
నవ విశాఖ నిర్మాణం.. విధ్వంసానికి సమాధానం
త్రికాలమ్
ఇంతవరకూ తుపానులు విశాఖను ఉపేక్షించాయి కనుక నగర నిర్మాణంలోని పరిమితులు బయటపడలేదు. ఇప్పుడు విశాఖనే ప్రధానంగా హుద్‌హుద్ తుపాను దెబ్బతీసిన ఫలితంగా అభివృద్ధి పేరు మీద ఎటువంటి ధ్వంసరచన సాగిందో అర్థం చేసుకోవడం అవసరం. ప్రతి విపత్తులోనూ ఒక అవకాశం ఉంటుంది. పూర్తిగా దెబ్బతిన్న నగరాన్ని పునర్నిర్మించుకునే సందర్భంలో పౌరులను భాగస్వాములను చేయాలి. తుపాను తాకిడిని తట్టుకొనే విధంగా ప్రతి నిర్మాణం సాగాలి.
రాజమండ్రి నుంచి విశాఖకు శుక్రవారంనాడు కారులో ప్రయాణం చేస్తుంటే గుండె బరువెక్కింది. నాది ఆ ప్రాంతం కాకపోయినా హైదరాబాద్ తర్వాత విశాఖ పట్టణమే అద్భుతమైన నగరమని నా అభిప్రాయం. ప్రొఫెసర్ ప్రసన్నకుమార్‌బోటి వ్యక్తులకు ప్రపంచం లోనే విశాఖను మించిన నగరం లేదు. అన్ని ప్రాంతాల వారినీ, మతాలవారినీ ప్రేమించే, కలుపుకొని వెళ్లే, ప్రశాంతంగా జీవించే విశిష్ట సంస్కృతి విశాఖ పౌరు లది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించవలసిన ఏ కార్యక్రమం చేపట్టినా హైదరాబాద్ అనంతరం నా రెండో అడుగు ఇక్కడే. అనేక సందర్భాలలో విశాఖలో సదస్సులు నిర్వహించి అక్కడి ప్రజలతో మమేకమైనందుకేమో గాయ పడిన నగరాన్ని చూసినప్పుడు గుండె లయతప్పింది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుందని అందరూ ఎదురు చూస్తున్న దశలో నగరాన్ని తుపాను బీభత్సం అతలాకుతలం చేసింది.
అదొక యుద్ధానంతర దృశ్యం
హుద్‌హుద్ విలయం తర్వాత విశాఖపట్టణం మొదటిసారి వెళ్లిన నాకు రోడ్డుకు ఇరువైపులా వొంగిపోయిన చెట్లూ, ఆకురాలిన చెట్లూ మౌనంగా, దీనంగా రోదిస్తున్నట్టు కనిపించాయి. విశాఖను సమీపించేకొద్దీ విలయం సృష్టించిన విధ్వంసం తీవ్రత ఎంతటిదో ఎవ్వరూ చెప్పకుండానే తెలిసిపోతోంది. నగర ప్రవేశం చేస్తుండగానే కప్పు లేచిపోయిన కొత్త విమానాశ్రయం వెక్కిరించింది. రోడ్డుకు రెండు వైపులా పచ్చగా కనిపించే చెట్లు అదృశ్యమైనాయి.
జగదాంబ నుంచి రామ్‌నగర్ వరకూ ఒక్క చెట్టుకూడా లేదు. బ్రిటిష్ హయాంలోనే మొక్కలు నాటడానికి విశేష ప్రాధాన్యం ఇచ్చిన ఇక్కడి ప్రజలు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్క నాటడం అలవాటు చేసుకున్నారు. కానీ అభివృద్ధి పేరుతో ఆత్మహత్యాసదృశమైన, విధ్వంసాత్మకమైన విధానాలు అనుసరించాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. చెట్లు కొట్టివేసినందుకూ, కాలుష్య కారక కర్మాగారాలను విస్తరించినందుకూ, ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ పెక్కంతస్తుల భవనాలు కట్టినందుకు భారీ మూల్యమే చెల్లించాం. అందమైన వనంలాంటి విశాఖనగరం కళావిహీనంగా బేలగా కనిపించింది.
పచ్చదనం మీద దాడి
కోస్తాంధ్ర ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వారికి తుపాను కొత్తకాదు. ప్రతి సంవత్సరం ఒక దెబ్బకొట్టి పోయే తుపాను ఈసారి కూడా భారీ వర్షాలు కురిపించి గ్రామీణ ప్రాంతాలపై ప్రతాపం చూపించి వెళ్లిపోతుందని అనుకున్నాం. కానీ సరాసరి నగరంపైనే అనూహ్యంగా విరుచుకుపడింది. వాతావరణ శాస్త్రజ్ఞుల సమాచారం ప్రకారం ఇటీవలి దశాబ్దాలలో ఇంత వరకూ వచ్చిన 75 తుపానులలో ఇది ఒక్కటే నగరాన్ని నేరుగా తాకి నవనాడులనూ కుంగదీసింది. లక్షలాది చెట్లను పొట్టను పెట్టుకున్నది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఫలితంగా వారంరోజుల ముందే హెచ్చరికలు అంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన కారణంగా ప్రాణనష్టం విపరీతంగా జరగలేదు కానీ ప్రాణవాయువు నష్టం తీవ్రంగా జరిగింది.
ముఖ్యమంత్రి ఉన్నంత వరకే సేవ
ఇటువంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వాలు ఎంత హడావుడి చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రజలు నడుం బిగించి రంగంలో దిగినప్పుడే సహాయ పునరావాస కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతాయి. వ్యక్తిగతంగా ఎంత కష్టం వచ్చినా ప్రజలు సమష్టిగా ప్రకృతి విలయాన్ని ఎదుర్కొన్నందుకు, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పునర్నిర్మాణంలో పాలు పంచుకున్నందుకూ వారిని అభినం దించాలి. వచ్చిన విపత్తు సాధారణమైనది కాదు. నష్ట సామాన్యమైనది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ కార్యాలయంలో మకాం ఉన్న అయిదు రోజులూ విద్యుత్ సరఫరా లేదు. మొబైల్ ఫోన్లు పనిచేయలేదు. ముఖ్యమంత్రి శక్తి వంచన లేకుండా కష్టపడి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయను అటు వెళ్లగానే ఇటు అధికారులు విశ్రాంతి తీసుకున్నారు.
తుపాను రాకడ గురించి వారం రోజుల ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ నిత్యావసర వస్తువులనూ, కొవ్వొత్తులనూ, పాలప్యాకెట్లనూ ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకోవాలన్న సూచన చేసి ఉంటే ప్రజల కష్టాలు కొంచెం తగ్గేవి. పొరుగున ఒడిశా సర్కార్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకు న్నది. ఉన్నతాధికారులకు పనులు పురమాయించి ప్రాథమిక సదుపాయాలను పునరుద్ధరించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు కానీ మంత్రులు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడారు. విశాఖ సమీపంలోని నియోజక వర్గం నుంచి ఎన్నికైన మంత్రికి కష్టాలలో ఉన్న ప్రజలను పలకరించే తీరిక కూడా లేకపోయింది. నిత్యావసర వస్తువులు లేకపోయినా, ఇతర వసతులు కరువైనా ప్రతి ఇంట్లో పుష్కలంగా బియ్యం మాత్రం ఉన్నాయి.
ఇదీ సమాధానం
విధ్వంసానికి సమాధానం నిర్మాణం ఒక్కటే. పునర్నిర్మాణం సమగ్రమైన ప్రణాళిక ప్రకారం జరగాలి. అన్నిటికంటే ముఖ్యంగా మొక్కలు విరివిగా నాటి వాటిని శ్రద్ధగా పెంచాలి. స్మార్ట్ సిటీ నెక్ట్స్, గ్రీన్ సిటీ ఫస్ట్ అంటూ ప్లకార్డులు పట్టుకొని హరిత ఉద్యమకారులు ప్రదర్శన చేస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి విశాఖలో స్థిరపడిన ఒక ఉపాధ్యాయుడు ఆపాదమస్తకం ఆకుపచ్చరంగు దుస్తులు ధరించి పర్యావర ణాన్ని పరిరక్షించాలనీ, మొక్కలు పెంచాలనీ ప్రచారం చేస్తూ కనిపించారు.
నవ విశాఖ-చర్చావేదిక పేరుతో సాక్షి మీడియా గ్రూపు విశాఖలో నిర్వహించిన సెమి నార్‌లో వక్తలు ఇంతవరకూ చేసిన తప్పులు ఎత్తి చూపించి ఇక మీదట జాగ్రత్తగా పునర్నిర్మాణ కార్యక్రమాలు ఎట్లా అమలు జరపాలో చెప్పారు. 270 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పటికీ తట్టుకొని నిలబడే కట్టడాలను పోర్ట్ ట్రస్టు నిర్మించ బోతున్నదని ఆ సంస్థ అధిపతి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లను కూడా భూగర్భంలో డక్ట్ ద్వారా వేయాలనీ, మొబైల్ టవర్స్ కూడా అందు బాటులోకి రావాలనీ ఆయన చెప్పారు.
మానవ తప్పిదంతోనే విలయం
పట్టణీకరణ దుష్ఫలితాలన్నీ విశాఖపైన ప్రభావం వేశాయి. అభివృద్ధి పేరుతో బీచ్ రోడ్డులో చెట్లను నరికాం. సముద్రతీరంలో అక్రమ కట్టడాలు నిర్మించాం. ఉష్ణోగ్రతను క్రమంగా పెంచుకుంటూ పోయాం. బీచ్ రోడ్డులో వాహనాల రద్దీ ఎక్కువైన కొద్దీ తీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అది ఉప్పెనలకూ, తుపానులకూ స్వాగతం పలుకుతుంది. చెట్లు నరికే సంస్కృతికి తక్షణం స్వస్తి చెప్పాలి. పర్యావరణ ఉద్యమ నాయకురాలు రాణిశర్మ చెప్పినట్టు హుద్‌హుద్ ప్రభంజనం తట్టుకొని ఏ రకం చెట్లు నిలబడి నిలిచాయో గమనించి ఆ రకం మొక్కలు మాత్రమే నాటాలి.
తాటి, ఈత, సరుగుడు, గానుగ చె ట్లు పెంచాలి. దీర్ఘకాలంగా నిలబడే మర్రి, వేప, రావి చెట్లు పెంచడంపైన దృష్టి పెట్టాలి. కాలుష్యం వెదజల్లే కర్మాగారాలను క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. సౌర విద్యుదుత్పాదనకు విశేష ప్రాధాన్యం ఇవ్వాలి. నగర జనాభా పెరగకుండా వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. సముద్ర తీరంలో నిర్మించిన అన్ని భవనాలకు తెలుపురంగు వేయాలి. ఫోరమ్ ఫర్ బెటర్ విశాఖ ఇవే హితవులు చాలాకాలంగా చెబుతున్నప్పటికీ పురజనులు కానీ ప్రభు త్వాలు కానీ పట్టించుకోలేదు. చెట్లను కరెంట్ స్తంభాల పక్కన పెంచకూడదు. ఇళ్ల ముందు పెంచకూడదు. చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడు నరుకుతూ అవి సవ్యంగా పెరిగేట్టు చూడాలి. ఢిల్లీ, చండీగఢ్ నగరాలలో మాదిరి రోడ్లకు రెండు వైపులా రక రకాల చెట్లు పెంచాలి.
పౌరులను భాగస్వాములను చేయాలి
ఇంతవరకూ తుపానులు విశాఖను ఉపేక్షించాయి కనుక నగర నిర్మాణంలోని పరిమితులు బయటపడలేదు. ఇప్పుడు విశాఖనే ప్రధానంగా హుద్‌హుద్ తుపాను దెబ్బతీసిన ఫలితంగా అభివృద్ధి పేరుమీద ఎటువంటి ధ్వంసరచన సాగిందో అర్థం చేసుకోవడం అవసరం. ప్రతి విపత్తులోనూ ఒక అవకాశం ఉంటుంది. పూర్తిగా దెబ్బతిన్న నగరాన్ని పునర్నిర్మించుకునే సందర్భంలో నగర అభివృద్ధిలో పౌరులను భాగస్వాములను చేయాలి.
తుపాను తాకిడిని తట్టుకొని నిలిచే విధంగా ప్రతి నిర్మాణం సాగాలి. ప్రకృతి విలయం సంభవించినప్పుడు పౌరులు ఎట్లా స్పందిం చాలో తెలియజెప్పేవిధంగా అవగాహన కార్యక్రమాలు విరివిగా సాగాలి. పాఠశా లల్లో, కళాశాలల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవలసిన చర్యల గురించి, నగరంలో కాలుష్యం పెరగకుండా చూసేందుకు చేపట్టవలసిన పనుల గురించి వివరించే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి. ఈ విషయంపైన అవగాహన పెంచేందుకు చర్చావేదికలను నిర్వహించాలి. అధికారులకు మార్గదర్శనం చేయ డానికి ఒక బ్లూబుక్‌ని రూపొందించాలి.
భూకంపాలనూ, సునామీలనూ తట్టుకొని నిలబడడమే కాకుండా వాటివల్ల కలిగిన విపరీతమైన నష్టాల నుంచి సత్వరం కోలుకోవడానికి జపాన్ వంటి దేశాలలో ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారో, ఏ రకమైన కట్టడాలు నిర్మించారో, చెట్ల పెంపకానికి ఎటువంటి వ్యూహాలు అనుసరించారో గమనించాలి. అవే విధానాలను ఇక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నించాలి. మెట్రోరైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కనుక అది పూర్తయిన తర్వాత వాహన కాలుష్యం కొంత మేరకు తగ్గవచ్చు.
బీచ్ రోడ్డులో పర్యాటకుల కోసం బ్యాటరీ కార్లు వినియోగించడం, సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్స హించడం అవసరం. పోర్టు ట్రస్టు వంటి ప్రభుత్వరంగ సంస్థలు కూడా కాలుష్యం పెంచుతున్నాయి. కాలుష్య నివారణకు తీసుకోవలసిన చర్యలు ఏమిటో నిర్ణయిం చుకోవాలి. పర్యావరణ రక్షణకోసం చేసుకున్న చట్టాలను అన్ని దశల్లోనూ ఉల్లంఘిం చాం. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా పాత ధోరణిలోనే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే రాబోయే తరాలు మనలను క్షమించవు.