అందరి దృష్టి ‘కైరానా’ ఫలితంపైనే | All Eyes On Kairana Bypolls In UP | Sakshi
Sakshi News home page

అందరి దృష్టి ‘కైరానా’ ఫలితంపైనే

Published Tue, May 29 2018 4:29 PM | Last Updated on Tue, May 29 2018 4:31 PM

All Eyes On Kairana Bypolls In UP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం నాడు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇటు పాలకపక్ష బీజేపీకి, ప్రతిపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాకరమైనవి. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలిచ్చిన అనుభవంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కలసికట్టుగా కైరానా సీటుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక ఫలితం ఓ సంకేతం లాంటిది. ఎందుకంటే యూపీ నుంచి 80 లోక్‌సభ స్థానాలున్న విషయం తెల్సిందే.
 
2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా కారణంగా 80 సీట్లకుగాను బీజేపీకి 71 సీట్లు, దాని మిత్రపక్షమైన అప్నాదళ్‌కు రెండు సీట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో బీజేపీ తనకంటూ ప్రత్యేక ఓటర్ల పునాదిని ఏర్పాటు చేసుకోవడంతోపాటు మాయావతి దళిత ఓటర్లను కూడా కొల్లగొట్టింది. నాడు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ మధ్య ఓబీసీ, దళితులు, ముస్లింలు ఓటర్లు చీలిపోవడంతో బీజేపీ బాగా లాభపడింది.

ఆనాటి గుణపాఠంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. ఫలితంగా యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి ఖాళీ చేసిన గోరఖ్‌పూర్, డిప్యూటి ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఖాళీ చేసిన ఫూల్పూర్‌ లోక్‌సభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

ముందస్తు ఎన్నికల ఒప్పందం లేకపోయినప్పటికీ జేడీఎస్‌తో కలసి కాంగ్రెస్‌ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఒకే వేదికపై బీజేపీకి వ్యతిరేకంగా పలు ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు చేతులు కలపడం వారి భవిష్యత్‌ ఐక్యతను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న కైరానా లోక్‌సభ ఉప ఎన్నిక ప్రతిష్టాకరంగా మారడంతో బీజేపీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఎన్నికల ప్రచారం చేశారు.

బీజేపీ సిట్టింగ్‌ సభ్యుడు ఎంపీ హుకుమ్‌ సింగ్‌ మరణంతో కైరానా లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ఎస్పీ అభ్యర్థి నహీద్‌ హాసన్‌పై 2.3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో పది లక్షల మంది హిందువులుండగా, 5.46 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడి నుంచి సమాజ్‌వాది సభ్యురాలు తబాసన్‌ హాసన్‌ ఆర్‌ఎల్‌డీ టిక్కెట్‌పై పోటీ చేయగా, బీజేపీ పార్టీ తరఫున హుకుమ్‌ సింగ్‌ కూతురు మగాంక సింగ్‌ పోటీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement