జలయజ్ఞానికి అబద్ధాల అడ్డుకట్ట! | K Chandrasekhar rao lies on water projects | Sakshi
Sakshi News home page

జలయజ్ఞానికి అబద్ధాల అడ్డుకట్ట!

Published Wed, Mar 26 2014 12:22 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

జలయజ్ఞానికి అబద్ధాల అడ్డుకట్ట! - Sakshi

జలయజ్ఞానికి అబద్ధాల అడ్డుకట్ట!

 తెలంగాణ  ప్రాజెక్టుల సాధనకు ఏ రోజూ పాటుపడకుండా, కేవలం ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లిస్తే అదే నిజం అవుతుందని నమ్మే కేసీఆర్ తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ నీటిని రాయలసీమకు అక్రమంగా తరలిస్తున్నారని విష ప్రచారం చేశారు.
 
     రాజకీయాలు ఇంత అధఃపాతాళానికి చేరాయా? అనిపించేటట్టు నేటి నాయకుల ప్రవర్తన ఉన్నది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన హంద్రీ-నీవా, గాలేరు నగరి, వెలిగొండ తదితర ప్రాజెక్టులన్నీ అక్రమంగా నిర్మిస్తున్నవని, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ అవసరాలకు చేపట్టిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ, నెట్టెంపాడు, కల్వకుర్తి భీమా తదితర ప్రాజెక్టులు అవసరాలు తీరిన తరువాతనే నీటి విడుదల ఉంటుందని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దారుణం.
 
  ఒక పాలకుడి దార్శనికతకు, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక నేత నిబద్ధతకు తాగునీరు, సాగునీరు పథకాలు అద్ధం పడతాయి. 1972లో ఇరిగేషన్ కమిషన్ గుర్తించిన  ‘నిరంతర కరువుపీడిత ప్రాంతాల’  అవసరాలు తీర్చడానికి ప్రయత్నించి, పరిణత నేతగా నిలిచిన వారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని మెట్ట ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించాలని అన్ని పార్టీలూ ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో నల్లగొండ మహబూబ్‌నగర్ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ తప్పిదాన్ని  సవరించడానికి డాక్టర్ వైఎస్  జల‘యజ్ఞం’తో  ప్రయత్నించారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే కోయిల్‌సాగర్ స్టేజ్-1, స్టేజ్-2, నెట్టెంపాడు, కల్వకుర్తి బీమా పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆయన తెలంగాణ  ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి పోతిరెడ్డిపాడు, రాయలసీమలోని ఇతర ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని ఎవరైనా నిరూపించగలరా?
 
  తెలంగాణ  ప్రాజెక్టుల ప్రాధాన్యతలను గుర్తించకుండా, వాటి సాధనకు ఏ రోజూ పాటుపడకుండా కేవలం ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లిస్తే అదే నిజం అవుతుందని నమ్మే కేసీఆర్ తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ నీటిని రాయలసీమకు అక్రమంగా తరలిస్తున్నారని విష ప్రచారం చేశారు. జలయజ్ఞం రాష్ట్రంలో అమలు పరచగలిగితే కోస్తాలో 88 శాతం, తెలంగాణలో 60 శాతం, రాయలసీమలో 32 శాతం సేద్యపునీటి వనరులు అందుబాటులోకి వస్తాయి. జలయజ్ఞం ప్రాజెక్టులను  విశ్లేషిస్తే ఇది సులభంగానే అర్థమవుతుంది.
 
 ఈ వ్యయాలలో ప్రాంతీయ వివక్ష ఉందా? వైఎస్ జలయజ్ఞంలో చేపట్టిన పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్, ప్రాణహిత- చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దేవాదుల, యల్లంపల్లిలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని వైఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వీటిలో రాయలసీమ ప్రాజెక్టులు లేకపోవడం గమనార్హం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ద్వారానే జలవనరులను అన్ని ప్రాంతాల అవసరాలు తీర్చడానికి ఉపయోగించుకునేఅవకాశం ఉందని వైఎస్ కుమారుడు జగన్ చెబుతూనే ఉన్నారు. కానీ పర్యవసానాల గురించి ఆలోచించకుండా జగన్‌మోహన్‌రెడ్డినీ, వైఎస్సార్‌సీపీనీ నిలువరించడానికి రాష్ట్రాన్ని విభజించారు. సీమాంధ్రులకు ఏ విధమైన హామీలూ హక్కులూ  దక్కకుండానే విభజన ప్రక్రియ ఊపందుకుంటున్నది.  
 
  రెచ్చగొట్టే ప్రకటనలతో ఒక ప్రాంతాన్ని దిగజార్చి మాట్లాడడం కేసీఆర్‌కే చెల్లింది. కేసీఆర్  స్థానం ఎక్కడో 2009లో వైఎస్ చూపించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడానికి తెలంగాణ ఉద్యమాన్ని బలపరచి నిలబెట్టింది. కిరణ్‌కుమార్‌రెడ్డి అవకాశవాద పద్ధతుల్లో విభజనకు కేంద్రానికీ, సోనియాకూ సహాయం అందించారు. వీళ్లంతా సీమాంధ్రకే కాదు తెలంగాణకు కూడా తీవ్రమైన ద్రోహం చేశారు. ప్రత్యామ్నాయాలు సూచించక, ఏర్పడబోయే పరిణామాలు ఆలోచించకుండా రాష్ట్రాన్ని విడగొట్టారు. కేసీఆర్ రాజకీయ ఉన్మాదంతో చేస్తున్న వ్యాఖ్యలకు వీరే బాధ్యత వహించాలి.
 
 జలయజ్ఞంలో గత ఐదేళ్లలో
 వివిధ ప్రాంతాలకు చేసిన వ్యయం(రూ. కోట్లలో)
 
 ప్రాంతం    పాలనాపరమైన మంజూరు    చేసిన వ్యయం
 ఆంధ్రా            45,375.98        13,575.35
 రాయలసీమ        24,394.81        14,300.69
 తెలంగాణ         1,10,120.95        25,330.25
 
 సందర్భం: ఇమామ్
 
 (వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకుడు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement