
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నియంత్రణలో, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌లీక్ దుర్ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన తీరుకు ప్రపంచమంతా మెచ్చుకుంటూంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకే చందంగా కువిమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ ఇబ్బందుల్లో ఈ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి జగన్ యుద్ధ ప్రాతిపదికన బాధితులను ఆదుకుని భరోసా నింపారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వ ఖజానా నుంచి భారీ ఆర్థిక సాయం అందించిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. దీన్ని చంద్రబాబు మెచ్చుకోక పోగా రకరకాలుగా మాట్లాడుతున్నారని అంబటి మండి పడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే....
► ఎల్జీ పాలిమర్స్ వారితో లాలూచి పడ్డారని అంటూ కువిమర్శలు చేస్తున్నారు. ఆ కంపెనీతో లాలూచి పడవల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. వారితో పరిచయంగాని, బంధం, బాంధవ్యం గాని జగన్ ప్రభుత్వానికి లేవు. అలాంటి బంధాలు చంద్రబాబుకే ఉంటాయి.
► రూ. కోటి ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా అని చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు.
► ఎఫ్‌ఐఆర్ సరిగ్గా కట్టలేదంటున్నారు. అది ప్రాథమిక దర్యాప్తు నివేదిక మాత్రమే. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబుకు ఇది తెలియదా?
► కంపెనీ వారిని అరెస్టు చేయలేదంటున్నారు. రుజువులు లేకుండా అరెస్టులు చేస్తారా? పుష్కరాల్లో 29 మంది మరణిస్తే ఎంత మందిని అరెస్టు చేశారు.
► గెయిల్ ప్రమాదంలో మృతులకు సంస్థ రూ 20 లక్షల పరిహారం ఇస్తే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది రూ 3 లక్షలే. ఈ ప్రమాదంలో చంద్రబాబు ఎంత మందిని అరెస్టు చేశారు?
► విశాఖలో పర్యటించడానికి కేంద్రం ఎందుకు అనుమతి నివ్వలేదో అడిగే సాహసం చంద్రబాబు చేస్తారా?
Comments
Please login to add a commentAdd a comment