సాక్షి,అమరావతి: అవినీతి ఆరోపణల వల్లే ఐఆర్‌ఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థికావృద్ధి మండలి మాజీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. తప్పుచేసిన అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపడం కొత్తేమీ కాదన్నారు. పరిశ్రమల శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. తప్పుచేసిన అధికారులను సస్పెండ్ చేయకుండా.. సన్మానాలు చేస్తారా అని ప్రశ్నించారు.
కృష్ణకిషోర్ సస్పెన్షన్‌ను చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్‌పై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఇది కక్షసాధింపు అంటున్నారంటే.. ఆ అధికారికి, చంద్రబాబుకు ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయన్నారు. ఏదోవిధంగా ఆయనను రక్షించేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని తెలిపారు.
బాబు ఏం చెబితే అది చేసి ఉండొచ్చు..
జగతి పబ్లికేషన్ విచారణ టీమ్‌లో కృష్ణకిషోర్ సభ్యుడిగా ఉండి బహుశా బాబుకు అనుకూలంగా ప్రవర్తించి ఉండి ఉండొచ్చని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. జాస్తి కృష్ణకిషోర్, జేడీ లక్ష్మీనారాయణ, వెంకయ్యచౌదరి వీళ్లందరినీ తన కనుసన్నల్లో పనిచేసేలా చంద్రబాబు చేసుకున్నారని ఆరోపించారు. కాబట్టే ఆ రోజున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారని చెప్పారు. శాసనసభలో మార్షల్స్‌పై చంద్రబాబు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నారు. అధికారం కోల్పోయేసరికి బాబు ఉన్మాదిలా మారారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment