
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో పార్టీలోకి వలసలను బీజేపీ వేగవంతం చేసింది. టీడీపీ శ్రేణులంతా బీజేపీలో చేరేలా ఆపరేషన్ కమలం చేపడుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలను పారీ్టలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇటీవల టీడీపీ సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, నందీశ్వర్‌గౌడ్ ఇళ్లకు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెళ్లి మరీ ఆహ్వానించారు. మరోవైపు 18న భారీఎత్తున టీడీపీ శ్రేణులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం లోని 18 జిల్లాల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతోపాటు క్షేత్రస్థాయిలోని టీడీపీ శ్రేణులందరినీ బీజేపీలో చేర్చుకునేలా చర్యలు చేపట్టింది. అందుకు ఈనెల 18న ముహూర్తం నిర్ణయించింది. దాదాపు 20 వేల మందిని బీజేపీలో చేర్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. ఇందుకోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో 18న సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభాఏర్పాట్లను శుక్రవారం లక్ష్మణ్‌తోపాటు ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీమంత్రి పెద్దిరెడ్డి, టీడీపీ నేతలు శోభారాణి, దీపక్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దీపక్‌రెడ్డి తదితరులు పరిశీలించారు.
బీజేపీలో చేరనున్న టీడీపీ ముఖ్యులు వీరే..!
ఇప్పటికే ఏడెనిమిది జిల్లాల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర నేతలు టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వారంతా ఆదివారం నిర్వ హించే బహిరంగ సభలో బీజేపీలో చేరనున్నారు. ఎంపీ గరికపాటి మోహన్‌రావు, రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణ, ఎంఎన్ శ్రీనివాస్, లంకల దీపక్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గౌడ్, మిర్యాలగూడ, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జీలు సాదినేని శ్రీనివాస్, బి.శోభారాణి, పాల్వాయి రజనికుమారి, నారాయణ్‌ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, మాజీమంత్రిపి. జగన్నాయక్, పటాన్‌చెరు నుంచి శ్రీకాంత్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బ య్య, కోదాడ నుంచి శ్రీకళారెడ్డి, పీసీసీకి చెందిన ముగ్గురు కార్యదర్శులు అనుచరులతో బీజేపీలో చేరుతారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
త్వరలో మరికొందరు సీనియర్ నేతలు..
టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు సీనియర్ నేతలు త్వరలోనే బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. పార్టీ జాతీయ నేతలతో కొందరు నేతలు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. అందులో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, విజయశాంతి, కె.లక్ష్మారెడ్డి, ప్రసాద్, దేవేందర్‌గౌడ్, వీరేందర్‌గౌడ్, మాజీమంత్రి చంద్రశేఖర్ తదితరులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. వారు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు టీడీపీ ముఖ్య నేతలైన ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డితోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని, 25 వేలమందితో సభ నిర్వహించబోతున్నామని గరికపాటి చెప్పారు.
ఏమంటారో మీఇష్టం: డాక్టర్ లక్ష్మణ్
‘టీడీపీ 18 జిల్లాల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, క్షేత్రస్థాయి కేడర్ అంతా 20 వేల మందికిపైగా బీజేపీలో చేరబోతున్నారు. చేరికలంటారా? విలీనమంటారా? మీ ఇష్టం.’అని లక్ష్మణ్ అన్నారు.