సాక్షి, అమరావతి : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిపించాలని కోరడానికి గవర్నర్‌ను కలవాలన్న టీడీపీ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మూడు నెలలుగా తన దగ్గరకు రానివ్వకుండా చంద్రబాబు నాయుడు కోడెలను మానసిక క్షోభకు గురిచేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కనీసం పరామర్శకు వెళ్లని చంద్రబాబు ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హంతకుడే హత్య జరిగిందని యాగీ చేసినట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు గవర్నర్ దగ్గరకు వెళ్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఈ ప్రశ్నలు అడిగితే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారంటూ ఎమ్మెల్యేలు అంబటి, గోపిరెడ్డి 20 ప్రశ్నలను సంధిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
చంద్రబాబుకు అంబటి, గోపిరెడ్డి సంధించిన ప్రశ్నలు :
1. గత మూడునెలలుగా మీరు కోడెలను దగ్గరకు రానిచ్చారా?
2. కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారా?
3. అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయల ఫర్నిచర్ తరలించడం మీకు తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా?
4. కోడెల ఫర్నిచర్ వ్యవహారంలో, ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు నోరెత్తలేదు?
5. గత ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే ట్యాక్స్ వసూలు చేశారా? లేదా?
6. గత ఐదేళ్లుగా కోడెలకు చెందిన ఫార్మా డీల్స్ మీకు తెలిసే జరిగాయా? తెలియకుండా జరిగాయా?
7. గత ఐదేళ్లుగా కోడెల అవినీతి సామ్రాజ్యానికి మీరు వెన్నుదన్నుగా ఉన్నారా? లేదా?
8. ఇటు సత్తెనపల్లిలోనూ, అటు నర్సరావుపేటలోనూ భూ కబ్జాల మీద మీరు విచారణ ఎందుకు చేయించలేదు?
9. కోడెల తాను చనిపోకముందు మీకు ఫోన్ చేసి.. అయ్యా.. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్తే మీరెందుకు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు?
10. కోడెల తన మరణానికి ఈ ప్రభుత్వ వేధింపులు కారణమని వాంగ్మూలం ఎప్పుడైనా ఇచ్చారా?
11. కోడెల చనిపోతూ తన మరణానికి కారణాలు ఇవి, అని ఎక్కడైనా పేర్కొన్నారా?
12. చంద్రబాబుగారూ.. ఒక మనిషి తీవ్ర అవమానానికి గురైతే ఎన్టీఆర్ మాదిరిగా తల్లడిల్లి పోతాడా? లేదా? ఈ విషయం మీకు పాతికేళ్ల క్రితమే తెలుసు కదా?
13. వేధింపులు అంటే ఎలా ఉంటాయో, వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో మీరే ప్రపంచానికి చెప్పారు కదా? మీరు మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మీ సొంతమామని ముఖ్యమంత్రి పీఠం నుంచి కిందికి లాగినప్పుడు ఆయన వేదన గురించి ఏ రోజైనా ఆలోచించారా?
ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని ఎన్నికలు అయిన ఏడాదికి లాక్కుని ఎన్టీఆర్ మరణానికి మీరు కారకులయ్యారని సాక్షాత్తూ ఆయన భార్యే ఇవ్వాల్టికీ సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ కూడా మీ గురించి ఇదే విషయాన్ని చెప్పారు. కాని, ఏనాడూ మీరు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు లేదు?
14. కోడెల శివప్రసాద్ గారిది హత్యా? లేక ఆత్మహత్యా? కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి? చంద్రబాబు పాత్ర ఏమిటి? అనే అంశాలమీద సీబీఐ విచారణ జరిపించమంటారా?
15. కోడెల శివప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో చేసిన అరాచకాలమీద సీబీఐ విచారణ జరపమంటారా?
16. అసలు సీబీఐని ఈ రాష్ట్రంలోకే రానివ్వమంటూ మీరు ప్రతిజ్ఞచేసి, జనరల్ పర్మిషన్‌ను ఉపసంహరించుకుంటూ జీవోలు కూడా జారీచేశారు కదా?
మరి మీకు సీబీఐమీద నమ్మకం ఎప్పుడు కుదిరింది?
17. శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవడానికి గవర్నర్ ఎవరని.. ఆయనకు ఏ హక్కు ఉందని జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు మాట్లాడిన మీరు.. అసలు గవర్నర్ వ్యవస్థ నే రద్దు చేయమని చెప్పిన మీరు.. ఈరోజు ఏ మొహం పెట్టుకొని గవర్నర్ దగ్గరకు వెళుతున్నారు?
18. బీజేపీ నేతలు రఘురాం సహా మరికొందరు చెప్పిన దాని ప్రకారం మీరు చేసిన అవమానాల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం కోడెలే స్వయంగా చెప్పారు. మరి సీబీఐ విచారణ అంటూ జరిగితే ఏ1 గా హాజరుకావాల్సింది మీరే చంద్రబాబు గారు. అందుకు మీరు సిద్ధమా?
19. చివరకు నిన్న కోడెల శవాన్ని అడ్డుపెట్టుకుని నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆస్పత్రిపై దాడిచేయడానికి మీరే పురిగొల్పారు. మరీ దిగజారిపోయి మూడురోజులపాటు శవం పక్కనే ఉండి మీ పార్టీని బతికించుకునేందుకు సిగ్గుమాలిన రాజకీయం చేయలేదా?
20. బహుశా నిజాలు బయటకు రావన్న నమ్మకంతోనే మీరు ఈ కార్యక్రమాలన్నింటికీ పూనుకున్నారు. కాబట్టి కోడెల శివప్రసాదరావు అరాచకాలమీద, అతని కుటుంబ సభ్యుల అరాచకాలమీద, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితుల మీద మొత్తంగా మీ పాత్రమీద సీబీఐ విచారణ కోరండని మేమే చంద్రబాబుకు సలహా ఇస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment