
న్యూఢిల్లీ: లోక్‌సభ రెండో దశ ఎన్నికల్లో భాగంగా నేడు 95 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లోని జరగనుంది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జువల్ ఓరమ్, సదానంద గౌడ, పొన్ రాధాకృష్ణ సహా, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, డీఎంకే నేత దయానిధి మారన్, ఏ రాజా, కనిమొళి తదితరులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
షెడ్యూల్ ప్రకారం తమిళనాడులోని 39 చోట్ల ఓటింగ్ జరగాల్సింది. కానీ, డీఎంకే నేత సంబంధీకుల వద్ద భారీ మొత్తంలో నగదు లభించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వేలూరు నియోజకవర్గంలో పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రద్దుచేసింది. సరైన శాంతిభద్రతలు లేకపోవడంతో త్రిపుర(ఈస్ట్) స్థానానికి పోలింగ్‌ను మూడో దశలో (ఏప్రిల్ 23న) నిర్వహించనున్నారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా ఫుల్బనీ అసెంబ్లీ నియోజకవర్గంలో సిబ్బందితో కలసి పోలింగ్ బూత్‌కు వెళ్తున్న ఎన్నికల అధికారిణిని మావోలు బుధవారం కాల్చి చంపారు.