
మోదీకి చౌకీదార్‌గా ఉండాలనే ఇష్టం ఉంటే.. నా దగ్గరకు రమ్మనండి.
హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో ప్రచార అస్త్రంగా బీజేపీ ఎత్తుకున్న చౌకీదార్ క్యాంపెయిన్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటుగా విమర్శించారు. భారత దేశం ఓ ప్రధానిని కోరుకుంటుందని, చౌకీదార్లు, పకోడీవాలాలను కాదని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రచార సభలో అక్భరుద్దీన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీపై ధ్వజమెత్తారు. ‘నేను ట్విటర్‌లో చౌకీదార్ నరేంద్రమోదీ అని చూశాను. ఆయన తన ఆధార్, పాస్‌పోర్ట్‌లో కూడా ఆ పేరు పెట్టుకోవాలి. ఆయనకు చౌకీదార్‌గా ఉండాలనే ఇష్టం ఉంటే.. నా దగ్గరకు రమ్మనండి. నేను ఆయనకు చౌకీదార్ క్యాప్, ఓ విజిల్ ఇస్తాను’ అని అక్బరుద్దీన్ ఎద్దేవా చేశారు.
చౌకీదార్ కథ ఇది..
నరేంద్రమోదీ తనను తాను ‘చౌకీదార్’గా దేశానికి కాపలాదారుగా అభివర్ణించుకోగా.. రఫేల్ స్కాంలో మోదీ అవినీతికి పాల్పడ్డారని, ఆయన చౌకీదార్ కాదు.. చోర్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు కౌంటర్‌గా ‘మై భీ చౌకీదార్’ (నేనూ కాపలాదారుడినే) నంటూ మోదీ సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారానికి తెరతీశారు. ఈ ప్రచారంలో భాగంగా మోదీ తన ట్విటర్ ఖాతాలో పేరుకు ముందు చౌకీదార్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. మోదీకి సంఘీభావంగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ ట్విటర్ అకౌంట్ల పేర్లకు ముందు మే భీ చౌకీదార్ ట్యాగ్‌ను చేర్చారు. చౌకీదార్ నినాదంతో బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తుండగా.. ‘మీ పిల్లలను డాక్టర్లను చేస్తారా లేక కాపలాదారులను చేస్తారా’ అని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.