సందర్భం
ఎం.వీ.ఎస్.నాగిరెడ్డి
ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు నాయకులంతా రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేయడం ధర్మం. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న చంద్రబాబు ఈ చర్యకు ఉపక్రమిస్తే కొత్త రాష్ట్రంలో రైతాంగానికి మంచి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. రుణమాఫీ ఫైలు మీదే చంద్రబాబు తొలి సంతకం చేస్తే రైతులోకానికి శుభారంభం కూడా.
రైతు రుణ మాఫీ అన్న నినాదం దేశంలో చాలాసార్లు వినిపించి ఉండవచ్చు. కానీ రెండు పర్యాయాలు మాత్రమే కొంత మేర రుణాల రద్దును ప్రకటించిన సంగతిని గమనిం చాలి. దేవీలాల్ ఉప ప్రధానిగా ఉండగా మొదటిసారి రైతు ల, గ్రామీణ చేతివృత్తుల వారి వాయిదా మీరిన ప్రతి రుణా నికి రూ. 10,000 వరకు రద్దు చేశారు. రెండోసారి యూపీ ఏ-1 అధికారంలో ఉండగా 2006 నాటికి రుణం తీసుకుని ఉండి 2008 నాటికి వాయిదా మీరిన సన్న, చిన్నకారు రైతు లకు రుణాలను మాఫీ చేశారు. సన్న, చిన్నకారు రైతులు కాని రైతులకు పై షరతుల మీద వాయిదా మీరి ఉంటే 75 శాతం, ఒకేసారి చెల్లిస్తే 25 శాతం బాకీని రద్దు చేశారు. అప్పు అంటే హడలిపోయే రైతులు మళ్లీ అప్పు చేసి రుణా లను చెల్లించారు. వీరికి ఏమీ లబ్ధి చేకూరలేదు.
ఈ అను భవాన్ని దృష్టిలో ఉంచుకుని రుణాల రద్దు మీద నిర్ణయం తీసుకున్న నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్రమం తప్పకుండా రుణం చెల్లించిన ప్రతిరైతుకు భూమి పరిమి తితో సంబంధం లేకుండా రూ. 5.000 వంతున 36 లక్షల మంది రైతులకు రూ. 1,800 కోట్లు ప్రోత్సాహకంగా ఇచ్చారు. ఇలా రైతుల రుణాలపై రాయితీ అందించిన ఏకైక నాయకునిగా వైఎస్‌ఆర్ చరిత్రకెక్కారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి ‘వ్యవసాయం దండగ’ అన్న అభిప్రాయంతో రైతాంగం డీలా పడి ఉంది. ఆయన హయాంలో సకాలంలో వర్షాలు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, గిట్టు బాటు ధరల లభ్యత, విద్యుత్ బకాయిల రద్దు, రుణాల రద్దుతో వ్యవ సాయంలో పండుగ వాతావరణం నెలకొన్నది. కానీ వైఎస్ మరణం తరువాత మళ్లీ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవలి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రణాళికలు నేపథ్యంలో రైతు రుణ మాఫీ అంశాన్ని పరిశీలిద్దాం. ఇప్పటి వరకు రుణాల రద్దు ప్రకటించిన ఘనత కేంద్రానిదే. అందు కే వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతు రుణాల రద్దుకు ప్రయత్నిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. టీఆర్‌ఎస్ కూడా రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ కూడా రూ.లక్ష వ రకు రుణాల రద్దుకు కృషి చేస్తామని చెప్పారు. చంద్రబాబు కూడా రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
అధికారం చేతికి వచ్చిన తరువాత టీఆర్‌ఎస్ పార్టీ 20 13 జూన్ 1 తరువాత తీసుకున్న రుణాలను మాత్రమే రద్దు చేస్తాం, బంగారం తాకట్టు రుణాలు వ్యవసాయ రు ణాలు కాదు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు వ్యవసాయ రుణాలు కాదు, అని మాట్లాడుతుంటే ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం లోని రైతాంగం ఎన్నికల్లో చెప్పిన మాటలు మార్చి రైతులను మోసం చేస్తారా అంటూ ఉద్యమిస్తున్న సంగతి, కొంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసి నదే. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ చేయాలని తెలుగుదేశం అక్కడ కోరుతోంది.
వ్యవసాయ రుణాలన్నీ రద్దుచేస్తామని టీడీపీ ప్రకటిం చింది. నిజానికి రైతు రుణాలన్నీ వ్యవసాయ రుణాలే. కానీ, వ్యవసాయ రుణాలన్నీ రైతుల రుణాలు కాదు.
రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు వారి రుణ పరిమితిలో 18% వ్యవసాయ రుణాల్లో 13% రైతులకు పంట రుణాలు, పంటేతర రుణాలు ఇవ్వాలి. మిగిలిన 5% వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్, మార్కెటింగ్ లకు అనగా, కోల్డ్ స్టోరేజ్, రైస్ మిల్స్, రిలయన్స్ ఫ్రెష్ లాం టి వాటికి ఇవ్వాలి. ఇవి వ్యవసాయ రుణాలే, కానీ, రైతు రుణాలు కాదు. వీటిని కూడా కలిపి వ్యవసాయ రుణాలన్నీ కలిపి రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (తెలంగాణ కాకుండా) రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ విడుదల చేసిన డేటా ఇలా ఉంది...
పరోక్ష వ్యవసాయ రుణాలు రూ. 9 వేల కోట్ల రద్దును రైతులు వ్యతిరేకించడం లేదు. కానీ, ఎటువంటి షరతులు లేకుండా రూ. 78 వేల కోట్ల మేర రైతు రుణాలను తొలి సంతకం ద్వారా రద్దు చేయాలి. ఇందుకు విరుద్దంగా షర తులు విధించి రైతులను వంచన చేస్తే రైతాంగం మొత్తం చంద్రబాబును నయవంచన ముఖ్యమంత్రిగా భావిస్తుంది.
(వ్యాసకర్త వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షులు)
తక్కువకాల వ్యవసాయ కోట్లలో
ఉత్పత్తి రైతు రుణాలు రూ.54 వేలు
దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ.24 వేలు
మొత్తం రూ.78 వేలు
రైతు రుణాలు కానీ వ్యవసాయ రుణాలు రూ.09 వేలు
మొత్తం రూ.87 వేలు