యాదవ్‌ VS యాదవ్‌ | Akhilesh Yadav vs Dinesh Lal Yadav in Azamgarh lok sabha | Sakshi
Sakshi News home page

యాదవ్‌ VS యాదవ్‌

Published Tue, May 7 2019 1:50 AM | Last Updated on Tue, May 7 2019 1:50 AM

Akhilesh Yadav vs Dinesh Lal Yadav in Azamgarh lok sabha  - Sakshi

అఖిలేష్‌ యాదవ్‌ (ఎస్పీ), దినేశ్‌లాల్‌ యాదవ్‌ (బీజేపీ)

ఉత్తర ప్రదేశ్‌ తూర్పు ప్రాంతంలోని లోక్‌సభ నియోజకవర్గాలు పోలింగుకు సిద్ధపడుతుండటంతో బీజేపీ, గట్‌బంధన్‌ (ఎస్పీ, బీఎస్పీ కూటమి)లు తమతమ ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కూడా వ్యూహాలు పన్నుతున్నాయి.

గత ఎన్నికల్లో బీఎస్పీ అధినేత మాయావతి విపక్షాల ఓటు బ్యాంకును కొల్లగొట్టడంతో సఫలీకృతురాలయ్యారు. అదే వ్యూహాన్ని ఈ సారి ఇరు పక్షాలు అమలు పరుస్తున్నాయి. ఈసారి బీజేపీ ఎస్పీకి చెందిన యాదవులు, బీఎస్పీకి చెందిన జాటవుల ఓట్లను ఏ మేరకు లాక్కోగలదన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్పీ, బీఎస్పీలు రెండూ కులం ప్రాతిపదికగా ఏర్పడిన పార్టీలు. ఆయా సామాజిక వర్గాల గట్టి మద్దతుతో రాష్ట్రంలో ఇవి రెండూ బలంగా వేళ్లూనుకున్నాయి.

2002లో మాయావతి బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంత కాలానికే ఆ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌  తాను అధికారంలోకి రావడం కోసం బీఎస్పీని చీల్చారు. దీని వెనుక అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హస్తం ఉందన్న వార్తలు వినిపించాయి. మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగేనాటికి ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ అధికారంలో ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మాయావతి సరికొత్త రాజకీయ సమీకరణకు శ్రీకారం చుట్టారు.

గెలుపోటములను సామాజిక వర్గాలు ప్రభావితం చేసే కొన్ని నియోజకవర్గాల్లో మాయావతి విపక్షానికి చెందిన యాదవ నేతలను తమ పార్టీ తరఫున ఆ నియోజకవర్గాల్లో బరిలో దింపారు. లక్నో వీఐపీ గెస్ట్‌హౌస్‌లో మాయావతిపై దాడి కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్న రమాకాంత్‌ యాదవ్, ఉమాకాంత్‌ యాదవ్‌లకు ఆజంగఢ్, మచిలీషెహర్‌ టికెట్లు ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో బలమైన నేత బాల్‌చంద్ర యాదవ్‌ను ఖలీలాబాద్‌ నుంచి, మిత్రసేన్‌ యాదవ్‌ను ఫైజాబాద్‌ నుంచి ఎన్నికల బరిలో దింపారు.

మాయావతి చేసిన ఈ ప్రయోగం ఫలిం చింది. బీఎస్పీ ఓట్లను యాదవ అభ్యర్ధులకు మళ్లించగల సత్తా తనకుందని మాయావతి నిరూపించుకున్నారు. ఈ నియోజకవర్గాలన్నింటిలో ఎస్పీతో జరిగిన ముఖాముఖి పోటీలే మాయావతి అభ్యర్ధులంతా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌ నుంచి పది మంది యాదవ ఎంపీలు లోక్‌సభలో అడుగుపెట్టారు. వీరిలో నలుగురు బీఎస్పీ టికెట్‌పై గెలిస్తే, ఐదుగురు ఎస్పీ తరఫున విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్‌ కూడా గెలిచారు. ఎస్పీ నేతలు ఐదుగురిలో ములాయం, అఖిలేశ్‌లు ఉన్నారు.

తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల ఫలితంగా తాజా ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు జత కట్టి బీజేపీపై పోరుకు దిగాయి. ఈ కూటమి దాదాపు డజను మంది యాదవ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఎస్పీకి చెందిన యాదవుల ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని చూస్తున్న బీజేపీ కేవలం ఒకే ఒక యాదవుడికి (భోజ్‌పురి గాయకుడు దినేశ్‌ లాల్‌ యాదవ్‌)టికెట్‌ ఇచ్చింది. ఈయనను ఆజంగఢ్‌లో అఖిలేశ్‌పై పోటీకి దించింది. ఈ సారి కాంగ్రెస్‌ కూడా ఇద్దరు యాదవ నేతలకు–బాలచంద్ర యాదవ్, రమాకాంత్‌ యాదవ్‌– టికెట్లు ఇచ్చింది. వీరు పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి బీఎస్పీ. ఇక్కడ మాయావతి ఇద్దరు బ్రాహ్మణ నేతలను రంగంలో దించింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి దక్కిన ఈ సీట్లలో తమ ఓట్లను బీఎస్పీకి మళ్లించడం సమాజ్‌వాదీ పార్టీకి సవాలేనని పరిశీలకులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement