బీజేపీకి దేశాభివృద్ధే లక్ష్యం | Amit Shah Comments On KCR | Sakshi
Sakshi News home page

బీజేపీకి దేశాభివృద్ధే లక్ష్యం

Published Wed, Apr 10 2019 12:47 AM | Last Updated on Wed, Apr 10 2019 12:47 AM

Amit Shah Comments On KCR - Sakshi

మంగళవారం శంషాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కరవాలం ప్రదర్శిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.

సాక్షి, హైదరాబాద్‌: అనేకమంది ఉద్యమకారుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. కేసీఆర్‌కు కుటుంబం మాత్రమే ముఖ్యమని, దేశాభివృద్ధి బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బెక్కరి జనార్దన్‌రెడ్డి గెలుపు కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా శంషాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన వారికి ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగడంలేదన్నారు. 16 స్థానాల్లో తమను గెలిపించాలని టీఆర్‌ఎస్‌ నేతలు కోరుతున్నారని, ఆ సీట్లతో కేసీఆర్‌ ప్రధాని కాగలుగుతారా? ఆయనకు ఆ సత్తా ఉందా? అని ప్రశ్నించారు. ఆయనను సీఎంగా గెలిపించి రాష్ట్రంలో పాలన చేయమంటే.. రెండు నెలల వరకు కూడా కేబినెట్‌ విస్తరించలేకపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాహుల్‌ అండ్‌ కంపెనీతో కేసీఆర్‌ కలిసి పోయారని విమర్శించారు. కేసీఆర్‌ చెబుతున్న అతుకుల బొంతలాంటి మూడోఫ్రంట్‌తో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందా..? అని ప్రశ్నించారు.  

బీజేపీతోనే దేశం సురక్షితం 
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందని అమిత్‌షా అన్నారు. ఉగ్రవాదానికి మద్దతుగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తుంటే, తాము ఉగ్రవాదులను మట్టుబెడుతున్నామన్నారు. పాకిస్తాన్‌ వారు ఇటుకతో కొడితే.. తాము రాయితో కొడుతామని స్పష్టం చేశారు. తీవ్రవాదం సమస్య కాదంటూ రాహుల్‌ మాట్లాడుతున్నారని, పుల్వామా దాడి చిన్నదంటూ రాహుల్‌ మిత్రుడు శాంపిట్రోడా వ్యాఖ్యలు చేశారని అన్నారు. దేశం మొత్తం గర్విస్తున్న సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కూడా తక్కువ చేసి మాట్లాడారన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కోరుతోందని, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్, రాహుల్‌గాంధీ దానిని సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో ఉగ్రవాదులు సైనికుల తలలు తీసేసినా స్పందించలేదన్నారు. తాము మాత్రం పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌లోకి ప్రవేశించి తీవ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు చేశామన్నారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి, సైనికులను అవమానపరిచిన రాహుల్, ఒవైసీ, కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

చొరబాటుదారులను తరిమికొడతాం 
దేశంలో అక్రమంగా ప్రవేశించినవారిని పంపించి వేయడానికి ఎన్‌ఆర్‌సీ తెస్తే కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోం దని అమిత్‌ షా అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నం త వరకూ భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగంగానే ఉం టుందని తేల్చి చెప్పారు. ఈసారి అధికారంలోకి రాగానే దేశద్రోహులను తరిమికొడతామన్నారు. అనంతరం తమ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను వివరించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామని, రైతులకు పింఛన్లు, రూ. 6 వేల పంటసాయం కూడా అందిస్తున్నామని, రూ.5 లక్షల వార్షికాదా యం వరకు పన్ను మినహాయింపు ఇచ్చామన్నారు. 

తెలంగాణ అభివృద్ధికి చేయూత 
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, తాము మళ్లీ అధికారంలోకి వస్తే మరింత చేయూతను అందిస్తామని అమిత్‌ షా హామీనిచ్చారు. ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రో కోసం కేంద్రం రూ.1,600 కోట్లు ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌కు బయో డైవర్సిటీ, సెంటర్‌ ఇన్నోవేషన్, జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, ఎయిమ్స్, కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీ వంటి అనేక సంస్థలను కేంద్రం ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 9 రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులను ఎక్కువగా ఇచ్చామని వివరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏం చేశారో కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. యూపీఏ హయాంలో కేవలం రూ. 16 వేల కోట్లు ఇస్తే మోదీ ఐదేళ్ల పాలనలో రూ. 2,30,500 కోట్లు ఇచ్చారన్నారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే తెలంగాణ మరింతగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కానీ కేసీఆర్‌ కేంద్రం ని«ధులు ఇవ్వడం లేదని అబద్దాలు చెబుతున్నారన్నారు. మజ్లిస్‌కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ నిర్వహించడంలేదని, రజాకార్ల వారసత్వం నుంచి తెలంగాణను విముక్తి చేస్తామన్నారు.

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే: లక్ష్మణ్‌
ఈ ఎన్నికల్లో మోదీని మళ్లీ గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగైందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి గులాంగిరి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని అన్నారు. తానే అసలైన హిందువునని కేసీఆర్‌ చెప్పుకుంటున్నారని, అసలైన హిందువే అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై తన వైఖరి చెప్పాలన్నారు. ఒవైసీ మెప్పు కోసమే అజ్మీర్‌ షరీఫ్‌లో చాదర్‌ సమర్పించారన్నారు. రాష్ట్రం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసిన ప్రజలు దేశం కోసం ఈసారి బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఆ పార్టీ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి బెక్కరి జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే అవి వృథా అవుతాయన్నారు. సమావేశంలో ఎంపీలు దత్తాత్రేయ, జితేందర్‌ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ దరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు, రాపోలు ఆనందభాస్కర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement