మీడియానే ఆప్‌ను ముంచిందా?
విశ్లేషణ
వాస్తవానికి నరేంద్రమోదీ ప్రభంజనాన్ని తట్టుకుని, కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీనే మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలను గెలవడంలో దాని అసమర్థతే మీడియాకు అతి పెద్ద వార్త అయిపోయింది.
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌పై నియంత్రణను భారతీయ జనతా పార్టీ నుంచి లాగేసుకోవడంలో ఆమ్‌ఆద్మీ పార్టీ పూర్తి అసమర్థతతో వ్యవహరించడం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు నిజంగానే ఒక మేలుకొలుపు లాంటిది. ఓటర్లపై ఎన్నికల సీజన్‌లో మాత్రమే అభిమానం కురిపించడం కాకుండా మొత్తం పాలనా ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయాలనే ఆమ్‌ఆద్మీ పార్టీ భావనకు ‘సుప్రీమో’ అనే భావన పూర్తిగా వ్యతిరేకమైనది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో తాము ప్రజలతో సాన్నిహిత్యాన్ని కోల్పోయామని ఆప్ పార్టీ అంగీకరించడమే కాకుండా ఓటర్ల వద్దకు వెళ్లాలని, వారికి మళ్లీ దగ్గరవ్వాలని తన శాసన సభ్యులను కోరిం ది. ఓటర్లు అంటే వాడుకుని విసిరేసే వస్తువుల వంటివారు అనే చట్రంలోకి ఆప్ కూడా తన ఆచరణ ద్వారా వెళ్లిపోయిందని ఈ ప్రకటన చెప్పకనే సూచిస్తోంది.
నరేంద్రమోదీ బలమైన ఆకర్షణ, కొత్త అభ్యర్థులను మాత్రమే బరిలో దింపడం ద్వారా మెరుగైన సుపరిపాలనను అందిస్తామని ఆయన ఢిల్లీ ఓటర్లకు చేసిన వాగ్దానం బీజేపీకి పూర్తి అనుకూలంగా పనిచేశాయి. కానీ ఇది నాణేనికి సగం వైపు మాత్రమే మరి. జాతీయ పార్టీల పట్ల వ్యవహరించడంలో కేజ్రీవాల్‌లో మొరటుదనం, కాఠిన్యం లేకున్నట్లయితే, నిలకడైన ప్రాతిపదికన ఓటర్ల దృఢమైనవిశ్వాసాన్ని పొందు తూ నెమ్మదిగా ఎదుగుతున్న పార్టీ నేతగా ఆయన వెలిగేవారు. కానీ ఆయన నియంత్రణలో లేని మరొక విషయం ఏమిటంటే ఇతర రాజకీయ పార్టీలలో భయం కలిగించిన ఆమ్ ఆద్మీ పార్టీ తక్షణ ప్రాతిపదికే మరి.
కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ మధ్యేవాద లేదా వామపక్ష పార్టీ అయినా చాలావరకు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా ఉనికిలో ఉంటున్నాయి. వీటికి తప్పనిసరిగా సంస్థాపక వ్యవస్థ అవసరం. పార్టీలు కూడా వ్యవస్థలో భాగం కాబట్టి, పార్టీల కంటే వ్యవస్థలే ఎక్కువగా మనుగడ సాధించి, ఎదగాల్సిన అవసరం ఉంది. అందుకే అవి ఢిల్లీలో ఆమ్ ఆద్మీపై తీవ్రస్థాయిలో యుద్ధాలకు, ఘర్షణలకు దిగుతూ వచ్చాయి. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 కి 67 స్థానాలు గెలిచినప్పటికీ ఆమ్ ఆద్మీ తన బలాన్ని అట్టిపెట్టుకోవడానికి మరింత దూకుడుతనాన్ని అలవర్చుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై నిందమోపడం అనే సిల్లీ వ్యూహాన్ని అది తాజాగా అవలంబించినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ తొలినుంచీ తీవ్ర నిరసనలను వ్యక్తం చేయడం అనే వ్యూహంతోటే నడిచింది. అదే సమయంలో పార్టీకి చిన్న చిన్న విరాళాలు ఇచ్చిన తొలి మద్దతుదారులను కూడా అది దూరంపెట్టింది.
వార్తలను సరఫరా చేయడం కంటే ఎక్కువగా మీడియా.. వ్యవస్థలో భాగంగా ఉంటోంది. ఢిల్లీ అసెం బ్లీలో గతంలో అధిక స్థానాలను కొల్లగొట్టినప్పటికీ, మునుపెన్నడూ చూసి ఉండని, రాజకీయాల్లో ఒక రకం రొమాన్స్‌తో, కొత్తదనంతో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు పెట్టింది. అయితే తన రెండో వెంచర్‌లో తన మార్గాన్ని తానే నిరోధించుకుని, తనను తానే కించపర్చుకునే స్థాయి వంచనకు అది సిద్ధపడిపోయింది. ఆప్ ఒక చేయిని కట్టేస్తూ వార్తా టెలివిజన్‌లో కల్పితమైన లేదా తప్పుడు స్టింగ్‌లు ప్రదర్శితమయ్యాయి. అయినప్పటికీ అది అనితరసాధ్యమైన గెలుపు సాధించింది.
వాస్తవానికి మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని, కాంగ్రెస్ కంటే ఆప్ పార్టీనే మెరుగైన ఫలితాలు సాధిం చినప్పటికీ ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలను గెలవడంలో దాని అసమర్థతే మీడియాకు పెద్దవార్త అయిపోయింది. ఒక వైపు మొగ్గు చూపడం అనేది నిర్దయతో కూడుకున్నదే కానీ, మీడియా తన వైఫల్యాలను గుర్తించడానికి ఇష్టపడదు. బ్రేకింగ్ న్యూస్ మనస్తత్వం సమాజంలో వేడి గాలి బెలూన్లను, తప్పుడు అవగాహనలను నిర్మించడంలో బ్రహ్మాండంగా సాయపడుతుంది.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మహర్షుల పార్టీ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ సంపద కోసం ఉవ్విళ్లూరే వారు కాకున్నప్పటికీ అవకాశాలకోసం వెంపర్లాడే వారిని చాలామందిని ఆ పార్టీ తనవైపుకు లాక్కుంది. కానీ తక్కువ కాలంలోనే యావత్ పార్టీ చిహ్నం, దాని ఉనికికి మూలం అయిన అరవింద్ కేజ్రీవాల్‌ని ఏమాత్రం నమ్మదగని వ్యక్తిగా మీడియాలో పదే పదే చిత్రించేశారు. అదేదో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సాధారణంగా నమ్మదగిన వారు అనిపించే తీరులో అరవింద్ కేజ్రీవాల్‌ను పూర్తి వ్యతిరేకంగా చిత్రించసాగారు.
కేజ్రీవాల్ తొలి నుంచి బ్రేకింగ్ న్యూస్ ఆకలిని తీర్చేవాడిగా మాత్రమే కనిపించారన్నది వాస్తవమే. దీంతో ఆయన మొదటినుంచి వ్యతిరేక ముద్రనే సంపాదించుకున్నారు. రెండేళ్ల క్రితం ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గొప్ప విజయాలను మళ్లీ సాధించడం భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యం కాదని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సాధించిన అద్భుత విజయాల దరిదాపులోకి కూడా కాంగ్రెస్ పార్టీ తదనంతర కాలంలో చేరలోకపోయిందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక మోదీ హయాంలోని బీజేపీ విషయానికి వస్తే ఇప్పుడిది నేరుగా తేరిపార చూడలేని ఒక నిర్నిరోధక శక్తిలాగా కనపడుతోంది. కానీ దానికి అసలైన పరీక్ష 2019 సార్వత్రిక ఎన్నికలలోనే అన్నది మర్చిపోకూడదు.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేష్ విజాపృకర్
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com