మాజీ ప్రధానులు వాజ్‌పేయి.. నెహ్రూ (జత చేయబడిన చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ, నెహ్రూ, వాజ్‌పేయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆప్ నేత అశుతోష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఆయా నేతల జీవితాల్లో చీకటి కోణాలు ఉన్నాయని.. వారంతా మహిళలతో సంబంధాలు నెరిపారని అశుతోష్ తన బ్లాగులో ఓ వ్యాసం రాశారు. దీనిపై ఢిల్లీలోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
అసలు విషయం... 2016లో ఆప్ మంత్రి సందీప్ కుమార్ లైంగిక ఆరోపణల వ్యవహారం తెరపైకి వచ్చింది. సందీప్ ఓ మహిళతో అభ్యంతరకర స్థితిలో ఉన్న సీడీ ఒకటి బయటకు పొక్కటంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి ఆప్ బహిష్కరించింది. ఆ సమయంలో అశుతోష్, సందీప్‌కు అండగా నిలిచారు. తన బ్లాగులో ‘శృంగారం ప్రాథమిక అవసరాల్లో ఒకటి. సందీప్ తప్పేముంది’ పేరిట పెద్ద వ్యాసం రాశారు. దేశ చరిత్రలో ఇలాంటి ప్రముఖులెందరు లేరు? నెహ్రూ ఎంతో మందితో సంబంధాలు నడిపారు. నెహ్రూ-లేడీ మౌంట్‌బాటెన్ సంబంధం జగమెరిగిన సత్యం. రవీంద్రుడి దూరపు బంధువు సరళాచౌదరి తన ఆత్మిక సతీమణి అని గాంధీజీ అంగీకరించలేదా?. వాజ్‌పేయి వివాహం చేసుకోకపోయినా స్నేహితురాలితో సహజీవనం చేశారు. ఆ మాటకొస్తే గాందీ, నెహ్రూ, వాజ్‌పేయి, రామ్ మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండేజ్ ఇలా అంతా మహిళలతో సంబంధాలు నడిపించారు. వారిని ఎవరూ నిలదీయలేదే?. వారి రాజకీయ ప్రస్థానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాయి కదా’ అంటూ విమర్శకులను తన బ్లాగ్‌లో ప్రశ్నించారు.
దీనిపై ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అశుతోష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, ఆయన మాత్రం ప్రతిపక్షాలతోపాటు ఆప్ నేతలను కూడా ఏకీపడేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment