మోడీకి సౌరాష్ర్ట ‘బేడీ’! | Narendra modi opposes separate saurashtra state | Sakshi
Sakshi News home page

మోడీకి సౌరాష్ర్ట ‘బేడీ’!

Published Thu, Aug 15 2013 11:44 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

Narendra modi opposes separate saurashtra state

విశ్లేషణ: ‘‘ఉత్తర బెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అవాస్తవమైన, అసహజమైన, జాతీయ ప్రయోజనాలకు హానికరమైన ప్రతిపాదనగా భారత ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి ప్రత్యేక రాష్ట్రంఏర్పాటు కోసం జరిగే ఉద్యమానికి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇలాంటి మతిలేని ప్రయత్నాల ద్వారా దేశ సంఘీభావాన్ని చెడగొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం సహించబోదు’’ అని సర్దార్ పటేల్ 1952 జూలైలో హెచ్చరించారు.
 
 పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన మేకగా మారిపోతుం దా? మారిపోదు కనుకనే, దానికి ‘మేకవన్నెపులి’ అని పేరు పెట్టాల్సివచ్చింది! అలాగే 2000 మంది మైనారిటీల ఊచకోతకు బాధ్యుడై కూడా న్యాయవ్యవ స్థనూ, అసమర్థపు కాంగ్రెస్ పాలక వ్యవస్థనూ పదకొం డేళ్లుగా మభ్యపెడుతూ కేసుల నుంచి తప్పించుకుని తిరు గుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన ‘కంట్లో దూలాల్ని’ చూసుకోకుండా ఎదుటి వారి కళ్లల్లో నలుసుల్ని వెతకచూడటంలో ఆరితేరినవాడు! అశేష త్యాగాలతో ప్రజాబాహుళ్యం అరవై ఆరేళ్లనాడు సాధిం చుకున్న స్వాతంత్య్రాన్నీ, లౌకిక వ్యవస్థా స్థాపనను ప్రజ లకు గ్యారంటీ చేసి ప్రజలకు హామీ పడిన రాజ్యాంగాన్నీ ఈ ఆరు దశాబ్దాలలో కాంగ్రెస్ పాలకులు నీరుగార్చారు. మరోవైపు రాజకీయ ముసుగులో పాలనాశక్తిగా ‘హిం దూత్వ’ పేరిట అవతరించిన భారతీయ జనతాపార్టీ నాయకులు నేడు ‘మోడీత్వ’ రంగులో క్రమంగా బయట పడుతున్నారు.
 
 కాంగ్రెస్ పాలకుల తప్పుడు రాజకీయాలను చాటు చేసుకుని, దేశ ప్రజలను, రాష్ట్రాలను సామ్రాజ్యవలస పాలకుల మాదిరిగానే విభజించి పాలించే దుర్నీతికి బీజేపీ మత రాజకీయవాదులు కూడా గజ్జెకట్టారు. ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’కూ, విదేశీ బహుళ జాతి కంపెనీల, దేశీయ గుత్త పెట్టుబడి వర్గాల ప్రయో జనాల కోసం గొడుగుపట్టడంలో కాంగ్రెసూ, బీజేపీ నేడు పోటాపోటీలు పడుతున్నాయి! అందులో భాగంగానే, చివరికి జాతీయ స్వాతంత్య్రోద్యమం గుర్తించి ఏక భాషా సంస్కృతులు పునాదిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతర ణను సుసాధ్యం చేసిన పరిణామాన్ని తిప్పికొట్టేందుకు ఈ రెండు రాజకీయశక్తులూ తమ ఉనికి కోసం, ఒకటిగా ఉన్న రాష్ట్రాలను విడగొట్టేందుకు పూనుకుంటున్నాయి.  ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి.
 
 ప్రజల మౌలిక సమస్యలైన తిండి, బట్ట, వసతి, ఉపా ధి అవసరాలను తీర్చగల ప్రణాళికాబద్ధమైన పథకాలను అమలుజరిపే బాధ్యత నుంచి ఈ రెండు పార్టీలు రోజు రోజుకీ దూరమవుతున్నాయి. అందుకే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థకు సహజ మైన చిట్కా వైద్యాన్ని, విభజించి పాలించే నీతిని ఆశ్ర యించి ప్రజల మధ్య ఘర్షణలను, చీలికలను పెంచడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. ఈ ధోరణి దేశ విభజనతోనే ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది! ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య తగవులు, తంపులు పెట్టే ‘సంస్కృతి’ ఆధారంగానే స్వాతంత్య్రానంతర కాంగ్రెస్ అధిష్టానమూ, అనంతరదశలో బీజేపీ నాయకులూ పంజాబ్‌ను చీల్చడం (పంజాబ్-హర్యానాలుగా) దగ్గర నుంచి మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరా ఖండ్‌లుగా ముక్కలుగా బద్దలు కొట్టడం వరకూ కీలక పాత్ర వహించాయి.
 
 ‘విడిపోవటం వికాసం’ కోసమేననీ, ‘విడిపోయి కలిసి ఉందా’మనీ చేసే ప్రచారం, ఈ ‘విభజన’ రాజకీయ కుట్రలో ప్రధానాంశం! అదే సూత్రాన్ని ఇప్పుడు ఈ రెండు మత రాజకీయ పక్షాలూ, ఎన్నికలలో తమ స్వార్థ ప్రయో జనాల కోసం, భాషాప్రయుక్త ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాల స్వరూపాలను చెదరగొట్టి, సమైక్యంగా ఉంటూ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధుల్లోనే అభివృద్ధిని నమోదు చేసుకుంటున్న ప్రజలను చెల్లాచెదురుచేయడానికి సంకల్పించాయి. విడిపోతేనే వికాసమని చెప్పే మాటలు నీటి మూటలేనని ఎన్డీయే సృష్టించిన మూడు రాష్ట్రాలు చాటిచెబుతున్నాయి. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసమే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లను ప్రత్యేక రాష్ట్రాలుగా విభ జించామని ఆనాడు చెప్పారు. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు సరికదా, ఏ రెండు రాష్ట్రాల నుంచి వీటిని ఏ ఉద్దేశంతో ‘చీల్చామ’ని చెప్పారో ఆ ఆదివాసీల బతుకుల్ని విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి రంగాలలో చట్టుబండలు చేశారు.
 
 మత రాజకీయాలను ఆశ్రయించి తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ గత ఐదేళ్ల క్రితం వరకూ కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పటిదాకా దక్షిణ భారతంలో కాలుమోపలేని బీజేపీ మొదటిసారిగా కర్ణాటకలో పూర్తిస్థాయి ప్రభు త్వాన్ని నెలకొల్పింది. అక్కడి నుంచి స్థానికంగా కర్ణాట కలో ఎన్ని రకాల మతఘర్షణలు చోటు చేసుకున్నాయో రాజకీయ పరిశీలకులకు తెలుసు! మరి ఈ నాడు ఈ పార్టీ పరిస్థితి ఏమిటి? ఏడు రాష్ట్రాల్లో తన అధికారం కూలి పోయి, ప్రస్తుతం పాలనాశక్తిగా బీజేపీ పాలన కేవలం నాలుగు రాష్ట్రాలకు కుదించుకుపోయింది! చివరికి దక్షిణా దిన చేజిక్కిందనుకున్న కర్ణాటక కూడా ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవమానకరంగా బీజేపీ చేజారిపోయింది!
 
 తాజాగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని నిల పడం కోసం ‘వికాస’ పురుషుని వేషంలో హైదరాబాద్ వచ్చి విభజన సభ జరిపాడు. తెలుగుజాతిని విడగొట్టేం దుకు, ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసేందుకు సాగుతున్న రాజకీయ కుట్రలో తనవంతు పాత్ర పోషించేందుకు వచ్చాడు. వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు, పోషకాహారానికి దూరమైపోయిన వేలాది మంది బాల బాలికల, శిశువుల అకాల మరణాలకు నిలయంగా ఉన్న గుజరాత్‌లోని సౌరాష్ర్ట ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కాలంగా ఉద్యమిస్తోంది. ఏడు జిల్లాలతో కూడిన (జామ్‌నగర్, సురేంద్రనగర్, రాజ్‌కోట్, అమ్రేలి, భావ్ నగర్, పోర్‌బందర్, జునాగఢ్) సౌరాష్ట్రను గుజరాత్ నుంచి వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న ఉద్య మం అక్కడ ఉధృతంగా సాగుతోంది. దానికి పరిష్కారం చూపలేని మోడీ తగుదునమ్మా అని తెలుగు జాతిని రెం డుగా చీల్చాలని రంకెలేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముక్కలు కావాలి, బీజేపీ నాలుగు సీట్లు పెంచుకొని, ఢిల్లీ దర్బారుకు ఎగబాకాలనేది అసలు రంధి! వేర్పాటు ఉద్యమానికి ఊతం ఇవ్వడం అందుకే!
 
 నెహ్రూకు పోటీగా సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నిలు వెత్తు భారీ విగ్రహాలు ఆవిష్కరించాలని మోడీ ఆరాట పడుతున్నాడు. కానీ పటేల్ నిలబడింది భారతదేశ సమైక్య తకు, సంస్థానాల విలీనీకరణ ద్వారా రాష్ట్రాల సుస్థిరత కోసమేగాని మోడీలాగా విభజన ద్వారా వ్యక్తిగత ‘వికా సం’ కోసంకాదు! ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్రాల పున ర్విభజన కోసం నియమించిన మొదటి ఫజలలీ కమి షనూ, నిన్నమొన్నటి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రెండు నివేదికలూ మొదటి ప్రాధాన్యాన్ని ఏకీకృత సమై క్యాంధ్రకే ఇచ్చాయనేది గమనార్హం. శ్రీకృష్ణ కమిషన్ ఆరు ప్రాధాన్యాలలో మొదటి ప్రాధాన్యాన్ని, ఆఖరి మాటనూ (1/6 ప్రతిపాదనలు) ఆద్యంతాల బిగింపు లాగా సమైక్య రాష్ట్రమే సరైనదీ, పురోగతికి సవ్యమైనదీ అని స్పష్టం చేసింది! ఇక్కడ నరేంద్ర మోడీగాని, అతడి లాంటి బీజేపీ నాయకులుగానీ ఈ సందర్భంగా సర్దార్ పటేల్ 1952, జూలైలో పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని బట్టీ పట్టక పోయినా కనీసం చదువుకొని ఉండటం అవసరం! ఆనాడే గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన తలెత్తినప్పుడు సర్దార్ పటేల్ ఇలా హెచ్చరించారు.
 
 ‘‘ఉత్తర బెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను అవాస్తవమైన, అసహజమైన, జాతీయ ప్రయోజనాలకు హానికరమైన ప్రతిపాదనగా భారత ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి ప్రత్యేక రాష్ట్రంఏర్పాటు కోసం జరిగే ఉద్యమానికి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇలాంటి మతిలేని ప్రయత్నాల ద్వారా దేశ సంఘీ భావాన్ని చెడగొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం సహించబోదు’’
 
 ఏక భాషాసంస్కృతుల ఆధారంగా సహేతుకమైన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును అభిలషిస్తూ జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానాలను గౌరవిస్తూ, అసహ జమూ, అశాస్త్రీయమైన పద్ధతుల్లో రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తూ సర్దార్ పటేల్ ఈ మాట చెప్పారనే వాస్తవాన్ని మోడీ ప్రభృతులు తెలుసుకోవటం మంచిది!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement