
పవన్ కళ్యాణ్‌కు సిద్ధాంతాలు లేవు.. డబ్బు తీసుకోవటం.. నటించడం మాత్రమే తెలుసు
సాక్షి, అనంతపురం : ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే పవన్ కళ్యాణ్ అనంతపురంలో పర్యటించారంటూ వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పలు అంశాల్లో పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల భాగస్వామి అంటూ ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ రైతు భరోస యాత్ర చేసి కష్టాల్లో ఉన్న అన్నదాతలను పరామర్శించిన సంగతి పవన్‌కు తెలీయదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేందుకే పవన్ కళ్యాణ్ జిల్లాలో కవాతు నిర్వహించారని ఆరోపించారు.
రైతు ఆత్మహత్యలు, వలసలపై పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదంటూ ప్రశ్నించారు. 23 మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెడితే పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు కూడగట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఉన్న కేసులు పవన్ కళ్యాణ్‌కు కనిపించవంటూ మండి పడ్డారు. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్.. చంద్రబాబు తరఫున రాజకీయాల్లో నటిస్తున్నరంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు సిద్ధాంతాలు లేవు.. డబ్బు తీసుకోవటం.. నటించడం మాత్రమే తెలుసంటూ పవన్‌పై వివర్శలు గుప్పించారు.