మధ్యవర్తిత్వమే నేటి మార్గం | shekar gupta writes on india-america relations | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వమే నేటి మార్గం

Published Sat, Apr 8 2017 2:18 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

మధ్యవర్తిత్వమే నేటి మార్గం - Sakshi

మధ్యవర్తిత్వమే నేటి మార్గం

ప్రపంచవ్యాప్తంగా నేడు ఓటర్లను రంజింప జేసే మాటలు మూడున్నాయి. అలాగే వారికి రోతపుట్టించే మాటలూ మూడున్నాయి.

జాతిహితం
రాజ్యాంగపరంగా సుస్థిరంగా ఉన్న దేశాల మధ్యనే ద్వైపాక్షిక వాదం పనిచేస్తుంది. అందువలన, పాక్‌తో కుదుర్చుకునే భావి ఒప్పందం ఏదైనా గానీ, అది అంతర్జాతీయమైనది అయితే తప్ప, కనీసం పెద్ద ప్రపంచ శక్తుల హామీలు ఉంటే తప్ప మనజాలదు.

ప్రపంచవ్యాప్తంగా నేడు ఓటర్లను రంజింప జేసే మాటలు మూడున్నాయి. అలాగే వారికి రోతపుట్టించే మాటలూ మూడున్నాయి. మార్పు, అంతరాయం, నిరంతరాయతను భగ్నం చేయడం, రాజకీయ, భావజాల విశ్వాస విధ్వంసన వారు మెచ్చేవి. కాగా, యథాతథ స్థితి, పాత వ్యవస్థలు, రాజకీయ సముచితత్వం అంటేనే వారు ఏవగించుకు నేవి. డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యున్నతిని సాధించడం దీని తాజా వ్యక్తీకరణే. నరేంద్ర మోదీని సుస్పష్టమైన ఆధిక్యతతో అధికారంలోకి తెచ్చినది, ఆయన జనాదరణను ఇంకా కాపాడుతున్నది సరిగ్గా ఇదే. మీరు జాగ్రత్తగా, సునిశితంగా పరిశీలిస్తే రాజకీయాలలో మోదీ అనుస రించిన వైఖరి స్పష్టమౌతుంది. ‘‘ఢిల్లీ అధికార వర్గాల’’ను, వారి ఆలోచనను, కుహనా మర్యాదను ఆయన తన దాడికి లక్ష్యంగా ఎంచుకున్నారని గమనిస్తారు. అమెరికా ఆధికార వర్గానికి వ్యతిరేకంగా ట్రంప్‌ దాదాపు అలాంటి దాడి చేయడానికి ముందే మోదీ ఆ పని చేశారు.

ట్రంప్‌ భయపెట్టినవాటిలో లేదా అదేనండి, వాగ్దానం చేసిన వాటిలో యూరప్‌ పట్ల అమెరికా దృక్పథంలో మార్పు సైతం ఒకటి. అమెరికా ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి యూరప్‌ మూల స్తంభం, అత్యంత ముఖ్య వ్యూహాత్మక, ఆర్థిక, తాత్విక మిత్రశక్తి అనే విషయంలో ఇంతవరకు రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు మధ్య దాదాపు ఏకాభిప్రాయం ఉండేది. నాటో కూటమి కోసం అమెరికా భారీ వ్యయానికి కట్టుబడ డాన్ని అలాగే సమర్థించేవారు. కానీ ట్రంప్‌ తన పద్ధతికి, వాగ్దానానికి అనుగుణంగానే వ్యవహరించారు. ఆయన అ«ధ్యక్షుడయ్యాక తొలిసారి అమెరికా వచ్చిన ఏంజెలా మర్కెల్‌ను... నాటో రక్షణ వ్యయాలలో జర్మనీ వాటా వందల కోట్ల డాలర్లను చెల్లించాలని కోరారు. ఒక అమె రికా అధ్యక్షుడు తన యూరోపియన్‌ మిత్రుల నుంచి రక్షణ సొమ్మును చెల్లించమని కోరడం, అదీ జర్మనీని కోరడం ఊహించరానిది. కానీ నేడది నిజం. గౌరవనీయులైన వాషింగ్టన్‌ మేధో నిధులను, సంప్రదిం పుల బృందాలను, చివరకు రిపబ్లిక్‌ పార్టీ అధికార వ్యవస్థ చెప్పే వాటిని సైతం ట్రంప్‌ విస్మరించారు. వారందరినీ పాత, అధికార వ్యవస్థగా తోసి పారేశారు.

మన దేశీయ, విదేశాంగ విధానాల్లో సైతం మనం ఈ మార్పును చూశాం. పాత, విదేశాంగశాఖ జాగ్రత్త వైఖరిని తోసిపుచ్చి ఆమెరికాతో సంబంధాలలో ముందడుగు వేశారు. అలాగే మోదీ చైనా విషయంలో దృఢంగా నిలవడానికి బదులు దానికి ఎరవేసే విధానాన్ని చేపట్టారు.  ఆయన పాతను కూలదోయడం మాత్రమే కాదు, తన సొంత అధికార వ్యవస్థను, తన భావజాల జనాకర్షణ శక్తిని చురుగ్గా నిర్మించడం కూడా చేస్తున్నారు. అందువల్లనే మరో ముఖ్య రంగంలో సైతం మార్పు వస్తుం దని మనం ఆశించవచ్చు. ఐరాసలో ట్రంప్‌ రాయబారి నిక్కీ హేలీ భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలపై ఆందోళన వెలిబుచ్చుతూ అత్యంత భయానకమైన ‘మధ్యవర్తిత్వం’ అనే పదాన్ని ప్రయోగించారు. భారత వ్యాఖ్యాతలు, విదేశాంగ శాఖ తక్షణమే ఆగ్రహించారు. భారత్‌–పాక్‌ సమస్యలన్నీ ద్వైపాక్షికంగానే పరిష్కారం కావాలి, ‘మూడో వారు’ ఎవరూ జోక్యంచేసుకోడానికి ఏమీ లేదనే అవే పాత మాటలను తిరిగి వల్లించారు. సిమ్లా ఒప్పందం నాటి నుంచి పదే పదే వల్లె వేస్తున్న అదే కీలక విదేశాంగ విధానాన్ని, వ్యూహాత్మక ప్రశ్నను మరోసారి తిరిగి చెప్పడం దేనికి? ఢిల్లీ అధికార వర్గపు వ్యాఖ్యాతలు, మోదీ ప్రభుత్వం అత్యంత కీలకమైన సమస్యపై ఏకీభవిస్తున్నట్టు అనిపించడం కాదు, ఏకీభవించడం మీకు ఆశ్చర్యం కలిగించడం లేదా? మీరు ఓటు చేసినది దీన్నంతటినీ మార్చడానికి, యథాతథస్థితిని భగ్నం చేయడానికి, అధి కార వ్యవస్థ ఆలోచనను భగ్నం చేయడానికి కాదా?

2017లో మన దేశం ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మక స్థానంలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే పాక్, కశ్మీర్‌ సమస్యలపై మన వైఖరులలో మౌలికమైన మార్పులు రావడం సమంజసం కాదా? పాక్‌తో ద్వైపాక్షిక పరిష్కారానికి కాలం చెల్లిపోలేదా? ‘మూడోవారు’ అనే ఆలోచనపట్ల భారత్‌ ఎందుకు అయిష్టం చూపుతోంది? మోదీ అధికారం అత్యున్నత దశలో ఉన్నప్పుడే ఆయన  ఘనీభవించి పోయిన ఈ భావనను సమీక్షించాలి. కొనసాగుతున్నాయి, భారత్‌–పాక్‌ మధ్య సమీకరణం విప్లవాత్మకంగా మారిపోయింది. అప్పట్లో పాక్‌ భారత్‌ కంటే సంపన్నవంతమైన దేశం (తలసరి ఆదాయం రూపేణా). ఆ సమీకరణం నేడు తలకిందులైంది. ఇంకా మార్పు చెందుతూనే ఉంది. మన జనాభా వృద్ధి వేగం పాక్‌ దానిలో సగం మాత్రమే. దీన్ని లెక్కలోకి తీసుకుని మన అధిక ఆర్థిక వృద్ధి రేట్ల నికర ప్రభావం ఆదాయాల ప్రభావాన్ని బట్టి చూస్తే భారత్‌కు అనుకూలంగా రెండు దేశాల మధ్య ఆర్థిక అంతరం ఏడాదికి 5 పాయింట్ల చొప్పున పెరుగుతోంది.

భారత్‌ ఉన్నత మధ్యస్త స్థాయి ప్రపంచ శక్తి హోదాకు ఎదిగింది. ఇప్పటికే గొప్ప ఆర్థికశక్తిగా ఉన్న దేశం వృద్ధి చెందుతోంది. దేశ సైనిక పాటవం బలవత్తరమౌతున్నది, రాజకీయ సుస్థిరత నెలకొంది. దేశానికి పాత అభద్రతలను విడనాడి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలి, 2014 అనంతర కాలపు నూతన కశ్మీర్, పాక్‌ వైఖరిని రూపొందించాలి. రెండు సర్వసత్తాక సార్వభౌమత్వ దేశాలు సమానవైనవి కావ నడం రాజకీయంగా సరైనది కాదు. కానీ నేను ఆ మాటే అంటాను. మనం కోరు కుంటున్నది అలా కావాలనే కాదా? నేడు భారత్, పాక్‌లు ఏ కొలబద్ధతో చూసినా సమాన మైనవి కావు. రాజ్యాంగపరంగా సుస్థిరంగా ఉన్న దేశాల మధ్యనే ద్వైపా క్షికవాదం పనిచేస్తుంది.

తరచుగా కొత్త పాలకులు తమకు ముందటి వారిని హత్యగావించి, జైల్లోవేసి లేదా ప్రవాసానికి పంపి అధికారంలోకి వస్తూ, తమకు అనువైన కొత్త రాజ్యాంగాలను అమల్లోకి తెస్తుంటే... అంతర్జాతీయ ఒప్పందాలకు వారు కట్టుబడి ఉంటారని వారిని నమ్మే దెలా? సిమ్లా, లాహోర్, ఇస్లామాబాద్‌ ప్రకటనలన్నిటినీ పాక్‌ తిర స్కరించినది అందువల్లనే. మన సమస్యల పరిష్కారంలో ద్వైపాక్షిక వాదం విఫలమైంది. పాక్‌తో కుదుర్చుకునే భావి ఒప్పందం ఏదైనా గానీ అది అంతర్జాతీయమైనది అయితే తప్ప, కనీసం పెద్ద ప్రపంచ శక్తుల హామీలు ఉంటే తప్ప మనజాలదని నా ప్రతిపాదన. కాబట్టి వెళ్లండి, బలమైన స్థానంలో నిలచి మూడో వారి సహాయాన్ని కోరండి. ప్రచ్ఛన్న యుద్ధకాలపు శిథిలాల నుంచి బయటకు రండి. మోదీ భారతదేశంలో అది ఆలోచించదగిన చర్చనీయాంశం.


twitter@shekargupta
శేఖర్‌ గుప్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement