గన్నవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుగ్లక్ పరిపాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని కోసం రైతుల నుంచి అవసరానికి మించి భూములు తీసుకున్న ఆయన ఆ భూములతో వ్యాపారంచేసి కోట్లు గడించాలనుకుంటున్నారని, ఇప్పుడు అదే రైతుల విషయంలో మతిభ్రమించిన తీరుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కష్ణా జిల్లా గన్నవరంలో స్థానిక పార్టీ నాయకుడు తోట వెంకయ్య కార్యాలయంలో గురువారం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వకర్త సింహద్రి రమేష్‌తో కలిసి అంబటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారని బాబు గొప్పలు చెబుతున్నప్పటికి వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని, భూములు ఇచ్చిన రైతులే ఇప్పుడు ముఖ్యమంత్రిపై తిరగబడే పరిస్థితి వచ్చిందని అంబటి అన్నారు. రైతులకు రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించే విషయంలో ప్రభుత్వం మాట తప్పుతోందన్న ఆయన.. అసలు రాజధాని నిర్మాణం కోసం 18 వేల ఎకరాల అటవీ భూములను డీనోటీఫై చేయాలని రాష్ట్రప్రభుత్వం పంపిన ఫైల్‌ను కేంద్రం ఎందుకు వెనక్కి పంపిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధాని నిర్మాణానికి సంబంధించి ఊహాచిత్రాలు, పాలకులు చెబుతున్న మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, ప్రభుత్వం గొప్పలకుపోయి రూ.400 కోట్లు ఖర్చుపెట్టి రాజధానికి శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. తాత్కాలిక రాజధాని విషయంలో తొలుత మేధా టవర్‌లో అని, తర్వాత మంగళగిరిలో అని, ఇప్పడు మరోచోట నిర్మిస్తామని ప్రజలను గందరగోళంచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంబటి దుయ్యబట్టారు.
బాబుది తుగ్లక్ పాలన: అంబటి
Published Thu, Jan 28 2016 6:30 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement