mahesh vijpurkar
-
రైతుకు రుణ మాఫీ ఊరట
విశ్లేషణ పరిమిత రుణ మాఫీ సైతం రైతుల తక్షణ సమస్యలను తీర్చి, వ్యవసాయ పను లను మొదలెట్టగలిగేలా చేస్తుంది. కీలక పరిష్కారం మాత్రం సముచితమైన మద్దతు ధరలు, నిల్వ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్ వసతులను అందించడమే. రుణ మాఫీ, ప్రభుత్వానికి గానీ, రైతులకుగానీ ఆర్థి కంగా అర్థవంతమైన చర్యేమీ కాదని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడణవిస్ గట్టిగా చెప్పేవారు. ఆయనే ఇçప్పుడు, కొన్ని షరతులతోనే అయినా అందుకు అంగీకరించారు. ఇప్పటికే రూ. 3.71 లక్షల కోట్ల రుణ భారాన్ని మోస్తున్న ఫడణవిస్ ప్రభుత్వానికి రూ. 30,000 కోట్ల రైతు రుణ మాఫీకి నిధులను సమకూర్చుకోవడం సులువేమీ కాదు. అందుకోసం గ్రామీణ ప్రాంతాల కోసం ఉద్దేశించిన పలు సంక్షేమ పథకాలకు కత్తెర వేయడం అవసరం అవుతుంది. రుణ మాఫీ నిజంగానే జరగాలంటే రుణగ్రస్తు లుగా ఉన్న్డ రైతులకు తిరిగి రుణాలను మంజూరు చేయడం ప్రారంభించమని బ్యాంకులకు సంకేతాలను పంపడం మాత్రమే సరిపోదు. బ్యాంకులు తమ ఖాతా పుస్తకాలను బ్యాలెన్స్ చేసుకోడానికి వీలుగా నిజంగానే వాటికి డబ్బును చెల్లించడం అవసరం. వాణిజ్య బ్యాంకులకు బకాయిపడ్డ కార్పొరేట్ సంస్థలు తమ రుణాలను ఇష్టానుసారం వాయిదా వేయించుకోవడం రైతుల రుణ మాఫీ డిమాండుకు నైతిక ప్రాతిపదికను సమకూరుస్తోంది. రుణ మాఫీకి అంగీకరించడం ద్వారా ఫఢణవిస్, మాఫీ కోసం డిమాండ్ చేయడం, నిరసనలు తెలపడం అనే క్రీడకు ప్రతిపక్షాన్ని దూరంగా ఉంచగిలిగారు, అంతే. ఇతర పార్టీలు తాము కూడా రైతులకు మద్ద తుగా ఉన్నామని అంటున్నా వారిని రెచ్చగొట్టేవేవీ కాదు. కాకపోతే అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన రైతుల పక్షాన నిలిచి, బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను కలుగజేస్తోంది. ఇక పది రోజుల పాటూ జరిగిన రైతుల ‘‘సమ్మె’’ కు సంబంధించి ఆసక్తికరమైన అంశం అందుకు ఎంచు కున్న సమయమే. తర్వాతి పంట వేసే క్రమం మొదలు కావాల్సి ఉంది, అది ఎలాగూ రుతుపవనాల రాకతో ముడిపడి అనివార్యంగా జరిగేదే. చాలా మంది తమ భూములను విత్తడానికి సిద్ధం చేసుకున్నారు. చేతిలో చేయడానికి పనిలేక, ప్రదర్శనలు చేయడానికి వీలుగా ఖాళీగా ఉన్నారు. మొత్తంగా ఈ పంటల సీజనంతా ముందుం డటంతో రైతులు ఈ సమ్మెను ఎంతో కాలం కొనసాగిం చరనేది వాస్తవం. పళ్లు, కూరగాయలు పండించేవారు ఈ సమ్మెలో ప్రధానంగా పాల్గొంటున్నట్టు కనిపిస్తోంది. టోకు బజార్లకు సరఫరాలు క్షీణించడాన్నిSతట్టుకోడానికి ప్రధాన మహారాష్ట్ర నగరాలు ఇతర రాష్ట్రాలవైపు, ప్రత్యే కించి గుజరాత్‌వైపు చూస్తున్నాయి. ఈ రుణ మాఫీకి రెండు షరతులు వర్తిస్తాయి. ఒకటి, చిన్న రైతులందరికీ, అంటే ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న రైతులందరికీ ఇది వర్తిస్తుంది. రెండు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు తమకు ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకోడానికి కొంత కాలం, కనీసం ఒక నెలో లేక రెండు నెలలో వేచి చూడాలి. రెండో కోవకు చెందిన వారికి సంబంధించి, మంత్రులు, రైతులతో కూడిన బృందం ఇతర రాష్ట్రాల లోని రుణ మాఫీని అధ్యయనం చేస్తుంది. అయితే రెండో కోవలోని వారంతా ఆ ప్రయోజనాలకు అర్హులు కాక పోవచ్చు. వ్యాపారం, ఉద్యోగం వగైరా ఇతర వన రులు ఉన్నవారు దాని పరిధికి వెలుపలే ఉండాల్సి రావచ్చు. రైతులు దూకుడుగా ఉండటమే కాదు, చీలిపోయి ఉన్నారు కూడా. రైతులలోని ఒక విభాగం, భూమి ఎంత ఉన్నది అనే దానితో నిమిత్తం లేకుండా అందరికీ రుణమాఫీని కోరుతుండటమే అందుకు కారణం. అయితే, ఈ రుణమాఫీ వల్ల లబ్ధి చేకూరే వారి సంఖ్య తక్కువేమీ కాదు. రైతులలో దాదాపు 80 శాతం మంది ఐదు ఎకరాల లోపు భూయాజమాన్యం ఉన్న వారి వర్గంలోకే వస్తారు. రుణమాఫీ పట్ల సార్వత్రికంగా సంతోషం వ్యక్తం అవుతోంది గానీ, రాష్ట్ర ప్రభుత్వం కనీసం చిన్న రెతులకు సంబంధించైనా ఈ పథకం వివరాలను వెల్ల డించలేదు. ఒక్కో రైతు రుణ మాఫీ రూ. 1,00,000కు మించక పోవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పరిమితం అవు తుంది. లబ్ధిదారులు కాగల అర్హత ఉన్నవారికి ఈ పరిస్థితి ఇంకా అర్థం కాకపోయి ఉండవచ్చు. ఈ పరిమిత రుణ మాఫీ సైతం రైతుల తక్షణ సమస్యలను తీర్చి, వారు తిరిగి వ్యవసాయ కార్య కలాపాలను ప్రారంభించగలిగేలా చేస్తుంది. సాగుబడి లాభదాయకంగా ఉండటం లేదు కాబట్టి ఈ సహాయం సైతం ప్రభావశీలమైనదే. కీలకమైన పరిష్కారం మాత్రం సముచితమైన మద్దతు ధరలు, నిల్వ సదు పాయాలు, కోల్డ్ స్టోరేజ్ వసతులను కల్పించడమే. దశా బ్దాలు గడుస్తున్నా అది మాత్రం జరగడం లేదు. ధరల రూపేణా, మౌలిక సదుపాయాల రూపేణా లభించే మద్దతుతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ కుండా నిలవరించగలుగుతారు. గత దశాబ్ద కాలంలోనే దాదాపు 18,000 మంది రైతులు తక్షణ బాధల నుంచి వ్యక్తిగతంగా విముక్తి కావాలని ఉరి వేసుకున్నారు లేదా విషం తాగారు. తద్వారా వారు తమ కుటుంబాలను నిరాధారంగా గాలికి వదిలేశారు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com -
భూమి కోసం ఏం చేద్దాం?
విశ్లేషణ మానవులు పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని వి«ధంగా నాశనం చేసిన ఈ యుగంలో వ్యక్తులుగా, సమాజాలుగా మనం దాని గురించి ఏం చేస్తున్నాం? మీరే ఆలోచించండి. పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంపై ఒక అమెరికన్ విదూషకుడు ఒక వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. శ్వేతసౌధంలో ఆ ప్రకటనను చేసిన ప్రదే శాన్ని దృష్టిలో ఉంచుకుని ‘‘ఈ లెక్కన చూస్తే, ఇలా మాట తప్పేట్టయితే అప్పుడిక్కడ ఉండేది గులాబీల తోట కాదు, బ్రహ్మజెముడు వనం’’ అని వ్యాఖ్యానించాడు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ, మిగతా అభివృద్ధి చెందిన దేశాలలో ప్రధానమైనవి మాత్రం తమ వాగ్దానాలకు కట్టుబడి ముందుకు సాగాలనే కృత నిశ్చయాన్ని చూపాయి. తక్షణమే స్పందించడం ద్వారా బరాక్ ఒబామా... అమెరికా నగరాలు, వ్యాపార సంస్థలు పారిస్ ఒప్పందంలోని వాగ్దానాలకు కట్టుబడటానికి సమీకృతం కావడానికి తోడ్పడింది. ఆశా రేఖ తొంగి చూస్తు న్నది ఇక్కడే. వాతావరణ మార్పుల విపత్కర విపరిణామాన్ని అరికట్టడంలో ప్రభుత్వాల కంటే ప్రజలే ఎక్కువ పాత్రను నిర్వహించాల్సి ఉంది. ఒక సమాజంగా మనం ఈ విషయంలో ఏమైనా చేస్తున్నామా? భరింపశక్యంకాని వేసవి మన దేశంలో ఇప్పుడు ముగింపునకు వస్తోంది. ఈ వేసవి, వాతావరణ మార్పు గురించి మనం ఏమైనా చేయా లని మెత్తగా తట్టి చెప్పడానికి మించి చేసిన హెచ్చరిక. దీన్ని పూర్తిగా ప్రభుత్వాలకు వదిలి పెట్టేయడం తీవ్ర తప్పిదం అవు తుంది. ప్రభుత్వాలు ఆలోచిస్తాయే తప్ప, తమ సొంత లక్ష్యాలను సాధిం చడానికి తగినంతగానూ, త్వరితం గానూ ఎప్పుడూ అవి ఆచరణకు దిగవు. ఇది కేంద్రం నుంచి గ్రామ పంచాయతీల వరకు అంతటా ఉన్నది. పారిస్ ఒప్పందం వివరాల జోలికి పోవడం లేదు. కాకపోతే సంపన్నదేశాలు వాతా వరణాన్ని కొల్లగొట్టడంవల్ల అభివృద్ధిచెందిన దేశాలు మూల్యాన్ని చెల్లించాల్సి రావడం, లక్ష్యాల సాధన వాటికి కష్టం కావడం వంటి సమస్యలున్నాయి. అయినా పౌరులుగా మనం, మన పాత్ర విమర్శనాత్మకంగా ఉండటానికీ, పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా కొవ్వొత్తుల ఊరేగింపులు జరపడం, మానవ హారాలను నిర్మించడానికీ పరిమితమని తరచుగా భావిస్తుంటాం. విషాదకరంగా మనం మన చిన్న పరిధులలోనే చేయగల సాను కూల కార్యాచరణ మాత్రం కానరాదు. ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లాలని కారు బయటకు తీసి నప్పుడల్లా అది వాతావరణానికి హానికరమైన ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంత కంటే కొద్దిగా నడవడమే మంచిదని మనకు తోచదు. వాతావరణం మరింతగా క్షీణిం చిపోకుండటానికి ప్రతి చిన్న చర్యను చేపట్టడానికి హామీని కల్పించేలా మన చైతన్యం విస్తరించాలి. ఇంధన వాడకంలో ఎలాంటి వృ«థానైనా అరికట్టడం వాటిలో ఒకటి. నా ప్రతిపాదనలు మరీ అమాయకమైనవిగా అని పించొచ్చు, కానీ ఆవశ్యకమైనవి. ఏదో ఒక వనరు అవసరమైన ప్రతి పనిని గురించి ఆలోచించండి. గదిలోంచి బయటకు వస్తున్న ప్పుడు లైటు ఆపు చేశానా? లెడ్ లైట్లను పెట్టానా, లేదా? నేను లేనప్పుడు ఫ్యాన్ తిరు గుతూనే ఉందా? ఏసీ అభిలషణీయం, సౌకర్యవంతం అయిన 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్దనే ఉందా? ప్రభుత్వాలు పలు ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తే, వాటి వాడకాన్ని ఎందుకు అనుమ తిస్తున్నారని నిలదీయాలి. మరీ ముఖ్యంగా, కూరగాయలు, కిరాణా దుకాణదారుల వద్ద కొనుగోలుదారులు వస్తువులను గుడ్డ సంచులలోనే పట్టుకుపోతున్నారా? వీధిలోని టీ బడ్డీలో వాడే ప్లాస్టిక్ కప్పు నుంచి అన్ని ప్లాస్టిక్ వస్తువులు భూగ్రహానికి తీవ్ర హానిని కలి గించేవే. చేతులు కడిగేటప్పుడు పంపులను తిప్పి ఉంచే తీరు తీవ్ర నిర్లక్ష్యంతో కూడిన నీటి వృథాకు కారణం. ఇక షవర్ కింద నిమిషాల తరబడి నిలబడటం మరింత వృథా. ఇలా ఈ జాబితా ఎంతైనా సాగుతుంది. మానవులు పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని వి«ధంగా నాశనం చేసిన ఈ ఆంత్రోపొసీన్ యుగంలో ఇతరులు ఈ ప్రపంచం గురించి ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వ్యక్తులుగా, సమాజాలుగా మనం దాని గురించి ఏం చేస్తున్నాం? మీరే ఆలోచించండి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
మీడియానే ఆప్‌ను ముంచిందా?
విశ్లేషణ వాస్తవానికి నరేంద్రమోదీ ప్రభంజనాన్ని తట్టుకుని, కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీనే మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలను గెలవడంలో దాని అసమర్థతే మీడియాకు అతి పెద్ద వార్త అయిపోయింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌పై నియంత్రణను భారతీయ జనతా పార్టీ నుంచి లాగేసుకోవడంలో ఆమ్ఆద్మీ పార్టీ పూర్తి అసమర్థతతో వ్యవహరించడం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు నిజంగానే ఒక మేలుకొలుపు లాంటిది. ఓటర్లపై ఎన్నికల సీజన్లో మాత్రమే అభిమానం కురిపించడం కాకుండా మొత్తం పాలనా ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయాలనే ఆమ్ఆద్మీ పార్టీ భావనకు ‘సుప్రీమో’ అనే భావన పూర్తిగా వ్యతిరేకమైనది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో తాము ప్రజలతో సాన్నిహిత్యాన్ని కోల్పోయామని ఆప్ పార్టీ అంగీకరించడమే కాకుండా ఓటర్ల వద్దకు వెళ్లాలని, వారికి మళ్లీ దగ్గరవ్వాలని తన శాసన సభ్యులను కోరిం ది. ఓటర్లు అంటే వాడుకుని విసిరేసే వస్తువుల వంటివారు అనే చట్రంలోకి ఆప్ కూడా తన ఆచరణ ద్వారా వెళ్లిపోయిందని ఈ ప్రకటన చెప్పకనే సూచిస్తోంది. నరేంద్రమోదీ బలమైన ఆకర్షణ, కొత్త అభ్యర్థులను మాత్రమే బరిలో దింపడం ద్వారా మెరుగైన సుపరిపాలనను అందిస్తామని ఆయన ఢిల్లీ ఓటర్లకు చేసిన వాగ్దానం బీజేపీకి పూర్తి అనుకూలంగా పనిచేశాయి. కానీ ఇది నాణేనికి సగం వైపు మాత్రమే మరి. జాతీయ పార్టీల పట్ల వ్యవహరించడంలో కేజ్రీవాల్లో మొరటుదనం, కాఠిన్యం లేకున్నట్లయితే, నిలకడైన ప్రాతిపదికన ఓటర్ల దృఢమైనవిశ్వాసాన్ని పొందు తూ నెమ్మదిగా ఎదుగుతున్న పార్టీ నేతగా ఆయన వెలిగేవారు. కానీ ఆయన నియంత్రణలో లేని మరొక విషయం ఏమిటంటే ఇతర రాజకీయ పార్టీలలో భయం కలిగించిన ఆమ్ ఆద్మీ పార్టీ తక్షణ ప్రాతిపదికే మరి. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ మధ్యేవాద లేదా వామపక్ష పార్టీ అయినా చాలావరకు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా ఉనికిలో ఉంటున్నాయి. వీటికి తప్పనిసరిగా సంస్థాపక వ్యవస్థ అవసరం. పార్టీలు కూడా వ్యవస్థలో భాగం కాబట్టి, పార్టీల కంటే వ్యవస్థలే ఎక్కువగా మనుగడ సాధించి, ఎదగాల్సిన అవసరం ఉంది. అందుకే అవి ఢిల్లీలో ఆమ్ ఆద్మీపై తీవ్రస్థాయిలో యుద్ధాలకు, ఘర్షణలకు దిగుతూ వచ్చాయి. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 కి 67 స్థానాలు గెలిచినప్పటికీ ఆమ్ ఆద్మీ తన బలాన్ని అట్టిపెట్టుకోవడానికి మరింత దూకుడుతనాన్ని అలవర్చుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై నిందమోపడం అనే సిల్లీ వ్యూహాన్ని అది తాజాగా అవలంబించినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ తొలినుంచీ తీవ్ర నిరసనలను వ్యక్తం చేయడం అనే వ్యూహంతోటే నడిచింది. అదే సమయంలో పార్టీకి చిన్న చిన్న విరాళాలు ఇచ్చిన తొలి మద్దతుదారులను కూడా అది దూరంపెట్టింది. వార్తలను సరఫరా చేయడం కంటే ఎక్కువగా మీడియా.. వ్యవస్థలో భాగంగా ఉంటోంది. ఢిల్లీ అసెం బ్లీలో గతంలో అధిక స్థానాలను కొల్లగొట్టినప్పటికీ, మునుపెన్నడూ చూసి ఉండని, రాజకీయాల్లో ఒక రకం రొమాన్స్‌తో, కొత్తదనంతో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు పెట్టింది. అయితే తన రెండో వెంచర్లో తన మార్గాన్ని తానే నిరోధించుకుని, తనను తానే కించపర్చుకునే స్థాయి వంచనకు అది సిద్ధపడిపోయింది. ఆప్ ఒక చేయిని కట్టేస్తూ వార్తా టెలివిజన్‌లో కల్పితమైన లేదా తప్పుడు స్టింగ్‌లు ప్రదర్శితమయ్యాయి. అయినప్పటికీ అది అనితరసాధ్యమైన గెలుపు సాధించింది. వాస్తవానికి మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని, కాంగ్రెస్ కంటే ఆప్ పార్టీనే మెరుగైన ఫలితాలు సాధిం చినప్పటికీ ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలను గెలవడంలో దాని అసమర్థతే మీడియాకు పెద్దవార్త అయిపోయింది. ఒక వైపు మొగ్గు చూపడం అనేది నిర్దయతో కూడుకున్నదే కానీ, మీడియా తన వైఫల్యాలను గుర్తించడానికి ఇష్టపడదు. బ్రేకింగ్ న్యూస్ మనస్తత్వం సమాజంలో వేడి గాలి బెలూన్లను, తప్పుడు అవగాహనలను నిర్మించడంలో బ్రహ్మాండంగా సాయపడుతుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మహర్షుల పార్టీ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ సంపద కోసం ఉవ్విళ్లూరే వారు కాకున్నప్పటికీ అవకాశాలకోసం వెంపర్లాడే వారిని చాలామందిని ఆ పార్టీ తనవైపుకు లాక్కుంది. కానీ తక్కువ కాలంలోనే యావత్ పార్టీ చిహ్నం, దాని ఉనికికి మూలం అయిన అరవింద్ కేజ్రీవాల్‌ని ఏమాత్రం నమ్మదగని వ్యక్తిగా మీడియాలో పదే పదే చిత్రించేశారు. అదేదో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సాధారణంగా నమ్మదగిన వారు అనిపించే తీరులో అరవింద్ కేజ్రీవాల్‌ను పూర్తి వ్యతిరేకంగా చిత్రించసాగారు. కేజ్రీవాల్ తొలి నుంచి బ్రేకింగ్ న్యూస్ ఆకలిని తీర్చేవాడిగా మాత్రమే కనిపించారన్నది వాస్తవమే. దీంతో ఆయన మొదటినుంచి వ్యతిరేక ముద్రనే సంపాదించుకున్నారు. రెండేళ్ల క్రితం ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గొప్ప విజయాలను మళ్లీ సాధించడం భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యం కాదని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సాధించిన అద్భుత విజయాల దరిదాపులోకి కూడా కాంగ్రెస్ పార్టీ తదనంతర కాలంలో చేరలోకపోయిందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక మోదీ హయాంలోని బీజేపీ విషయానికి వస్తే ఇప్పుడిది నేరుగా తేరిపార చూడలేని ఒక నిర్నిరోధక శక్తిలాగా కనపడుతోంది. కానీ దానికి అసలైన పరీక్ష 2019 సార్వత్రిక ఎన్నికలలోనే అన్నది మర్చిపోకూడదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
విరగబాటుకు విరుగుడు
విశ్లేషణ తెరవెనుక జరుగుతున్నదేమైనా, తనకున్న హోదా వల్ల తనేమి చేసినా చెల్లు బాటు అవుతుందనుకునే గైక్వాడ్లాంటి ఉన్నత స్థాయి వ్యక్తికి ఇంతవరకు జరిగిన దానికైతే దేశ ప్రజలు సంబరపడుతున్నారు. రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా విమానంలో వేసిన వీరంగం ప్రవర్తన సహజం గానే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎయిర్ ఇండియా ఆయనను ప్రయా ణించడానికి అనుమతించడం లేక నిరాకరణను కొనసాగిం చడం ద్వారా ఎలాగోలా ఈ వివాదం పరిష్కారమయ్యే వరకూ అది కొనసాగు తుంది. ఈ విమాన ప్రయాణ నిరాకరణను కొనసాగిం చేట్టయితే, అది ఎప్పటి వరకు? పార్లమెంటు సమావే శాలకు హాజరు కావడానికి ఒక ఎంపీకి ఉన్న హక్కును నిరాకరించి సభా హక్కులను ఉల్లంఘించారంటూ లోక్ సభ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటుందా, లేదా అనేది దాన్ని నిర్ణయిస్తుంది. గైక్వాడ్ ప్రతాపానికి గురైన విమానయాన సంస్థ వెంటనే ఆయనను తమ విమానాల్లో ప్రయాణించేది లేదంటూ నిషేధం విధించింది. దేశంలోపల విమాన సర్వీసులను నడిపే ఇతర సంస్థలు సైతం అదే దారి పట్టాయి. ఒక రాజకీయవేత్త, అందునా అత్యున్నత స్థాయిగల పార్లమెంటు సభ్యుని ప్రమేయం ఉన్న వ్యవహారం కాబట్టి ఈ రెండూ అసాధారణమైనవే. ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రభుత్వరంగ సంస్థ కావ డం వల్ల, కీలకమైన ఆ అత్యున్నత అధికారి ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వం నియమించినవారు. కాబట్టి సాధా రణంగా లేనిపోని ఇబ్బందులు ఎందుకని మిన్నకుం టారు, ఒత్తిడులకు లొంగుతారు. ఈ వ్యవహా రంలో అలా జరగకపోవడం అత్యంత సంతోషదాయక పరి ణామం. ఈ ఉదంతాన్ని కూడా అలాగేSకప్పి పుచ్చి ఉంటే, నిజంగానే గైక్వాడ్ ఉచిత టికెట్‌తో విమాన మెక్కినప్పుడల్లా ఇలా చిందులేస్తుండేవారే. విమాన ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కనబడకుండా చేయాలని పట్టుబట్టడం ద్వారా ఎయిర్ ఇండియా... కాళ్లు నేలపై నిలవకుండా విర్రవీగే మన రాజకీయ ఉన్నత వర్గాన్ని కిందకు దించే విధికి సంబం« దించి గొప్ప పనే చేసింది. ఈ బాపతు వాళ్లు తిరిగి మళ్లీ ఎప్పుడు ఇష్టానుసారం అభ్యంతరకరంగా ప్రవర్తిం చడం ప్రారంభిస్తారో తెలియదు. కిరణ్ రిజ్జూ అనే మంత్రి తన సహచరులతో కలసి, సర్వీసులో ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి సహా ముగ్గురిని విమానంలోంచి దించేసి మరీ ప్రయాణం చేసి ఎంతో కాలం కాలేదు మరి. మిగతా విమాన సంస్థలు (అన్నీ ప్రైవేటువే) కూడా ఈ నిషేధం కచ్చితంగా అమలయ్యేలా చేయా లని రిజర్వేషన్ల అభ్యర్థనలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలి స్తుండటం ప్రభుత్వ రంగ విమాన సంస్థకు మరింత ధైర్యాన్నిచ్చి, అది తన సంకల్పంపై పట్టు విడవకుండా నిలిచేలా చేసింది. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ఒక అంశంపై ఒకరికొకరు పోటీదారులైన విమాన సంస్థ లన్నీ కలసికట్టుగా పనిచేయడం విశేషం. విర్రవీగే రాజ కీయ వర్గం వల్ల ఎంతో కాలంగా బాధలు పడుతున్న ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలుపుకోదగిన గొప్ప ప్రయోజనకర వైఖరి ఇది. అయితే, ఎయిర్ ఇండియా ఇలా దూకుడును ప్రదర్శించడానికి మరో కోణం కూడా ఉంది. డీజీసీఏ లేదా పౌర విమానయాన శాఖ నుంచి ఎవరైనా వైఖరిని మెత్తబరుచుకోవాలని, ఆ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేయడం ఉత్తమమని మెల్లగా సూచిస్తే... ఆ సంస్థ ప్రజా సంబంధాల యంత్రాంగం ఆ పని చక్క బెట్టేసేదే. శివసేన నేత గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యో గుల సంఘం ఒకదానికి నేతగా ఉండటం వల్ల కూడా అలా చేయక తప్పేది కాదు. ఈ సమస్యతో వ్యవహరించే విషయంలో పార్టీల మధ్య రాజకీయాలు తెర వెనుక పనిచేస్తున్నాయని అను మానించడానికి తగు అవకాశం ఉంది. శివసేన, భార తీయ జనతా పార్టీతో సంఘర్షణాత్మక వైఖరిని అవ లంబిస్తోంది కాబట్టి అది కూడా ఈ వ్యవహారంలో ఉదా సీనంగా ఉంటూ శివసేన ఎంపీని ఈ ఇరకాటపు రుచిని చూడనిద్దామని నిర్ణయించిందనిపిస్తోంది. ఏ విమాన సంస్థా ఆయనకు బిజినెస్ లేదా ఎకానమీ క్లాసులు దేనిలోనూ సీటును రిజర్వు చేయడానికి నిరాకరిస్తుండ టంతో ఇప్పటికే ఆయన బాగా చమటలు కక్కారు. కనీసం ఇప్పటివరకైతే ఆయన ప్రత్యామ్నాయంగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతున్నట్టు లేదు. ఒక ఎంపీ అతి హేయంగా, హింసాత్మకంగా ప్రవ ర్తించడంపై ప్రతిస్పందించకుండా ఉండి తెలివిగా ప్రవ ర్తించింది. సదరు మంత్రిత్వశాఖ లేదా లోక్‌సభ సైతం ఈ విషయాన్ని పట్టించుకునేట్టుగా కనిపించడం లేదు. ఒకవేళ శివసేన హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవే శపెడితే, అప్పుడు ఆ పార్టీ ఓటింగ్‌లో పాల్గొంటుందా లేదా అనే దాన్ని బట్టే దాని వైఖరి వెల్లడవుతుంది. శివసేన లాంటి పార్టీ ఒక విమాన సంస్థను పట్టుకుని ‘‘గూండా’’, ‘‘కుమ్మక్కు ముఠా’’ అనడాన్ని ప్రజలు మెచ్చడం లేదు. తెరవెనుక జరుగుతున్నదేమైనా, తనకున్న హోదా వల్ల తతనేమి చేసినా చెల్లుతుందని ఎగిరిపడే ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి ఇంతవరకు జరిగినదానికైతే దేశ ప్రజలు సంబరపడుతున్నారు. ఎన్నిక కావడం అంటేనే ప్రజా న్యాయస్థానం తీర్పు చెప్పేసింది కాబట్టి, ఇక ఏ తీర్పుకూ ఏమంత విలువ లేదని అనడం, వినడం అసాధారణమేం కాదు. ఈసారి ఇంతవరకు ఇది భిన్నం గానే సాగుతోంది, విశేష హక్కులతో ఎగిరెగిరిపడేవారికి ఇదో గుణపాఠం కావాలి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com -
అంతా రాజకీయమే గోవిందా
విశ్లేషణ ప్రాణాలతో చెలగాటమాడే దహీహండి మతసంబంధమైనదైతే బీజేపీ క్రీడా మంత్రి ఈ సాహస క్రీడకు సహాయపడటానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామనే వారు కాదు. నేడు ఇది మత వేడుకా కాదు క్రీడా కాదు ఉత్త రాజకీయం. రాజ్‌థాకరే సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ ఈ కృష్ణాష్టమికి దహీహండి (ఉట్లు కొట్టడం) కార్యక్రమాన్ని నిర్వహించే ఉద్దేశంతో ఉన్నట్టుంది. మహారాష్ట్ర ప్రభు త్వం ఒక ఆర్డినెన్సును తెచ్చి కోర్టు ఉత్తర్వులు అమలుకాకుండా చేసి నిర్నిబంధంగా ఈ వేడుక జరిగేలా చూడాలని ఆయనకు అన్న అయ్యే ఉద్ధవ్ థాకరే కోరుకుంటున్నారు. ఇద్దరికీ ఎవరి పార్టీ వారికి ఉంది. దీంతో భారతీయ జనతా పార్టీ ఇరకా టంలో పడింది. రాజ్‌థాకరేను ధిక్కారానికి పాల్పడనివ్వ డమా, అసలాయన అలా చట్టాన్ని ఢీకొంటారా అని చూడడమా? లేక శివ సేన కోరినట్టు ఆర్డినెన్సును జారీ చేసి రానున్న పౌర పాలనా సంస్థల ఎన్నికల్లో తన ప్రాబ ల్యాన్ని తగ్గిపోయేలా చేసుకోవడమా? అంగీకరించక పోతే ఈ సమస్యను తన రాజకీయ ప్రత్యర్థి, భాగస్వామిౖ శివసేనకు అప్పగించేసి తనను దెబ్బతీయనివ్వడమా? ఇదంతా రాజకీయమే. ఏటా జరిగే దహీహండిలో 18 ఏళ్ల లోపు పిల్లలతో అంచెలంచెలుగా 20 మీటర్ల ఎత్తున నిర్మించే మానవ పిరమిడ్లను అనుమతించరాదని గత వారం సుప్రీం కోర్టు ఆదేశించింది. అందులో పాల్గొనే వారు గాయ పడకుండా ఉండేలా వారి భద్రతకు హామీని కల్పించాల నేదే కోర్టు ఉద్దేశం. అలా చాలా మంది తీవ్రంగా గాయ పడ్డారు, కొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. హిందీ సినిమా బ్లఫ్ మాస్టర్‌లో కథానాయకుడు షమ్మీకపూర్ ఈ దహీహండిలో పాల్గొనడం చాలామం దికి గుర్తుండవచ్చు. పెరుగు ముంతను ఎగిరి పట్టుకోవ డమే కీలకం. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఆ పిరమిడ్ల ఎత్తూ, బహుమతిగా లభించే డబ్బు పెరగడమే. రాజకీయ పార్టీలు దీన్ని హిందూ మత వేడుకగా చూస్తాయి. కృష్ణ భగవానుడు బాలునిగా తనకు అంద కుండా ఉంచిన ఉట్టిలోని వెన్నను మిత్రుల సహాయంతో దొంగిలించిన మాట నిజమే. కానీ ఆ విన్యాసాలు ఎప్పుడూ ప్రాణాలకు లేదా కాళ్లూచేతులకు ముప్పును కలిగించేటంతటి ప్రమాదం అంచున నిలవలేదని సుప్రీం పేర్కొంది. కోర్టు ఆదేశాల పట్ల మండిపడుతున్న వారు దీన్ని మత వ్యవహారాల్లో జోక్యంగా చూస్తున్నారు. ముంబై, ఠానే తదితర కొన్ని నగరాలలో దహీహండి ఒక పెద్ద కార్యక్రమం. బహి రంగ ప్రదేశాల్లో ఎక్కడికక్కడ వేలాడదీసిన ఉట్లను కొట్టుకుంటూ వచ్చే గోవిందుల బృందాల మధ్య రోడ్లమీద చిక్కుకుపోకుండా హడా వుడిగా అంతా ఇళ్లకు పరుగులు తీస్తారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం స్థానిక సమా జాల చేతుల్లోంచి రాజకీయ నేతల ట్రస్టుల చేతుల్లోకి పోయింది. దహీహండి జరిగే స్థలాలను చూస్తే అసలవేమిటో కనువిప్పు అవుతుంది. కొందరు రాజకీయవేత్తలు, ప్రధానంగా బాలీవుడ్ తారలు సహా సెలబ్రిటీలు భారీ వేదికలపై దర్శన మిస్తారు. గోవిందులకు లాగే వారికి కూడా హర్ష«ధ్వానాలు పలుకుతారు. చెవులు చిల్లులు పడేలా హిందీ సినిమా పాటలు మోగుతుంటాయి. నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టిని ఆకర్షించే వేదికగా భావిస్తారు. రెండేళ్ల క్రితం ముంతలను ఎంత ఎత్తున వేలాడదీశారంటే.. 43.79 అడుగుల పిరమిడ్ అవసరమైంది. పిల్లలు పాల్గొనడంపై హైకోర్టు నిషేధం తర్వాత కూడా కొన్ని బృందాలు వారిని ఉపయోగిం చాయి. పిల్లలుంటే దిగువ అంచెలలోని వారి భుజాల పైన పడే బరువు తక్కువ అవుతుంది. ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదు, కోర్టు ధిక్కారం జరగలేదు. మండళ్లుగా పిలిచే నిర్వాహకులు కోర్టు ఆదేశాల పట్ల తొలుత అలక వహించారు. విధించిన నిబంధన లకు కట్టుబడే కంటే అసలు కార్యక్రమాన్నే నిలిపి వేస్తామని బెదిరించారు. ఆ వెంటనే పునరాలోచనలో పడ్డారు. బ్రహ్మాండమైన ఈ వేడుకలోని మజాయే లేకుండా పోతుందని వాపోయారు. ఈ విషయంలో మొదట ప్రతిస్పందించినది రాజకీయవేత్తలే. హిందూ మత పెద్దలు లేదా మత సంస్థలు కాదు. గత కొన్నేళ్లుగా దహీహండిని చెరబట్టి రాజకీయవేదికగా మార్చి భద్రత పట్ల ఎవరికీ పట్టింపూ లేని క్రీడగా దాన్ని మార్చేశారన డానికి ఇది స్పష్టమైన సంకేతం. హైకోర్టు ఆదేశించే వరకు ఈ నిర్వాహకులలో ఎవరికీ భద్రత పట్టలేదు. ఇది పూర్తిగా మతపరమైనదే అయితే ప్రత్యర్థి రాజ కీయవేత్తల మధ్య పోటీ ఉండటానికి వీల్లేదు. ఉదాహర ణకు ఎన్సీపీ, శివసేనల నేతలిద్దరు పోటీపడి క్రేన్‌ను ఉపయోగించైనా అతి ఎత్తున ముంతను వేలాడదీయ డమే. ఇది మత కార్యక్రమమైతే గిన్నిస్ లేదా లిమ్కా రికార్డు పుస్తకాల్లో నమోదు చేయించుకోవాలని తహ తహలాడరు. బీజేపీ క్రీడామంత్రి శాసనసభలో దహీ హండి సాహస క్రీడకు సహాయపడటానికి ఒక ప్యానె ల్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించేవారే కారు. కోర్టు ఆదేశాల గురించి అంగలారుస్తున్న వారిలో ఎవరూ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. నేటి దహీహండి మత వేడుకా కాదు క్రీడా కాదు ఉత్త రాజకీయం. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com