సత్యం రామలింగరాజు రాయని డైరీ | Satyam Ramalinga Raju unwritten Diary | Sakshi
Sakshi News home page

సత్యం రామలింగరాజు రాయని డైరీ

Published Sun, Apr 12 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

సత్యం రామలింగరాజు రాయని డైరీ

సత్యం రామలింగరాజు రాయని డైరీ

 మానస సరోవరంలో దోమలు ఉంటాయా?! ‘‘ఇక్కడవి మామూలే’’ అని, అతి మామూలుగా అన్నాడు జైలు వార్డెన్. వెనకా ముందూ అతడు నాకేం గౌరవాలు తగిలించలేదు. ఖైదీలకు కనీస సంబోధనా పూర్వక మానవ మర్యాదలను ఆశించే హక్కు ఉంటుందా? ఆ మర్యాదలను ఇచ్చే అవసరం వార్డెన్‌కు ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటుందా? చట్టంలో ఎలా ఉందో మరి. అయినా గౌరవ మర్యాదలతో ముఖ విలువను, వాటావిలువను పెంచుకోవలసిన కంపెనీలు ఇప్పుడు నా చేతిలో ఏమున్నాయి కనుక. ముందు సీబీఐ ఇచ్చిన ఈ స్పైరల్ బౌండు కేసు పూర్వాపరాల కాపీలో ఏముందో చూడాలి. దీన్ని చదివి, అర్థం చేసుకునేందుకు ఏడేళ్ల కాలం సరిపోతుందా! ఇంటి నుంచి తెచ్చుకున్న పుస్తకాలు... వాటినెప్పుడు చదవాలి?
 నేనున్నది మానస సరోవర్ బ్లాకు. దోమలు ఉత్సాహంగా గుయ్యిమంటున్నాయి. కొత్త ఖైదీని దొరికాను కదా! మస్కిటో కాయిల్ తెప్పించి వెలిగించుకున్నాను. దోమలకు ముందుగా నేను అలవాటు పడతానా లేక మస్కిటో కాయిల్స్ అలవాటవుతాయా అన్నది త్వరలోనే తేలిపోవచ్చు. ఇది కోర్టులు నిర్ణయించే విషయం కాదు కాబట్టి.

 ఒకరోజు గడిచింది. చంచల్‌గూడా జైలుకు, చర్లపల్లి జైలుకు నాకేం పెద్ద తేడా కనిపించడం లేదు. అక్కడి స్పెషల్ కేటగిరీ, ఇక్కడి సాధారణ ఖైదీగిరీ రెండూ ఒకేలా ఉన్నాయి. జీవితంలోని ఎత్తుల్నీ, పల్లాల్నీ చూసినవాడికి బిర్యానీ అయితే ఏమిటి? మిర్యాల చారు అయితే ఏమిటి? నా డ్రెస్ నేను వేసుకుంటే ఏమిటి? జైలువాళ్లిచ్చే తెల్ల చొక్కా పైజమా అయితే ఏమిటి?
 ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి కిచిడి. మధ్యాహ్న భోజనంలోకి చపాతీ, అన్నం, పప్పు, రసం, అప్పడం. రాత్రి డిన్నర్‌లోకి మళ్లీ ఇదే వరుస. కానీ ఇక్కడ లంచ్ లంచ్‌టైమ్‌లో, డిన్నర్ డిన్నర్‌టైమ్‌లో లేదు. పావు తక్కువ తొమ్మిదికి బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక.. పదిన్నరకి లంచ్. సాయంత్రం నాలుగింటికి డిన్నర్! సత్యం రోజులు గుర్తొస్తున్నాయి. ఉదయం ఇంత తిని, మధ్యాహ్నం తిన్నాననిపించి, సాయంత్రం తినీతినకుండా, రాత్రి తింటే తిని... ఎంత అక్రమబద్ధంగా గడిచాయి! పేరు కోసం పరుగు. పేరు నిలుపుకోవడం కోసం పరుగు. పరువు గురించి పట్టించుకోనంత పరుగు. చివరికి ఇక్కడి వరకు తెచ్చిన పరుగు.

 ఈ మనసు, శరీరం అన్నిటికీ అలవాటు పడ్డాయి. టీవీకి తప్ప!  జైలుకు వచ్చీరాగానే జైలు అధికారులను అభ్యర్థించాను నన్ను టీవీలేని బ్యారక్‌లోకి మార్చమని. సాధ్యం కాదన్నారు. టీవీ సెట్ లేని బ్యారక్సే జైల్లో లేవట! కానీ దేవుడు దయతలిచాడు. ఓ బ్యారక్‌లో టీవీ పనిచేయడం లేదు. నన్ను అందులోకి మార్చారు. ఇంతకన్నా అదృష్టం ఉంటుందా?!
మాధవ్ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement