వీసీకే దక్కని న్యాయం!
సాధారణంగా అసమ్మతి అధ్యాపకులు, విద్యార్థులు ఆర్టీఐని దుర్వినియోగం చేస్తూ మమ్మల్ని వేధించుకు తింటున్నారని ైవైస్ చాన్స్‌లర్లు, విశ్వవిద్యాలయ అధికారులు ఆర్టీఐని నిందిస్తూ ఉంటారు. కాని ఆర్టీఐ ఒక వైస్ చాన్స్‌లర్‌కు కూడా ఏ విధంగా న్యాయమైన సాయం అందిస్తుందో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ.
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అస్లాం సమాచార చట్టం కింద దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది. ముందు ఇన్‌చార్జిగా ఆ తరువాత పూర్తికాలపు వైస్ చాన్స్‌లర్ గానూ ప్రొఫెసర్ అస్లాం నియమితులైనారు. ఇగ్నో కొన్ని అవకతవకలకు, లోపాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదులపైన 18 నవంబర్ 2014న దర్యాప్తునకు ఆదేశించారు. అనుమతి లేకుండా క్యాంపస్ బయట సెంటర్లు తెరవడం, జ్ఞాన్ దర్శన్, జ్ఞాన్ వాణి టీవీ కార్యక్రమాలను నిలిపివేయడం, భారత సైన్యానికి ఉద్దేశించిన కోర్సులను మూసివేయడం, చాలా మంది ప్రొఫెసర్లు రాజీనామా చేయవలసి రావడం, నిధులు వచ్చినా చైర్ నియామకాలు జరపకపోవడం, రిజిస్టర్ చేయకుండా ఇగ్నో రిలీఫ్ ఫండ్‌ను సృష్టించడం, భారత సైన్యం 28 కోట్లు, వైమానిక దళం ఉద్యోగులు 5 కోట్లు నిధులు ఇచ్చినా వారికి పరీక్ష లు నిర్వహించకపోవడం వంటి అవకతవకల గురించి విచారణ ను ఆదేశించారు.
గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆధ్వర్యంలో విచారణ సమంజసంగా జరగడానికి వీలుగా 28.11.2014 నాడు ైవైస్ చాన్స్‌లర్‌ను సెలవుపై వెళ్లమని మానవ వనరుల మంత్రిత్వ అధికారులు ఆదేశించారు. ఇది కేవలం విచారణే కాని వైస్ చాన్స్‌లర్ పైన నిందారోపణ కాదని ఆ శాఖ వివరించింది. దర్యాప్తు పూర్తయి నివేదిక సిద్ధంగా ఉన్నా తనకు ఇవ్వడం లేదని సహ దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే నివేదికను పరిగణించేముందు, ప్రొఫెసర్ అస్లాంను మళ్లీ పదవిలోకి తీసుకునే ముందు తమ అనుమతి తీసుకోవాలని 20.2.2015న మంత్రిత్వ శాఖ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు లేఖ రాసింది.
ఈ విచారణ నివేదికను ఇగ్నో విజిటర్ అయిన భారత రాష్ర్టపతికి ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రొఫెసర్ అస్లాం పిటిషన్‌పైన భారత ప్రభుత్వ న్యాయవాది విచారణ నివేదికను 3 సెప్టెంబర్ 2015న విజిటర్‌కు సమర్పిస్తామని ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చారు. అక్టోబర్ 7, 2015న హైకోర్టు విచారణ నివేదికను రాష్ర్టపతికి ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక సారాంశాన్ని వెంటనే విడుదల చేయరాదని, మూసిన కవర్‌లో కోర్టుకు నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించారు. రాష్ర్టపతి త్వరగా నిర్ణయం తీసుకునే వీలుందేమో ఆలోచించండి అంటూ ఢిల్లీ హైకోర్టు 15.12.2015న ఒక ఆదేశాన్ని జారీ చేసింది. 25.1.2016 నాడు మళ్లీ ఢిల్లీ హైకోర్టు విజిటర్ భారత రాష్ర్టపతి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రార్థిస్తూ విచారణ ముగించింది.
ఇంతకూ భారత రాష్ర్టపతికి నివే దిక అందిందా లేదా తెలియదు. విపరీ తంగా ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రొఫె సర్ అస్లాం వైస్ చాన్స్‌లర్ పదవీకాలం గడిచిపోతూ ఉంటుంది. సాధార ణంగా ఆలస్యం వల్ల కోరిన సమా చారం పనికి రాకుండా పోతుంది. కాని ప్రొఫెసర్ అస్లాం ఒక్కో రోజు ఆలస్యం వల్ల ఒక్కోరోజు పదవీకాలాన్ని కోల్పోతున్నారు. ఇంకొన్నాళ్లకు పదవీ కాలం పూర్తిగా ముగిసిపోవచ్చు. సమాచార వితరణలో ఆలస్యం సహ చట్టం కింద ఉల్లంఘనే. సమాచార నిరాకరణే కాకుండా, ప్రొఫెసర్ అస్లాం వైస్ చాన్స్‌లర్‌గా కొనసాగే హక్కుకూడా హరిస్తోంది. విచారణలో ఉంది కనుక నివేదిక ప్రతి ఇవ్వజాలమనే రక్షణ ఇప్పుడు ఎంహెచ్‌ఆర్‌డీకి లేదు.
ఇగ్నో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అస్లాంకు దూరవిద్యలో నిపుణుడని మంచి పేరు ఉంది. ఆయనమీద వ్యక్తిగతమైన ఆరోపణేదీ లేదని సంబంధిత అధికారులే వివరణ ఇచ్చారు. సక్రమంగా పరిశోధన జరిపి ప్రొఫెసర్ అస్లాం సైరైన వ్యక్తి అని భావించి ఆయనను వైస్ చాన్స్‌లర్‌గా నియమించారు. విచారణ నివేదిక ఇవ్వకపోవడం వల్ల ఆయన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు. ఏ దర్యాప్తు కారణంగా ఆయన సెలవుపై వెళ్లవలసి వచ్చిందో, ఆ ఆరోపణలపై దర్యాప్తు నివేదికను కోరుకునే హక్కు ప్రొఫెసర్ అస్లాంకు ఉంది. ఇది సహజన్యాయం కూడా. కానీ దర్యాప్తు నివేదికను ఇచ్చిన తరువాత కూడా రాష్ర్టపతికి ఇస్తున్నామని, మున్ముందు ఇస్తామని అంటూ కాపీ ఇవ్వకపోవడం న్యాయం కాదు. నివేదికను బట్టి సత్వర చర్య తీసుకోవడం సుపరిపాలన అవసరం. ఏ చర్యా తీసుకోకపోవడం వెనక ఏవో శక్తులు ఉన్నాయని ప్రొఫెసర్ అస్లాం అనుమానిస్తున్నారు.
ప్రొఫెసర్ అస్లాం వయసుకు, పదవికి, పేరు ప్రతిష్టలకు కనీస గౌరవం ఇచ్చినా విచారణ నివేదికను నిలిపివేయడం జరిగేదికాదు. ఇప్పుడీ విచారణ నివేదిక రాష్ర్టపతికి ఇస్తారా ఇవ్వరా, దీనిపైన ఏవైనా చర్యలు ఉంటాయా లేదా? ప్రొఫెసర్ అస్లాంను వైస్ చాన్స్‌లర్ పదవిలోకి రానిస్తారా రానివ్వరా తెలియని గందరగోళం కొనసాగుతున్నది. నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వాధికారులు కాలహరణం చేయడాన్ని ప్రశ్నించడానికే ఆర్టీఐ వచ్చింది. నివేదిక ప్రతి ఎప్పుడు ఇస్తారు? ఏ చర్య తీసుకున్నారు. నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కమిషన్ ఆదేశించింది.
(ప్రొఫెసర్ అస్లాం, వర్సెస్ ఎంహెచ్‌ఆర్‌డీ
CIC/CC/A/2015/004250-SA కేసులో 29.3.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com
- మాడభూషి శ్రీధర్