
సాక్షి, అమరావతి: తిరుపతి వెంకన్న సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి అబద్ధాలు చెప్పారని, దీనికి ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా గొంతు చించుకుంటే ప్రజలు నమ్మబోరని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాను సర్వనాశనం చేసినందుకు క్షమాపణ చెప్పకుండా మళ్లీ అసత్యాలు, అబద్ధాలు వల్లెవేస్తారా? అంటూ ధ్వజమెత్తారు.
అంబటి బుధవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.కోట్ల ఖర్చుతో విజయవాడలో ధర్మపోరాట దీక్ష, తిరుపతిలో ధర్మపోరాట శంఖారావం సభలు పెట్టి చంద్రబాబు గొంతు చించుకుని అరిచినా సభికుల నుంచి స్పందన కరువైందన్నారు. ఆద్యంతం ఉత్తర కుమార ప్రగల్భాలే వినిపించాయే తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసే స్థితిలో చంద్రబాబు లేడన్న సంగతి స్పష్టమైందని చెప్పారు. ‘‘ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మా పార్టీ నేతలపై, నాపై చంద్రబాబు కేసులు పెట్టించారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. హోదా సాధనపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయించాలి.’’ అని అంబటి అన్నారు.
ఆ అభిప్రాయాలు నా వ్యక్తిగతం
‘‘రాష్ట్రంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సచివాలయంలోని ప్రతిపక్ష నేత చాంబర్‌లో ఆరు సెంటీమీటర్ల వర్షం పడింది. ఇదేనా జపాన్, సింగపూర్ సాంకేతిక పరిజ్ఞానం? గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి వర్షపు నీరు వస్తే కుట్ర అని ఆరోపించినవారు ఇప్పుడేం సమాధానం చెబుతారు? చంద్రబాబు అసమర్థత, లంచాల దాహనం వల్లనే ఇదంతా జరిగింది.’’ అని అన్నారు. కాగా, కృష్ణా జిల్లా పేరు మార్పు అంశంపై తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ పూర్తిగా వ్యక్తిగతమని అంబటి రాంబాబు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment