సాక్షి, తాడేపలి: ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావు కమిటీ విశాఖపట్నంలో రాజధాని వద్దని చెప్పిందని తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటీవ్ రాజధాని విశాఖలో పెట్టాలని కమిటీ సూచించిందని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాతనే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని డిప్యూటీ సీఎం తిప్పికొట్టారు.
అదే సీఎం జగన్ అభిమతం
‘అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని, జీఎన్‌రావు, బోస్టన్ కమిటీ, హైపర్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమతం. అయితే అభివృద్ది వికేంద్రీకరణపై కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ది వికేంద్రీకరణకు వ్యతిరేకమని టీడీపీ మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేయలంటున్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి తనకు అనుకూల నివేదికను ఇచ్చే నారాయణ కమిటీని ఏర్పాటు చేశారు.
అమరావతిలో వరదలు రావా?
జీఎన్ రావ్ కమిటీ నివేదికను చంద్రబాబు భోగి మంటల్లో వేశారు. మళ్లీ జీఎన్ రావు కమిటీపై చంద్రబాబుకు ఎందుకు ప్రేమ పెరిగిందో అర్థం కావడం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, ప్రజలను మోసం చేయడంలో దేశంలోనే చంద్రబాబు నంబర్ వన్. విశాఖలో వరదలు, తుఫాను వస్తాయని ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో వరదలు రావా అని ప్రశ్నిస్తున్నాను. ముంబై, చెన్నై సముద్రం ఒడ్డున లేవా? ఆ నగరాలు అభివృద్ది చెందలేదా? వీటికి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా గతంలో చంద్రబాబు విశాఖను దేశానికి రెండో రాజధాని చేయాలని లేకుంటే ఆర్థిక రాజధాని చేయాలని మాట్లాడలేదా?
అప్పుడెలా జరిగిందో ఇప్పుడలాగే
రాయలసీమ, ఉత్తరాంధ్రపై బాబు విషం కక్కుతున్నారు. ఈ రెండు ప్రాంతాల ద్రోహిగా చిరస్థాయిలో నిలిచిపోతారు. మీడియాను అడ్డంపెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోంది. మండలి రద్దు నిబంధనలకు విరుద్దంగా జరగడం లేదు. ఎన్టీఆర్ హయాంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతోంది’అని డిప్యూటీ సీఎం అంజద్ బాషా పేర్కొన్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం మెట్రోపాలి టన్ ఏరియాలో సముద్రానికి దూరంగా ఉన్న వాయవ్య ప్రాంతం సరిగ్గా సరిపోతుందని రాజధాని ప్రాంతంపై సిఫారసుల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment