ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు? | Relatives to whom these laws? questioned, DileepReddy | Sakshi
Sakshi News home page

ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు?

Published Thu, Nov 27 2014 11:55 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు? - Sakshi

ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు?

దేశంలో నిరుపయోగమైన చట్టాలు దాదాపు 1,400 ఉన్నట్టు జైన్ కమిషన్ (1998) నివేదిక తెలిపింది. చట్టాలు చేయడంలో అమితాసక్తి చూపే మనం, కాలం చెల్లిన వాటిని రద్దు చేసుకోవడంలో నత్తనడక నడుస్తాం. బ్రిటిష్ కాలంనాటి 300 చట్టాలు నేటికీ చలామణిలో ఉన్నాయి. కాలం చెల్లిన ఈ చట్టాలు  పౌరులకు అక్కరకు రాకున్నా, పౌరుల్ని వేధించే సాధనాలుగా నియంత్రణ వ్యవస్థలకు బాగా పనికొస్తాయి. సమాచార హక్కు చట్టం వచ్చాక ‘అధికారిక రహస్యాల చట్టం-1923’ కొనసాగటం అర్థరహితం. కానీ ఆ చట్టమే పాలనలో పారదర్శకతకు అడ్డుపడే అధికార సైంధవులకు ఊతమవుతోంది.
 
కోల్‌కతాలో మీరు స్థలం అమ్మాలనుకుంటున్నారా? ఎవరికి పడితే వారికి అమ్మలేరు, అమ్మితే గిమ్మితే ‘ఈస్టిండియా కంపెనీ’కి మాత్రమే అమ్మాలి! 150 ఏళ్ల కిందటే ఆ కంపెనీ దేశం వదలి వెళ్లిందంటారా? అయినా, వారికి అమ్మా ల్సిందేనని చెప్పే 1838 నాటి చట్టం ఇంకా మన దేశంలో చలామణిలోనే ఉంది.
 
మీ ఫ్యాక్టరీలో ఎంత అధునాతన సాంకేతిక అగ్నిమాపక వ్యవస్థను ఏర్పా టు చేసుకున్నా సరే... ఎర్ర రంగు వేసిన ఇసుక బకెట్లు, నీళ్ల బకెట్లు ఒకదాని పక్కన ఒకటి వేలాడదీయాల్సిందే. లేదంటే మీ మీద కేసు బుక్ చేయొ చ్చంటుంది 1867 నుంచీ అమల్లో ఉన్న ఇంకో చట్టం.
 
భూమిలో ఏ చిన్న నాణమో, నగో, నట్రో... దొరికితే దాచుకునేరు, దొరికి పోతారు! అది ‘మహారాణి’కి అంటే బ్రిటన్‌లోని ఎలిజబెత్ రాణికే చెందు తుంది! హవ్వ! ఇంకెక్కడి రాణి? బ్రిటిష్‌వాళ్లు మనల్ని వదిలి ఆరు దశాబ్దాలు దాటిందంటారా? నిజమేగానీ, 1878 నాటి ‘ఇండియా ట్రెజర్ ట్రోవ్ చట్టం’ ఇంకా అమల్లోనే ఉంది. దాన్ని మనం వదల్లేదు.
 
ఇదీ దేశంలోని కాలం చెల్లిన చట్టాల కథా కమామిషు! దురదృష్టవశాత్తు ఇలాంటి కొన్ని వందల చట్టాలు ఇంకా అమల్లో ఉన్నాయి. అవి ఉండి ఉద్ధరిం చేదేమీ లేకపోయినా, అధికార యంత్రాంగం సగటు పౌరులతో అప్పుడప్పుడూ ఓ ‘ఆట ఆడేసుకోడానికి’ మాత్రం పనికొస్తున్నాయి. మన ప్రధాని నరేంద్రమోదీ ‘‘కాలం చెల్లిన చట్టాలకు చరమ గీతం పాడతాం. కట్టకట్టి అన్నిటినీ అటకెక్కి స్తాం, కావాలంటే రోజుకొకదానికి చొప్పున చెల్లుచీటీ పాడతాం’’ అని ప్రకటిం చిన తర్వాత ఈ సమస్యపై కొంత కదలిక మొదలైంది. కానీ, ఆశించినంత పక డ్బందీగా ఆ పని జరగట్లేదు. పాత కథే మళ్లీ మొదలవుతోంది. అసంబద్ధ్దమైన, కాలం చెల్లిన చట్టాల్ని పూర్తిగా వదిలించుకోవడమో, తగు రీతిన సవరించుకోవ డమో జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ లోగడ జరిగినట్టే... ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. ఇదీ అసలు కథ!
 
ఈ వేగం సరిపోతుందా?

అనవసరమైన, అమలుకు వీలుకాని, కాలదోషం పట్టిన చట్టాల్ని తొలగించాలని చాలా కాలంగా దేశంలో చర్చ జరుగుతోంది. కొంత కసరత్తు, ఆచరణ కూడా లోగడ జరిగింది. ‘కొన్ని పరిమిత అంశాలు అని కాదు, మొత్తం చట్టమే అమలు యోగ్యం కాని సందర్భాలు కూడా ఈ దేశంలో కొల్లలుగా ఉన్నాయి’ అని ప్రముఖ ఆర్థిక వేత్త బిబేక్ దేబ్‌రాయ్ వ్యాఖ్యానించారు. కాలదోషం పట్టిన చట్టం, కొంత కాలం గడిచాక నియంత్రణ వ్యవస్థలు, వ్యక్తులు దురుపయోగం చేయడానికే పనికి వస్తుందని అంటారాయన. మన చట్టాల అసంబద్ధ్దతపై ఒక పుస్తకమే రాసిన దేబ్‌రాయ్ సలహా మేరకు... గత సార్వత్రిక ఎన్నికల ప్రచా రంలో నరేంద్ర మోదీ ఈ విషయమై నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇటువంటి చట్టాల్ని రద్దు చేస్తామన్న ప్రధాని ఇటీవలి అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ ఈ అంశాన్ని నొక్కిచెప్పారు. కాలం చెల్లిన చట్టాల ‘రద్దు, సవరణల బిల్లు-2014’ కు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెం టు ఆమోదం పొందేందుకు ఏర్పాట్లు జరిగాయి. తొలగించాల్సిన చట్టాలు దాదాపు 300 ఉన్నాయని అగ్రనేతలు ప్రకటిస్తూ వచ్చారు. గత జూన్ నుంచి లోతైన అధ్యయనం కూడా జరిగింది. చివరకు 36 చట్టాలను తొలగించడమో, సవరించడమో చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వాటినే ప్రస్తుత బిల్లులో పొందుపరిచారు. అయితే వీటిలో పూర్తి స్థాయిలో తొలగిస్తున్న చట్టాలు 4 మాత్రమే. ఇండియన్ ఫిషరీస్ యాక్ట్-1897, ఫారిన్ జూరిస్డిక్షన్ యాక్ట్- 1947, ది షుగర్ అండర్‌టేకింగ్ యాక్ట్-1978, ది ఎంప్లాయ్‌మెంట్ ఆప్ స్కావెంజర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లేట్రిన్స్ యాక్ట్-1993 ఈ తొలగించే చట్టా ల్లో ఉన్నాయి. మరో 30 చట్టాలు నిజానికి పూర్తిస్థాయి చట్టాలు కావు. ఆయా సందర్భాల్లో ప్రధాన చట్టాల్లో సవరణలకు ఉద్దేశించిన బుల్లి చట్టాలు. అవి ఎప్పుడో కాలదోషం పట్టినవి, సహజంగానే వినియోగంలో లేనివి. ఇప్పుడు రద్దవుతున్నాయి. మరో రెండు ముఖ్యమైన చట్టాలు, మరుగుదొడ్ల శుద్ధిలో మనుషుల సేవల్ని నిషేధించి, పునరావాసం కల్పించే చట్టం-2013, విజిల్‌బ్లో యర్స్ రక్షణ చట్టం- 2011లలో కొన్ని సవరణలు తీసుకురానున్నారు. వచ్చే సమావేశాల్లో మరికొన్ని చట్టాల్ని తొలగించే యోచన ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
 
స్వాతంత్య్రం వచ్చాక తొలి యాభయ్యేళ్లలో నూరు చట్టాల్ని మాత్రం రద్దు చేసుకోగలిగాం. 1998లో జైన్ నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ దేశంలో దాదాపు 1,400 నిరుపయోగమైన చట్టాలున్నట్టు నివేదిక ఇచ్చింది. మొత్తమ్మీద దేశంలో కాలదోషం పట్టి, రద్దయిన చట్టాలు ఇప్పటివరకు 400 కూడా లేవు. బ్రిటిష్ పాలన కాలంలో వచ్చిన చట్టాలే ఇంకా 300 వరకు చలామణిలో ఉన్నాయి. 2001 తర్వాత ఇప్పుడే మళ్లీ ఇటువంటి చట్టాల్ని తొలగించే ప్రక్రియకు పెద్ద ఎత్తున పూనుకున్నారు. చట్టాలు చేయడంలో అమితాసక్తి చూపే మనం, కాలం చెల్లిన వాటిని రద్దు చేసుకోవడంలో మాత్రం నత్తనడక తీరున వ్యవహరిస్తాం. కాలానుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకోవడంలోనూ మనది ఆచితూచి నడిచే ధోరణే! తిప్పి కొడితే వందసార్లు రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి (2013 వరకు 98 సవరణలు) ఆరు దశాబ్దాల కాలం పట్టింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఫ్రాన్స్ రాజ్యాంగం మీద ఓ మంచి జోక్ ప్రచారంలో ఉంది. పారిస్‌లో ఎవరో ఒక ఔత్సాహికుడు పుస్తక విక్రేత దగ్గరికెళ్లి, ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రతి అడిగాడు. ‘సారీ, మేం పీరియాడికల్స్ విక్రయించం’ అన్నాట్ట! అంటే, ఓ వార పత్రికలాగో, మాస పత్రికలాగో వాళ్ల రాజ్యాంగం తరచూ సవరణలకు గురవుతోందని కవి హృదయం.
 
పనికిరాని చట్టాలతో ప్రమాదం..!

విప్లవాత్మకమైన సమాచార హక్కు చట్టం వచ్చాక ఇంకా ‘అధికారిక రహస్యాల చట్టం-1923’ కొనసాగటంలో అర్థమేముంది? నిజానికి ఆ చట్టంలో ‘గోప్యత’ అంటూ పొందుపరచిన అంశాలేవీ చెల్లుబాటు కావని 2005లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం స్పష్టం చేస్తోంది. ఎలా అంటే, ‘సమాచారం ఇవ్వటం-నిరాకరించడం’ అన్న వివాదం తలెత్తినపుడు... అధికారిక రహస్యాల చట్టంతో సహా దేశంలోని ఏ చట్టంలో ఏం చెప్పినప్పటికీ, సమాచార హక్కు చట్టంలో పేర్కొన్నదే అంతిమం అనే నిబంధన ఉంది. అలాంటప్పుడు అధికా రిక రహస్యాల చట్టం ఉంటేనేం, లేకుంటేనేం? అనే భావన ఎవరికైనా కలగ వచ్చు. కానీ, ‘గోప్యత’ను అడ్డుపెట్టుకొని పాలనలో పారదర్శకతకు అడ్డుపడే అధికార సైంధవుల భావజాలానికి ఇటు వంటి చట్టాలు ఊతమిస్తాయి. కాబట్టి అవి అసలు చెల్లుబడిలోనే ఉండకూడదు. కాలంచెల్లిన చట్టాలు పౌరులకు ఉపయోగపడకపోగా కొన్నిసార్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. సాధారణ పౌరులకు అక్కరకురాని చట్టాలు, పౌరుల్ని వేధించే సాధనాలుగా నియంత్రణ వ్యవస్థలకు బాగా పనికొస్తాయి. కాలదోషం పట్టిన చట్టాల్లోని అర్థంపర్థం లేని సెక్షన్లను చూపి వేధించే నియంత్రణ అధికారులు ఎందరో! ఉదాహరణకు: ‘ఒక చోటి నుంచి మరోచోటికి ఉత్తరాల్ని బట్వాడా చేసే అధికారం ఒక్క సమాఖ్య రాజ్యానికే ఉంది’ అని ‘ది ఇండియన్ పోస్టాఫీస్ యాక్ట్-1898’ చెబుతుంది. అదింకా అమల్లోనే ఉంది. ‘ఏయ్! మీరెవరు ఉత్తరాల బట్వాడాకు?’ అనే అధికారుల బెదిరింపులకు జడిసి, ఇప్పుడున్న కొరియర్ సర్వీసు సంస్థలన్నీ ఉత్తరాల్ని ఉత్తరాలు అనకుండా ‘పత్రాలు’ (డాక్యుమెంట్స్)  అంటున్నాయి!
 
మరో అంబేద్కర్ రావాలా?

ఇలాంటి పనికిమాలిన అంశాల ఆధారంగా సాగించే జులుం ఎంతో! ఈ చట్టాల వల్ల ప్రజలకే కాకుండా ప్రభుత్వాలకూ ఒరిగేదేమీ ఉండదు. 2013-14లో ఉప్పుపై విధించిన సెస్సు ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 32.82 కోట్ల రూపాయలు. ఈ సెస్సు వసూళ్ల కోసం 800 మంది ఉద్యోగులతో ఇండియన్ సాల్ట్ సర్వీస్ పేరిట ఓ విభాగాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం వెచ్చించిన ఖర్చు ఆదాయానికి దాదాపు రెట్టింపు. నవ్వొచ్చినా నవ్వకండి! ‘ఉప్పు సెస్సు చట్టం- 1953’ ప్రకారం జరుగుతోందిదే. ‘ఉప్పు సెస్సు వార్షికాదాయం మొత్తంలో సగంకన్నా ఎక్కువ వసూళ్లకే వ్యయమౌతోంది, ఈ సెస్సును ఎత్తివేయండి’ అని 1978లోనే ఓ ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి మరో అంబేద్కర్ రావాలేమో!
 
న్యాయస్థానాల కొరత, ఎన్నటికీ భర్తీ కాని న్యాయమూర్తుల ఖాళీలు, విచారణల్లో అనుచిత జాప్యాలు... ఇలా అనేకానేక కారణాల వల్ల ఈ దేశంలో ఇప్పటికే సకాలంలో న్యాయం లభించడం గగనమౌతోంది. లెక్కకు మిక్కిలిగా ఉన్న చట్టాలే సామాన్యులను అయోమయంలోకి నెడుతున్నాయి. పైగా కాలదోషం పట్టిన చట్టాలు వాటికి తోడై వారికి న్యాయాన్ని అందించడంలో మరింత జాప్యం జరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త! న్యాయ జాప్యం, న్యాయ నిరాకరణ కిందే లెక్క!

ఆర్. దిలీప్ రెడ్డి  
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement