
సామాన్యునికి సేంద్రియ ఉత్పత్తులు
సందర్భం
శుభ్రమైన పరిసరాలు, ఆరో గ్యవంతమైన ఆహారాలను ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి తీసుకురావడం ప్రభు త్వాల బాధ్యత. సాగుకు ఉప యోగిస్తున్న రసాయనాల కార ణంగా నేల, నీరు, పరిసరాలు విషపూరితం అయిపోయా యన్నది నేడు రుజువైన వాస్తవం. 30 ఏళ్ల క్రితం మన మధ్యలో మెసిలిన వేలాది జీవరాసులు అంతరించి పోవడం వేదనతో మనం గమనిస్తున్న దృశ్యం. ఈ పరిస్థితి మారి తీరాలన్నది ప్రపంచ దేశాల, కోట్లాది ప్రజల అభిమతం. సేంద్రియ విధానంలో సాగును అమలు చేయడం ఇందుకు పరిష్కార మార్గమనేది అందరూ ఆమోదించిన అంశం.
అయితే జరుగుతున్నదేమిటి? సేంద్రియ ఎరు వులు, పురుగు మందులు, విత్తనాలు ఇబ్బడిముబ్బడిగా బజారులో ప్రత్యక్షమయ్యాయి. రసాయనిక ఎరువులు, మందులతో నడుం విరిగిన రైతుకు ఊరట లభించక పోగా మరింత భారం పెరిగింది. ఆరోగ్యవంతమైన ఉత్పత్తులతోబాటు రైతు సౌభాగ్యం కూడా అత్యంత అవసరం అనే అంశాన్ని మనం మరువకూడదు. సుభాష్ పాలేకర్ విధానం ఇందుకు పరిష్కారాన్ని చూపింది. రసాయనాల వినియోగంతో నిర్జీవమైన మట్టికి, జీవరాసులకు నాటు ఆవు పేడ, మూత్రాలతో తిరిగి జీవం పోయవచ్చు అనేది వారి మొదటి సూత్రం.
అదనపు ఎరువులు వేయకపోయినా ప్రకృతి పరిణా మాల కారణంగానే నేల సారాన్ని పొంది, పంటలకు అందించగలుగుతుంది. అందుబాటులోని వనరుల నుండి తయారు చేసుకునే కషాయాల ద్వారా పంటలకు పట్టే చీడపీడలను వదిలించుకోవచ్చు. ఇది వారి రెండవ సూత్రం. రైతు తన ఉత్పత్తులను అమ్మాలి తప్ప, విత్త నాలతో సహా ఏ వస్తువును బయటి నుండి కొనకూడదు అన్నది వారి మూడవ సూత్రం. అయితే గత 30 ఏళ్లుగా రసాయన ఎరువులతో సేద్యానికి అలవాటుపడిన రైతుకు ఈ కొత్త దారికి రావడం అంత సులువేమీ కాదు.
సేంద్రియ వ్యవసాయం సమగ్ర అమలుకోసం గ్రామాల్లో కులాలు, పార్టీలకు అతీతంగా రైతు సంఘాలు నిర్మాణం కావాలి. శాస్త్ర సాంకేతిక పద్ధతుల అవగాహనతో నేల పరీక్షలు, పంటల ఎంపికలు, విత్తనాల తయారీలు ఈ సంఘాల ద్వారా జరగడం మొదటి మెట్టు. కొన్ని రైతు సంఘాలు కలసి ఒక రైతు సమాఖ్యగా ఏర్పడాలి. వ్యవసాయ పరిశోధనలను గ్రామాల్లోని రైతుకు అందజేసే బాధ్యతలను ఇవి చేపడ తాయి. రైతు తప్పనిసరి అని భావించే ఎరువులు, పురుగుమందుల తయారీలను కూడా ఇవి చేయగలు గుతాయి. వీలైనంత వరకు రైతు తన అవసరాలను తానే తీర్చుకోగలగాలి. తప్పనిసరైతే తాను సభ్యునిగా ఉన్న రైతు సమాఖ్య నుండే సరుకులను కొనుగోలు చేయాలి.
ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం మరొక టున్నది. రైతు కాని, గ్రామంలోని రైతు సంఘం కాని చేయలేని పనిని రైతు సమాఖ్య సమర్థతతో నిర్వహించ గలుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను కొని, టోకు గాను, చిల్లరగాను వ్యాపారులకు అమ్ముతుంది. అవస రాన్ని బట్టి బజారులో అమ్మక కేంద్రాలను నిర్వహి స్తుంది. ఇంటింటికీ సరుకులను అందజేసే వ్యవస్థలను రూపొందించుకుంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల మెరుగుదల, అమ్మకాలను రైతు సమాఖ్య నిర్వహిం చడం ద్వారా, దళారీ వ్యవస్థను పరిమితం చేస్తుంది. అయితే గ్రామాల్లో రైతు సంఘాలను, ఆపై రైతు సమాఖ్యలను స్వచ్ఛంద సంస్థలే నిర్మాణం చేయాలి.
ఒక మున్సిపాలిటీలోని ప్రజలకు ఆరోగ్యకరమైన తిండి గింజలను, కూరగాయలను అందించే లక్ష్యంతో చుట్టుపక్కల గ్రామాల రైతులను సంఘటితపరిచే బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చేపట్టాలి. మూడు నుండి ఐదేళ్ల సమయంలో ఈ లక్ష్యాన్ని అది చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లోని 109 మున్సిపాలిటీలలో ఈ బాధ్యతలను చేపట్టడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా 2% ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఎలాగూ ఉన్నది. వారు ఇందులో కనీసం 50% మొత్తాన్ని సేంద్రియ వ్యవసాయ విస్తరణకు కేటాయిం చడం ద్వారా ఈ ఉద్యమానికి సహకరించాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపల్ కేంద్రాలలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మక కేంద్రాలకు ఉచితంగా దుకాణాలను కేటాయించాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయాలలోను, పరిశోధనా కేంద్రాలలోను రుజువైన ఫలితాలను పేటెంట్ చేయకుండా బహిరంగ పరచాలి. సాంకేతిక పరంగా యోగ్యమైన గిడ్డంగులను రైతు ఫెడరేషన్లకు ప్రభుత్వమే ఉచితంగా కట్టించి ఇవ్వాలి. సేంద్రియ ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షలకు అవసరమైన ల్యాబ్ లను జిల్లాస్థాయి రైతు సమాఖ్యలకు ఉచితంగా ప్రభుత్వం అందజేయాలి.
సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా సిక్కిం ప్రకటించుకున్నది. మరో ఐదేళ్లలో తాము కూడా అదే స్థానంలో నిలుస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దేశమంతటా ఇది ఆచరణ యోగ్యం కావడానికి ప్రతి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోను ‘సేంద్రియ వ్యవ సాయం’ ఒక ప్రధాన విభాగంగా ప్రారంభం కావాలి. కేవలం సేంద్రియ వ్యవసాయ శిక్షణ కోసమే కొన్ని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను, కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించాలి.
ఒక గింజను విత్తితే పదివేల గింజలను అంది స్తుంది నేలతల్లి. అతి తక్కువ ఖర్చుతో, అత్యంత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందజేయడమే సేంద్రి య వ్యవసాయ లక్ష్యం కావాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు, తన పంటలకు అదనపు ధర కావాలని రైతు కోరడు. ప్రస్తుతం శ్రీమం తులకే అందుతున్న సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు సామాన్యులకు కూడా సరసమైన ధరలకు అందు బాటులోకి రావాలి. అందుకు రైతులు సమాయత్తం కావాలి; స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టుకోవాలి; వ్యాపార, పారిశ్రామికవేత్తలు సహకరించాలి. ప్రభుత్వం తన విధానాలను సవరించుకోవాలి.
(మార్చి 19-20న హైదరాబాద్‌లో ‘సేంద్రియ వ్యవసాయంతో రైతు సౌభాగ్యం’ అంశంపై
జాతీయ సదస్సు సందర్భంగా)
- పి. వేణుగోపాల్‌రెడ్డి
వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్
మొబైల్: 94904 70064