనం ఎన్నో రకాల విధానాలను రూపొందించుకుంటున్నాం. రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి, కిందిస్థాయి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సంకల్పిస్తున్నాం. కానీ అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే, ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించే లక్షణం కుల వ్యవస్థకు ఉన్నది.
కుల విభజన వల్ల ప్రజాస్వామ్యం మనగలగడం అసాధ్యం.’’ ఈ విధమైన అంబేడ్కర్ ఆలోచనలను విద్యార్థులకు పరిచయం చేయడం వల్ల సామాజిక స్పృహ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. సాంఘిక శాస్త్రంలో భారత రాజ్యాంగంపైన ఉన్న పాఠ్యాంశాన్ని కూడా తొలగించారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ ఈ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించారు. రాజ్యాంగం నిర్మాణం జరిగిన తీరుతెన్నులు విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఈ దేశ రాజకీయ చరిత్ర తెలుస్తుంది. ప్రస్తుతం అమలు జరుగుతున్న ఎన్నికలు, పరిపాలన, ఆర్థిక రాజకీయ విధానాల నేపథ్యం వారికి అర్థం అవుతుంది. అటువంటి పాఠాలను తొలగించడం అంటే, రాజ్యాంగానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడమే.
పునరాలోచన అవసరం
అదే విధంగా పదవ తరగతి ఇంగ్లిషు పుస్తకం ఎనిమిదవ అధ్యా యంలోని మానవ హక్కులు అనే పాఠాన్ని కూడా తొలగించారు. తొలగిం చిన‘‘జమైకా ఫ్రాగ్‌మెంట్’’ అనే పాఠంలో నల్లజాతి పట్ల సర్వసాధారణంగా ఉండే వివక్షను చాలా సున్నితంగా రచయిత వివరించారు. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకరు నల్లగా, ఒకరు తెల్లగా పుట్టారు. అయితే బయట చూసే వారికి ఇది వేరుగా కనపడుతుంది. తల్లిదండ్రులు కూడా వేర్వేరు రంగులు, వేర్వేరు దేశాలకు చెందిన వారు. ఆ పాఠం ద్వారా వర్ణ వివక్షను కూడా విద్యార్థులు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ పుస్తకంలోని ఐదవ యూనిట్‌కు అనుబంధంగా అమెరికా మానవ హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ ‘ఐ హావ్ ఎ డ్రీమ్’ అనే చారిత్రాత్మకమైన ఉపన్యాసాన్ని అను బంధంగా అందించారు. విద్యార్థులకు ఎంతో ఉత్తేజాన్నిచ్చే దీన్ని కూడా తొలగించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి.
పాఠాలను కూడా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మార్చుకోవచ్చు. కానీ థీమ్స్(అంశాల)ను మార్చకూడదు. సామాజిక సమస్యలు, మానవ హక్కులు (హ్యూమన్ రైట్స్) అనే యూనిట్‌లనే తొలగించడం పథకం ప్రకారమే జరిగిందని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయం ఇప్పటికైనా పునరాలోచించడం అవసరం. మానవ హక్కులు, సామాజిక సమస్యలపై పాఠాలను తిరిగి పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, మానవహక్కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలు, ప్రజాస్వామికవాదులు, ఉపాధ్యాయ సంఘాలు చొరవ చూపాలి. ప్రభుత్వం చేసిన ఈ తప్పును సరిదిద్దుకునేంత వరకు ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇది దేశ ప్రజాస్వామ్య ఆలోచనలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213