- నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న16 ప్రాజెక్టులకు 10 వేల మెగావాట్లు అవసరమని ప్రభుత్వ అంచనా
- ఈ జూన్ నాటికే 2 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం
- ఏటా విద్యుత్ వినియోగానికి అవసరమయ్యే ఖర్చు రూ.12 వేల కోట్లపైనే
- అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల ప్రాజక్టులకు విద్యుత్ అవసరాలు హెచ్చుగానే ఉండనున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న 16 ప్రాజెక్టులకు 10 వేల మెగావాట్లకుపైగా విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా. ఈ ఏడాది జూన్-జులై నాటికి అందుబాటులోకి వచ్చే ఎత్తిపోతల పథకాలకు సుమారు 2 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ నివేదిక తయారు చేసింది. ఈ ఎత్తిపోతల విద్యుత్ అవసరాలు, వాటికయ్యే ఖర్చు తదితరాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన ‘పవర్’ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
16 ఎత్తిపోతల ప్రాజెక్టులతో సుమారు 50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని, మరో 3 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎత్తిపోతల పథకాలతో సుమారు 507 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించింది. ప్రాణహిత, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి ఎత్తిపోతల పథకాలను మినహాయిస్తేనే పాక్షికంగా నిర్మితమైన దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, సీతారామ ప్రాజెక్టులకే సుమారు 2,800 మెగావాట్ల వరకు విద్యుత్ అవసరం ఉంది. కొత్తగా చేపట్టిన ప్రాణహిత, కాళేశ్వరాలకు సుమారు 3,640 మెగావాట్లు, పాలమూరు, డిండికి కలిపి 3,500 మెగావాట్లు అవసరమని అధికారులు లెక్కించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులన్నీ వినియోగంలోకి వచ్చి 9,975 మెగావాట్ల విద్యుత్‌ను వాడుకుంటే యూనిట్‌కు రూ.5 చొప్పున చెల్లించినా ఏటా మొత్తంగా సుమారు రూ.12 వేల కోట్ల భారం ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం యాదాద్రి, భద్రాద్రి, సింగరేణి-జైపూర్, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఏ జిల్లా ఎత్తిపోతల పథకాల అవసరాలను ఎలా తీర్చుతామన్న దానిపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఎత్తిపోతలపై సీఎం ‘పవర్’ పాయింట్!
Published Mon, Mar 28 2016 2:40 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement