
‘ప్రత్యక్ష’మైతే ‘రక్షణ’కు లోపమే
ఇండియా వంటి వర్ధమాన దేశాలను మరింతగా లొంగ దీసుకోవడానికి ప్రపంచ బ్యాంకు కొన్ని పడికట్టు పదాలను మత్తుమందులా చల్లుతూ ఉంటుంది. ‘స్మార్ట్ సిటీస్’, ‘అభివృద్ధి నగరాలు’ అలాంటి పదాలే. అందులో ఉన్నది లాభాల వేటే.
‘‘మా విధానాల, పథకాల ‘కాపీ’యే బీజేపీ-ఎన్డీఏ మోడీ ప్రభుత్వ నిర్వాకమంతా!’’ అని నేడు ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ -యూపీఏ నేతలు కొందరు విమర్శించారంటే, అందులో నిజం లేకపోలేదు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులలోనే బీజేపీ తన ‘మేకవన్నె’ దుస్తులను క్రమంగా వదిలేసి, పులిచర్మం కప్పుకోవడం మొదలుపెట్టింది. నిజం కురచ, బొంకు పొడవు అని సామెత. నరేంద్ర మోడీ గద్దెనెక్కడంతోనే ‘కఠిన నిర్ణయాలకు’ దేశం సన్నద్ధంగా ఉండాలని ముందస్తు హెచ్చరిక చేశారు. ఆ కఠిన నిర్ణయాలు దేశంలో రోజుకొక తీరున బతుకుభారంతో కుంగిపోతున్న 90 శాతం ప్రజాబాహుళ్యం ప్రయోజనాలను కాపాడేవి కావు. నిజానికి ఇవి ‘చాయ్‌వాలా’ తీసుకోవలసిన నిర్ణయాలు కూడా కావు. చేపట్టవలసిన విధానాలూ కావు. అనుసరించవ లసిన అభివృద్ధి మంత్రం కూడా ఇది కాదు.
దేశ ప్రగతికి ఉద్దేశించిన ప్రణాళికాబద్ధమైన, కనీస మౌలిక వసతులపై ఫిర్యాదులకు తావులేని పరిస్థితిని కల్పించేందుకు ఉద్దేశించినవి కూడా కావు, మోడీ కఠిన నిర్ణయాలు. ప్రజాస్వామిక వ్యవస్థకు అవసరమైన ఆర్థిక వ్యవస్థ పునర్ నిర్మాణానికి ఆచరించవలసిన కఠిన నిర్ణయాలు కూడా కావు. ప్రధానమంత్రి నుంచి మనం ఆశించేది, అతడు అనుసరించబోయే రాజకీయ, ఆర్థికపరమైన ప్రకటనలే. ఎలాంటి ‘గుప్త విద్యలు’ కాదు.
గుప్త విద్యల గూడుపుఠాణి
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వ బడ్జెట్‌లో ఒక్క విషయం తప్ప అన్నీ గుప్త విద్యలు గానే ఉన్నాయి. ఆ ఒక్క విషయం - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ద్వారాలు ఇంకాస్త పెద్దగా తెరవడమే. ఇంతకు ముందుకన్నా ప్రత్యక్షంగా ఎక్కువ వాటాలతో భారత కంపెనీలలో ప్రవేశించడానికి బాహాటంగా తలుపులు తెరవడమే. దేశ సార్వభౌమాధికారానికీ, సమగ్రతకూ భద్రత కల్పించే రక్షణ విభాగ పరిశ్రమలలోకి బహుళజాతి సంస్థల పెట్టుబడులనూ, వాటి జోక్యాన్నీ పెంచడం ఇలాంటిదే. ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇంతవరకు ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. పైగా, దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగానికీ, రైతాంగ శ్రేయస్సుకీ ఉద్దేశించిన సబ్సిడీలలో కోత పెట్టడానికి మోడీ ప్రభుత్వం సన్నద్ధం కావడం ఇంకొక విశేషం. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వ్యవసాయోత్పత్తులను దీటుగా ఎదుర్కొంటున్న రైతులకూ; ఈ వర్ధమానదేశంలో ఆహారం, ఎరువులు, ఇక్కడి పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా ఉండే రాయితీలన్నింటికీ అలాంటి గతే పట్టించాలని ఆ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పని మొత్తం ఒక్కసారే నిర్వహిస్తే ప్రజాబాహుళ్యంలో ‘గత్తర’ తప్పదు. కాబట్టి విచిత్ర తరహాలో కల్పించిన ‘ఓదార్పు’ అనే రాయితీ ఏమిటీ అంటే, సబ్సిడీల ఉపసంహరణ ప్రస్తుతానికి బదులు రేపటికి వాయిదా వేయడమే. మరో మాటలో చెప్పాలంటే ఆహార, ఎరువుల రాయితీలను తొలగించడం ఖాయమని హెచ్చరించడమే.
ప్రజలను మభ్యపెట్టడానికే
రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అవకాశాన్ని 49 శాతానికి పెంచి, మిగిలిన 51 శాతం భారత ప్రభుత్వం నియంత్రణలోనే ఉంటుందని చెప్పడమంటే, ప్రజలను భ్రమలలో ఉంచడానికే. మన రిజర్వు బ్యాంకు ఇదే అంశం మీద ఇదివరకు ఇచ్చిన ఒక సమీక్షలో స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘విదేశీ గుత్త పెట్టుబడులు భారత పరిశ్రమలలోకి ప్రవేశించేది పేరుకు 25/26 శాతమే అయినా, ఆ 26 శాతంతో పాటు విదేశీ సాంకేతిక నైపుణ్యంతో రంగ ప్రవేశం చేస్తాయి కాబట్టి ఆ పెట్టుబడులే భారత ప్రయోజనాలను శాసిస్తాయి.’ అని అనుమానాలకు తావులేని రీతిలో రిజర్వు బ్యాంకు వివరించింది. ఆ తరువాత కూడా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అమెరికా కనుసన్నలలోనే నడిచే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల ‘సంస్కరణల’ తాఖీదులనే అమలు చేస్తూ వచ్చాయి. ఇండియా వంటి వర్ధమాన దేశాలను మరింతగా లొంగ దీసుకోవడానికి ప్రపంచ బ్యాంకు కొన్ని పడికట్టు పదాలను మత్తు మందులా చల్లుతూ ఉంటుంది. ‘స్మార్ట్ సిటీస్’, ‘అభివృద్ధి నగరాలు’ అలాంటి పదాలే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారానే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఇండియా వంటి బడుగు వర్ధమాన దేశాలలో పాగా వేసిందన్నదే వాస్తవం. ధర్మగుణంతో, కారుణ్యంతో ఆ పెట్టుబడులు ఇక్కడికి రాలేదని అనుభవం చెబుతోంది. అందులో ఉన్నది లాభాల వేటే. ఎఫ్‌డీఐతో వచ్చిన లాభాలు న్యూయార్క్, లండన్, టోక్యో, బెర్లిన్ నగరాలలో ఉన్న ఆయా సంస్థలకు చేరుకుంటాయి. అదే దేశీయ పరిశ్రమలు చేసే అదనపు ఉత్పత్తి ద్వారా వచ్చే లాభాలు ఇక్కడి పరిశ్రమల వ్యాప్తికి, పారిశ్రామికీకరణకు, దేశీయ పెట్టుబడి విస్తరణకు ఉపయోగపడతాయి. అంటే ఇండియా వంటి వర్ధమాన దేశాలకు మిగిలేది హళ్లికి హళ్లి, సున్నాకు సున్న. అంతేకాదు, విదేశాలకు తరలిపోయే లాభాలుగానీ, వడ్డీలు గానీ మూడురెట్లు ఉంటున్నాయి. చౌకగా లభించే ముడిసరుకు, కారు చౌకగా దొరికే శ్రామిక శక్తి ఈ లాభాలకు చోదకశక్తులు. ఇదేకాకుండా, ఇండియాలో వ్యాపారాలను, సంస్థలను కొనుగోలు చేయడానికి విదేశీ గుత్త పెట్టుబడులు ఎఫ్‌డీఐలో 70 శాతం ఉపయోగిస్తాయన్నది మరో వాస్తవం.
బీజేపీ పాలనలో వెల్లువ
ఒక్క బీజేపీ పాలన(2001-2002)లోనే 65 శాతం ఎఫ్‌డీఐలు ఇండియా చేరాయి. అదీ ఎప్పుడు? 2001లో ప్రపంచ మొత్తం ఎఫ్‌డీఐలు సగానికి సగం పడిపోగా (అప్పటికి ముప్పయ్యేళ్లలో ఈ పతనం అతి పెద్దది) ఇక్కడ మాత్రం అవి 47 శాతానికి పైగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిని చూసే, భారతీయ జాతీయోద్యమ తొలి తరం మహనీయుడు, ప్రసిద్ధ ఆర్థికవేత్తలలో ఒకరు దాదాబాయ్ నౌరోజీ ‘డ్రైన్ థియరీ’ని ముందుకు (దేశీయ సొమ్ము విదేశీయులకు లాభాల రూపంలో ఊడ్చుకుపోవడం) తీసుకువచ్చారు. తాజాగా ‘ది హిందు’ కూడా మోడీ ఆర్థిక విధానం కాంగ్రెస్-యూపీఏ విధానాల కంటే భిన్నమైనది కాక, వాటి కొనసాగింపేనని వ్యాఖ్యానించింది. పోఖ్రాన్ -1 అణు పరీక్షల తరువాత అమెరికా విధించిన ఆంక్షలను బీజేపీ హయాంలో నిర్వహించిన పోఖ్రాన్-2 అణుశక్తి పాటవ పరీక్షల (1998) తరువాత విధించినవి 2002లో చాలావరకు తొలగిం చారు. రెండో పోఖ్రాన్ పరీక్షల సామర్థ్యం ప్రశ్నార్థకమైన తరువాత ఈ నిర్ణయం జరిగింది. భారత్ కంపెనీలతో కుదుర్చుకోదగిన 150 రకాల సైనిక, వ్యాపార నిబంధనలను 20కి అమెరికా కుదించింది. నాటి భారత ప్రధాని వాజపేయి, అమెరికా అధ్యక్షుడు బుష్ మధ్య సెప్టెంబర్ 1, 2001లో జరిగిన ఒప్పందం వల్లే ఇదంతా సాధ్యమైంది.
ఆ తరువాతే బుష్ మంత్రివర్గ సభ్యులు ఐదుగురు పలుసార్లు భారత్‌లో పర్యటించారు. ఆ క్రమంలోనే అమెరికా విదేశాంగ కార్యదర్శి పావెల్, రక్షణ కార్యదర్శి డొనాల్డ్ రమ్స్‌ఫీల్డ్, ఆర్థిక కార్యదర్శి ఓనీల్, వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి క్రిస్టీ టాడ్ విట్మన్ ఇక్కడకు దూసుకొచ్చారు. వీరుగాక మరో వంద మంది అమెరికా అధికార ప్రతినిధులు కూడా వచ్చారు. ఈ వరదంతా బీజేపీ హయాంలోనే. అమెరికా విదేశీ వ్యవహారాల ఉప కార్యదర్శి, సైనిక దళాల సంయుక్త అధిపతి జనరల్ రిచర్డ్ మేయర్స్, ఎఫ్‌బీఐ డెరైక్టర్ రాబర్ట్ ముల్లర్ ఢిల్లీ వచ్చారు. బీజేపీ-బుష్ మధ్య కుదిరిన ఆ ఒప్పందాన్నే ‘భారత విదేశాంగ విధానంలో చరిత్రాత్మక మలుపు’ అని నాటి అమెరికా రాయబారి రాబర్ట్ బ్లాక్‌విల్ నవంబర్ 27, 2002న కోల్‌కతాలో ప్రకటించారు కూడా. ‘1648 నాటి వెస్ట్‌ఫేలియా ఒడంబడిక తరువాత మళ్లీ ఈ ఆధునికయుగంలో ఇదే చరిత్రాత్మకమైన ఒప్పం దం’ అని ఆయన అన్నాడు. ఆ తరువాతే 2003లో అమెరికా గూఢచారి సంస్థ అత్యాధునిక కెమేరాలు అమర్చిన ఉపగ్రహంతో మన రక్షణ వ్యవస్థ కేంద్రాలను ఫొటోలు తీసిన సంగతిని మరచిపోరాదు. అందుకే కాంగ్రెస్, బీజేపీ, ఇద్దరి పాలన దొందుకు దొందే!
విశ్లేషణ: ఏబీకే ప్రసాద్
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)