
అడుగులు నేర్చిన ఆదర్శం
సందర్భం
మోదీ రెండేళ్ల పాలన
మహిళలు ఆరాధనా శక్తిగానే కాదు ఆర్థికశక్తిగా కూడా ఎదగాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా సగం ఉండాలని భావించి మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. గత రెండేళ్ల పాలనలో ముద్ర యోజనలో 79 శాతం రుణాలు మహిళలకే లభించాయి. బాలికల కోసం 2,61,400 పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి కల్పించారు. తద్వారా బాలికల హాజరు శాతం ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. 44 లక్షల మంది గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చారు.
‘భారత ప్రజల అంచనాలకు మించి నరేంద్రమోదీ సర్కారు విజయాలు సాధించింది’ అంటూ బీజేపీ అగ్ర నేత అభినందించడం ఎంతో వాస్తవం. చరిత్రాత్మక ప్రజా తీర్పుతో 2014 మే మాసంలో అధికారం చేపట్టిన మోదీ ఏ విధంగా చూసినా రెండేళ్ల పాటు దేశానికి విశిష్టమైన పాలన అందించారు. అయితే సాధించవలసినది ఇంకా ఎంతో ఉందన్న స్పృహతో మిగిలిన పాలనా కాలాన్ని కూడా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో మోదీ ఉన్నారు. అందుకే రెండేళ్ల పాలన సందర్భాన్ని ‘అభివృద్ధి పథంలో భారత్’ నినాదంతో నిర్వహించుకోవాలని, నేటి నుంచి (26వ తేదీ)జూన్ 15 వరకు ఎన్డీయే విజయాలను ప్రజలకు తెలియచేయాలని బీజేపీ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 33 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగానే 16 మంది కేంద్ర మంత్రులతో, ఎనిమిది బృందాలు తెలం గాణలో పర్యటించనున్నాయి.
మోదీ ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడానికి ప్రధాన కారణం- గ్రామీ ణాభివృద్ధికీ, పేదలూ రైతుల సంక్షేమానికీ, మహిళలు, యువత, కార్మికుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడమే. పారదర్శకతతో, అవినీతి మచ్చ లేకుండా జవాబుదారీతనంతో పనిచేస్తూ, అట్టడుగు వర్గాలను అభివృద్ధిలో భాగ స్వాములను చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కింది. మోదీ నాయకత్వం స్ఫూర్తిదాయకమైనది. మునుపెన్నడూ లేని రీతిలో దేశ ప్రజలు ఆయన మీద విశ్వాసం పెంచుకున్నారు.
అందుకు నిదర్శనం-వెసులుబాటు ఉన్నవారు ఎల్పీజీ రాయితీని వదులుకోవలసిందంటూ ప్రధాని ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన. కోటి మందికి పైగా రాయితీని వదులుకున్నారు. ఇలా ఆదా అయిన సొమ్ముతో పేద, బడుగు వర్గాల మహిళలను కట్టెల పొయ్యిల నుంచి విముక్తం చేయడానికి మోదీ ప్రభుత్వం నడుం కట్టింది. ఐదు కోట్ల మందికి రూ. 1,600 రాయితీతో ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నది.
ముద్ర పథకం ప్రవేశపెట్టి చిరు వ్యాపారులను, నిరుపేదలను వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీల బాధ నుంచి విముక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ యువకులు, మహిళలు ఉద్యో గార్థులుగానే ఉండిపోకుండా, ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరు కోవడానికి వీలు కల్పిస్తూ ప్రధాని స్టాండప్ ఇండియా పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద దేశంలోని 1.25 లక్షల బ్యాంకుల శాఖలలో ఒక్కొక్క శాఖ రెండు రకాల రుణాలు ఇస్తున్నాయి.
రెండున్నర లక్షల మంది యువతకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం వచ్చింది. స్టాండప్ ఇండియా పథకంలో 10 లక్షల నుంచి కోటి రూపాయల రుణ సదుపాయం కల్పించారు. మనిషిని మనిషి లాగడం (రిక్షాలో) అమానవీయమని రామ్‌మనోహర్ లోహియా ఎప్పుడో అన్నారు. కానీ దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు, కమ్యూనిస్టులు కూడా ఈ విషయం పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోనే కోటిన్నర మందికి ఈ-రిక్షాలు అందచేశారు. మత్స్యకారులకు ఈ-పడవలు కూడా అందచేశారు.
మేక్ ఇన్ ఇండియా
మేక్ ఇన్ ఇండియాను స్కిల్ ఇండియాతో అనుసంధానం చేసిన మోదీ ప్రభుత్వం దేశంలో పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి యువతకు విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తోంది. స్వచ్ఛభారత్ ప్రధాని సమున్నతా శయంతో ఆరంభించిన పథకం. దీనికి స్పందన కూడా అంతే స్థాయిలో ఉంది. ప్రపంచం కుగ్రామంగా మారిన ప్రస్తుత సాంకేతిక యుగంలో భారతీయ యువతను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం స్కిల్ ఇండియాను ప్రవేశపెట్టింది. భారత్‌లో పరిశుభ్రత అన్న ఆలోచన స్థిరపడడానికి ఇది దోహదం చేస్తోంది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి చేత ప్రకటింప చేయడంలో మోదీ విజయం సాధించారు.
గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం
మోదీ మొదటి నుంచి గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారు. పంచా యతీలకు, గ్రామ సభలకు ప్రాధాన్యం కల్పిస్తూ అంబేడ్కర్ జన్మదినం ఏప్రిల్ 14 నుంచి పంచాయతీరాజ్ దివస్ పేరుతో 24వ తేదీ వరకు గ్రామాలలో కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ సభలలో ప్రధాని స్వయంగా పాల్గొని తన నిబద్ధతను చాటుకున్నారు. ఒక్కొక్క పంచాయతీకి రూ. 80 లక్షలు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి బాటలు వేశారు.
మున్సిపాలిటీలకు కూడా నేరుగా నిధులు మంజూరు చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి వినూత్న చర్యలు చేపట్టారు. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని లాభసాటి వృత్తిగా మార్చాలన్న దృక్పథంతో మోదీ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. రైతులకు సేద్యం పట్ల అవగాహన కల్పించ డానికి సరైన సూచనలు, సలహాలు సమాచారం అందించడానికి కిసాన్ రేడియో, కిసాన్ చానల్‌ను ప్రారంభించారు. భూమికి సైతం పరీక్షలు నిర్వహించి కార్డులు ఇవ్వాలని తద్వారా ఏ పొలంలో ఏ పంట వేయాలి, ఏ ఎరువు వాడాలి అనే పూర్తి వివరాలతో రాబోయే 3 ఏళ్లలో 14 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను వితరణ చేయాలని తలపెట్టారు. ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వేపపూత యూరియాను తప్పనిసరి చేయడం, ఉపాధి హామీ పథకం (ఎమ్‌జి ఎన్‌ఆర్‌ఈజీఏ) క్రింద 5 లక్షల చెరువులు, కుంటలను నిర్మించడం రైతుకు ఎనలేని ప్రయోజనాలు చేకూర్చేవే.
మహిళా సంక్షేమానికి చర్యలు
మహిళలు ఆరాధనా శక్తిగానే కాదు ఆర్థికశక్తిగా కూడా ఎదగాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా సగం ఉండాలని భావించి మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. గత రెండేళ్ల పాలనలో ముద్ర యోజనలో 79 శాతం రుణాలు మహిళలకే లభిం చాయి.
బాలికల కోసం 2,61,400 పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి కల్పిం చారు. తద్వారా బాలికల హాజరు శాతం ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. 44 లక్షల మంది గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చారు. పోలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు (ఇప్పటికే 8 రాష్ట్రాలు అంగీకరించాయి). పొగబారిన వంటింటి యాతనల నుంచి విముక్తం చేసి ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వంటింటిని కల్పించి పేద మహిళల ఆరోగ్యం కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు.
ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపు
మోదీ అధికారం చేపట్టిన తరువాత బ్రిక్స్ కూటమిలో భారత్ ప్రత్యేకతను సంతరించుకుంది. చైనాను మించిన వేగంతో ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశంగా ఖ్యాతి తెచ్చుకుంది. డాలరు పతనమై, ప్రపంచం తలకిందులైన కాలంలో కూడా భారత్ నిలదొక్కుకోగలిగింది. కార్మికుల ప్రయోజనాలే ప్రధానంగా ప్రభుత్వం పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ సదుపాయం కల్పించడం ద్వారా అవకతవ కలకు చరమగీతం పాడింది. దాదాపు 1054 కాలం చెల్లిన చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. జన్‌ధన్‌యోజన, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథా రిటీ, గంగా ప్రక్షాళన, స్మార్ట్ సిటీలు, అసంఘటిత కార్మిక రంగానికి అటల్ పింఛను యోజన కూడా విశిష్టమైన సంక్షేమ పథకాలుగా పేర్గాంచాయి. బుల్లెట్ రైళ్ల యోచన కార్యరూపం దాలిస్తే భారత్‌కు కొత్త రూపు తథ్యం.
విదేశాంగ విధానం
మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని భారత ప్రజలతో పాటు, సార్క్ దేశాల ఉత్సవంగా నిర్వహించడం మంచి సంకేతాలను పంపింది. మాల్దీవులతో సహా సార్క్ దేశాలను ఆయన ఆ ఉత్సవానికి ఆహ్వానించారు. చివరి క్షణం దాకా ఉత్కంఠలో ఉంచినా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు.
అయితే నాటి అటల్ బిహారీ వాజ్‌పేయి వలెనే పాకిస్థాన్‌తో సత్సంబంధాలకు మోదీ ఎంత యత్నించినా ఆ దేశం ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థల ప్రభావం నుంచి బయట పడలేకపోతోంది. చైనాతో సంబంధాలు యథావిధిగానే ఉన్నప్పటికీ, ఆ దేశం ప్రభావం శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల మీద తగ్గించడంలో భారత్ విజయం సాధించింది.
అమెరికాతో భారత్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. భూటాన్, మాల్దీవులు, మైన్మార్, శ్రీలంకల సంబంధాలకు కాంగ్రెస్ హయాంలో జరిగిన చేటును సరిదిద్దే ప్రయత్నంలో మోదీ ఎంతో ముందుకు వెళ్లగలిగారు. బంగ్లా-భారత్ ల్యాండ్ బౌండరీ ఒప్పందం ఇందుకు నిదర్శనం. దీనితో బంగ్లాలో చైనా సాగిస్తున్న నౌకాశ్రయాల నిర్మాణాల జోరు తగ్గింది. యెమెన్ సంక్షోభ వేళ కేరళకు చెందిన వందలాది మంది నర్సులను సురక్షితంగా సొంత గడ్డకు చేర్చడంలో మోదీ, విదేశాంగ మంత్రి సుష్మ, మరో కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన కృషి శ్లాఘనీయమైనది. వాజ్‌పేయి బాటలోనే పాక్‌తో సంబంధాలను మెరుగుపరచాలని మోదీ చేస్తున్న కృషి ఫలించాలని అందరూ ఆశిస్తున్నారు.
సాగని కుట్రలు
ముప్పయ్ సంవత్సరాల తరువాత భారతదేశంలో స్వతంత్రంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిదంటే, అది మోదీకి ఉన్న ప్రజాదరణతో సాధ్యమైంది. దీనిని అస్థిర పరచడానికి పాత శత్రువులే కొత్త వ్యూహాలతో ముందుకు వచ్చారు. అవినీతి జాడ లేని మోదీ ప్రభుత్వాన్ని చూస్తుంటే సహజంగానే కాంగ్రెస్‌కు గుబులు పట్టుకుంది. ఎన్ని చిక్కులు కల్పించాలని చూసినా అన్నిటిని అధిగమించడం చూస్తే వామపక్షవాదులకు కూడా కన్నెర్రగానే ఉంది. మోదీకి గానీ, కేంద్రానికి గానీ సంబంధం లేని వివాదాలను, అల్లర్లను అంటగట్టడానికి తమ వంతు విఫలయత్నం చేశారు. ఈ వివాదాలను ప్రజలు పట్టించుకోలేదు. కొన్ని అపజయాలు తప్పకపోయినా, ఈ రెండేళ్లలో ఆరు రాష్ట్రాలలో బీజేపీ కొత్తగా అధికారంలోకి రాగలిగింది. మోదీ ప్రాచుర్యానికీ, ప్రాభవానికీ ఇదే నిదర్శనం.
డాక్టర్ కె. లక్ష్మణ్
వ్యాసకర్త బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్ : 9246537889