
బీజేపీ చీఫ్ అమిత్ షా
సాక్షి, రాయపూర్ : మోదీ నాలుగేళ్ల పాలనపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా టార్గెట్ చేశారు. తమ ప్రభుత్వ నాలుగేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో రాహల్ విమర్శలను షా తోసిపుచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం భారీ ర్యాలీతో ఆయన ప్రారంభించారు. ‘రాహుల్ బాబా.. నాలుగేళ్ల మోదీ సర్కార్ లెక్కల గురించి మీరు ప్రశ్నిస్తున్నారు..మీకు మేం సమాధానాలు ఇవ్వం..ఖర్చు పెట్టిన ప్రతిపైసాకూ లెక్కలను ప్రజలకు వివరిస్తా’ మని అమిత్ షా అన్నారు.
ప్రజలను ఓట్లు కోరేందుకు కలిసే క్రమంలో అన్నింటినీ వారి ముందుంచుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో దేశం 55 ఏళ్లుగా అభివృద్దిలో వెనుకబడిందని ఆరోపించారు. మీ కుటుంబం నాలుగు తరాల పాటు 55 సంవత్సరాలు దేశాన్ని పాలించినా అభివృద్దికి నోచుకోలేదని రాహుల్‌ను ఉద్దేశించి షా ప్రశ్నించారు.
చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, 90 అసెంబ్లీ స్దానాలున్న అసెంబ్లీలో తాము 65 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేవారు. రమణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు.