సాక్షి, సిమ్లా : మోదీ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత అరుణ్ శౌరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీకి మద్దతునిచ్చి తాను పెద్ద తప్పు చేశానని ఆయన వ్యాఖ్యానించారు.
తాను రెండు తప్పులు చేశానని, అందులో ఒకటి గతంలో వీపీ సింగ్ జనతా దళ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం కాగా, రెండోది నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వటమని శౌరీ వ్యాఖ్యానించారు. కసౌలిలో నిర్వహించిన కుశ్వంత్ సింగ్ ఆరవ సాహిత్య వేడుకలకు హాజరైన శౌరీ హౌ టూ రికగ్నైజ్ రూలర్స్ ఫర్ వాట్ దే ఆర్..(‘పాలకులను ఎలా గుర్తించాలి... అవేంటి?) అన్న అంశంపై ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
‘వారు(మోదీని ఉద్దేశించి) ఇప్పుడేం చేస్తున్నారో దానిని అనుసరించొద్దు. గతంలో వారేం చెప్పారో దాని గురించి ఆలోచించండి అని శౌరీ పేర్కొన్నారు. ఇది మన గొప్ప ఫెయిల్యూర్. మన దినపత్రికలు, నాలాంటి వారు మోదీని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాం. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని చెబితే నమ్మేశాం. కానీ, అదంతా ఉత్తదేనని శౌరీ తేల్చేశారు.
గుజరాత్ వైబ్రెంట్ సదస్సుల పేరుతో 15 లక్షల కోట్ల పెట్టుబడులంటూ చెప్పుకున్న మోదీ సాధించింది మాత్రం కేవలం ఆరు శాతం అభివృద్ధేనని.. గుజరాత్ మోడల్ అన్నది ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అని శౌరీ ఎద్దేవా చేశారు. నేతలు చెప్పే ప్రకటనలు, హామీల ఆధారంగా కాకుండా.. వారి వ్యక్తిత్వం ఆధారంగా వాస్తవాలను గ్రహించి అంచనా వేయాల్సిన అవసరం ఉందని శౌరీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment