'ప్రాజెక్టులన్నింటికీ అంతర్రాష్ట్ర వివాదాలే'
హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ అంతర్రాష్ట్ర వివాదాలు ఉండేలా ఏర్పాటుచేశారని అన్నారు. పర్యావరణ అనుమతులు రాకుండా ఉమ్మడి పాలకులు కుట్రలు చేశారని చెప్పారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్, ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఈ విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ ఎదురుగా ఒక తెర, కుడి ఎడమ వైపుల రెండుతెరలు ఏర్పాటు చేశారు. ఇక శాసన మండలి దర్బార్ హాల్లో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ తన వద్ద ఒక కంప్యూటర్ పెట్టుకుని, దాన్ని ఈ తెరలన్నింటికీ అనుసంధానం చేశారు.
కాగా, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కాంగ్రెస్, టీడీపీలు దూరంగా ఉన్నాయి. అసెంబ్లీలో ఇలా ప్రజంటేషన్ ఇవ్వడం సరికాదని కాంగ్రెస్ అంటోంది. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గోదావరిలో 940 , కృష్ణాలో376 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని అన్నారు. కాకతీయ రెడ్డి రాజులు, కుతుబ్ షాహీలు ఎన్నో చెరువులు తవ్వించారని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాంసాగర్ అని కేసీఆర్ చెప్పారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పారు.