‘పాలేరు’లో తిరుగులేని ‘పాచిక’ | TDP supports to congress in Paleru by elections | Sakshi
Sakshi News home page

‘పాలేరు’లో తిరుగులేని ‘పాచిక’

Published Wed, Apr 27 2016 2:37 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

‘పాలేరు’లో తిరుగులేని ‘పాచిక’ - Sakshi

‘పాలేరు’లో తిరుగులేని ‘పాచిక’

తెలంగాణలో కొడిగడుతున్న దీపం తెలుగుదేశం, తన అభ్యర్థిని పోటీ పెట్టకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. బహుశా తెలంగాణ  టీడీపీ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సలహాలు ఇంకా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో ఆయన (కిరణ్) చెప్పినట్టే నడుచుకున్నారు కదా! కానీ కాంగ్రెస్, టీడీపీ స్నేహం ప్రజలకు పెద్దగా రుచించదు.
 
 ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ ఉప ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని ఇంతకు ముందే కాంగ్రెస్ పార్టీ నుంచి విన్నపం వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి, ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ్యుడు  రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం తెలంగాణ  శాసనసభ రివాజుగా నివాళులు అర్పించింది.ఆ సందర్భంలో అదే జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ శాసన సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్, పాలేరు స్థానానికి కాంగ్రెస్ ఎంపిక చేసే వెంకటరెడ్డి కుటుంబ సభ్యులెవరినైనా ఏకగ్రీవంగా గెలిపించాలని అన్ని పార్టీ లకూ విజ్ఞప్తి చేశారు.
 
 కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా గెలిపించాలన్న ప్రతిపాదనే ప్రజాస్వామ్యంలో  ఆరోగ్యకరమైనది కాదు. దివంగత నేత కుటుంబంలో అర్హతలు కలిగిన వారుంటే స్వయంకృషితో రాజకీయాల్లో నిల దొక్కుకోవాలి. అలా జరగాలే తప్ప ఏకగ్రీవాల వల్ల ఎక్కువకాలం ఎవరూ మనలేరు.  అయినా గతంలో కొన్ని సందర్భాలలో ఇటువంటి సంప్రదా యాన్ని పాటించారు కాబట్టి అజయ్ అట్లా అభ్యర్థించడంలో తప్పులేదు. ఆయన కూడా కొత్తగా శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
 
 రాజకీయాలకు సంబంధించి నిన్న మొన్నటి వరకు అజయ్ తండ్రి చాటు బిడ్డే. ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కమ్యూనిస్ట్ నాయకుడు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనది. మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలోనే కూడా. తండ్రి అడుగుజాడల్లో కమ్యూనిస్ట్ పార్టీలో కాకుండా, కాంగ్రెస్‌లో చేరి శాసనసభ్యుడయ్యారు అజయ్. కొద్దిరోజులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అజయ్ తండ్రి ప్రస్తావన ఎందుకంటే ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో ఒకప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం చాలా ఎక్కువ. ఆ వైభవం రానురాను తగ్గి  ఇప్పుడు తెలంగాణ  శాసనసభలో ఆ పార్టీలు రెండు స్థానాలకు పరి మితం కావలసి వచ్చింది. 2014 ఎన్నికలలో ఖమ్మం నుంచి సీపీఎం సభ్యుడు, నల్లగొండ నుంచి సీపీఐ సభ్యుడు గెలిచారు.

అంతకు ముందు ఒక సారి కాంగ్రెస్‌తో, ఇంకొకసారి తెలుగుదేశంతో పొత్తుల కారణంగా, తమ రెండు పార్టీలకూ ఉన్న బలం కారణంగా, ఎలా అయితేనేమి కమ్యూనిస్టులు కొన్ని స్థానాలు గెలుస్త్తూ ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.  ఎన్నికల రాజకీ యాల్లో కమ్యూనిస్ట్‌ల పరిస్థితి దేశమంతటా ఎట్లా ఉందో ఖమ్మం జిల్లాలో కూడా అట్లాగే తయారయింది. ఇవన్నీ ఆలోచించే అజయ్‌కుమార్ తండ్రి బాట వీడి కాంగ్రెస్ దారిన నడిచి ఉంటారు. తాను శాసనసభ్యుడిగా గెలి చారు, ఈ మధ్యనే జరిగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పది డివిజన్‌లలో కాంగ్రెస్ గెలవడానికి కృషి చేశారు. కాంగ్రెస్‌లో ఉంటే మంచి భవిష్యత్ ఉంది. మరి పాలేరు ఎన్నికను ఏకగ్రీవం చేసి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపిద్దామన్న పువ్వాడ అజయ్, సరిగ్గా ఆ ఎన్నికల ముంగిట్లో పార్టీ ఫిరా యించి తెరాసలో ఎందుకు చేరారు? కాంగ్రెస్ భవిష్యత్తు మీద నమ్మకం లేక తన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలని అనుకున్నా రేమో!
 
 గులాబీ రంగుకు దూరంగా
 ఖమ్మం జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు జిల్లా కాబట్టి తెలంగాణ  వాదం ఎంత బలంగా ఉన్నదో, వ్యతిరేక వర్గం కూడా అంత బలంగానూ ఉండేది. నిజానికి మొదట తెలంగాణ  ఉద్యమానికి నాంది, అంటే 1969 ఉద్యమానికి, ఖమ్మం జిల్లాలోనే. అప్పటి రాష్ట్ర హోం మంత్రి  జలగం వెంగళరావు ఖమ్మం పర్యటనలో ఉండగా ఆయన కారు మీద బాంబు దాడికి విఫలయత్నం జరిగిన విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఆ తరువాత దశ తెలంగాణ  ఉద్యమానికి  ఖమ్మం జిల్లాలో ఊతం ఇచ్చిన నాయకులు చాలామందే ఉండేవారు, ముఖ్యంగా ఉద్యోగవర్గాల్లో. 2001లో చంద్రశేఖరరావు తెలంగాణ  రాష్ర్ట సమితిని స్థాపించి ప్రత్యేక రాష్ర్ట ఉద్యమాన్ని ముందుకు ఉరికించినప్పుడు ఖమ్మం జిల్లా ఆ మార్గంలో వెనకబడి, పదో స్థానంలో ఉండేది. మలిదశ ఉద్యమ కాలంలో రెండు సార్వత్రిక ఎన్నికలొచ్చినా తెలంగాణ  రాష్ర్ట సమితికి అభ్యర్థులు కూడా లభించని పరిస్థితి. ఉద్యమం ఉధృతంగా ఉన్న ఉత్తర తెలంగాణ  జిల్లాలు - కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్; మెదక్ జిల్లా కొంత భాగం మాత్రమే గట్టిగా టీఆర్‌ఎస్ వెంట నడిచాయి. జంట నగరాలు సరే సరి.
 
 దక్షిణ తెలంగాణలో కూడా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉన్నా ఉద్యమ నిర్మాణం ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ. అయితే రాష్ర్టం ఏర్పడే నాటికి పరిస్థితి మారి దక్షిణ తెలంగాణ  కూడా టీఆర్‌ఎస్ వశం కావడం చూశాం. ఖమ్మం మాత్రం అలాగే ఉండిపోయింది. ఉద్యమకాలంలో ఎలా ఉందో,  2014 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. శాసనసభ స్థానాలు పది, ఒక పార్లమెంట్ స్థానం జిల్లాలో ఉంటే టీఆర్‌ఎస్ ఒక్క చోట కూడా గెలవని పరిస్థితి. నాలుగుచోట్ల కాంగ్రెస్, మూడుచోట్ల వైఎస్‌ఆర్‌సీపీ, ఒక్కో స్థానంలో టీడీపీ, సీపీఎం, స్వతంత్రులు గెలిచారు. రాష్ర్ట సాధన తరువాత ముఖ్య మంత్రి స్వయంగా చెప్పినట్టు ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ  పార్టీగా రూపాంతరం చెందింది కాబట్టి ఖమ్మం జిల్లాను అలా వదిలేయడానికి వీల్లేదు. మరేం చేయాలి? 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ అలా వదిలేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుంది. జిల్లాలో ఒక్క ప్రజా ప్రతినిధి కూడా లేకుండా వచ్చే ఎన్నికల నాటికి లేదా ఈ మధ్యలో వచ్చే ఏ ఎన్నికకయినా పార్టీని నడిపించడం ఎలా? ముఖ్యమంత్రికి ఆ జిల్లాతో మరో అనుభవం కూడా ఉంది. 2009లో ఆయన కరీంనగర్ నుంచి బయలుదేరి మెదక్ జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేయబూనినప్పుడు దానిని భగ్నం చేసి ఖమ్మం జిల్లాలోనే నిర్బంధించారు.
 
 అది ఆయనకు చేదు అనుభవం కూడా. ఈ కారణాలన్నింటివల్లా ఖమ్మం జిల్లాలో ఫిరాయింపులకు తెరలేపారు. తొలి నాళ్లలోనే ఒక స్వతంత్ర శాసనసభ్యుడు, ఇద్దరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ సభ్యులు అధికార పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు అజయ్ కూడా చేరడంతో జిల్లాలో అధికార పార్టీ బలం నాలుగుకు పెరిగింది. పాలేరుకు ఎన్నిక రావడంతో జిల్లాలో కాంగ్రెస్ బలం రెండుకు పడిపోయింది. అందులో ఒకరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహకాధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క.
 
 ఇక పాలేరు ఉప ఎన్నిక దగ్గరికే వద్దాం. టీఆర్‌ఎస్ బరిలోకి దింపిన రాష్ర్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ జిల్లా పాత కాపు. చాలాకాలం తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు సన్నిహిత మిత్రుడు. ప్రస్తుతం తుమ్మల శాసనమండలి సభ్యుడిగా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయనను పాలేరు బరిలో దింపడం ద్వారా ఖమ్మం జిల్లాలో రాజకీయ శక్తిగా బలోపేతం కావడం ముఖ్యమంత్రి ఆలోచన. పార్టీ ప్లీనరీ ఖమ్మంలో నిర్వహించాలన్న నిర్ణయం కూడా అందులో భాగంగానే చూడాలి.
 
 చేతికొచ్చిన సైకిలు
 ఇక కాంగ్రెస్‌లో ఉండగా పువ్వాడ అజయ్ చేసిన పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అంశానికి వస్తే, అన్నీ సరిగ్గా ఉంటే ఏకగ్రీవాలు ఫర్వాలేదేమో కానీ, ఖమ్మం వంటి జిల్లాలో టీఆర్‌ఎస్ ఎందుకు ఒక స్థానాన్ని వదులు కుంటుంది? అయినా ఇంకా దుఃఖభారం నుండి కోలుకోని  దివంగత నాయకుడి సతీమణిని బరిలోకి దింపి, వారి చేతనే ఏకగ్రీవం కోసం ఇతర పార్టీలను అభ్యర్ధింప చేయడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇక తెలంగాణలో కొడిగడుతున్న దీపం తెలుగుదేశం, తన అభ్యర్థిని పోటీ పెట్టకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది.
 
 బహుశా తెలంగాణ  టీడీపీ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సలహాలు ఇంకా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాసనసభలో ఆయన(కిరణ్) చెప్పినట్టే నడుచుకున్నారు కదా! కానీ కాంగ్రెస్, టీడీపీ స్నేహం ప్రజలకు పెద్దగా రుచించదు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా పుట్టిన తెలుగుదేశం, చివరికి కాంగ్రెస్‌తో జతకట్టడం ఆ పార్టీ పరిస్థితిని స్పష్టం చేస్తున్నది. ఏకగ్రీవం కోసం ప్రయత్నించకుండా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని తానే తిరిగి పొందాలన్న ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్లి ఉంటే చతుర్ముఖ పోటీలో గెలుపు అవకాశాలు ఉండేవి. తెలుగుదేశం తన అభ్యర్ధిని దింపి ఉంటే శ్రేణులు, అభిమానులు (ఇంకా మిగిలి ఉంటే) అటు పని చేసేవారు, కమ్యూనిస్టుల ఓట్లు సీపీఎం అభ్యర్ధి తీసుకునేవారు. అందరి మద్దతుతో బయటపడాలన్న దుగ్ధ వల్ల కాంగ్రెస్ పాలేరులో అసలుకే మోసం తెచ్చుకున్నట్టున్నది.
 
తెలంగాణ  రాష్ర్టం ఏర్పడిన తరువాత ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక మినహాయిస్తే అధికార పార్టీ ఓడిందెక్కడా లేదు. పాలేరు అదే బాట పట్టే సూచనలున్నాయి. మొత్తానికి  పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు గెలిస్తే దొడ్డిదారిన మంత్రి అయ్యారన్న విమర్శ నుంచి బయటపడతారు. ఖమ్మం జిల్లాలో పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన నాయకుడు ఒకరయినా ఉన్నారని చెప్పుకునే వీలు అధికార పక్షానికి కలుగుతుంది.
 datelinehyderabad@gmail.com
 - దేవులపల్లి అమర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement