
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు కమల్ హాసన్ బుధవారం రాజకీయ పార్టీని స్థాపించబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని మదురైలో ఆయన రాజకీయ పార్టీని ప్రకటించి.. విధివిధానాలు వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, వామపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నేతలు హాజరుకాబోతున్నారు. మదురైలో పార్టీని ప్రకటించిన అనంతరం కమల్ నేరుగా రామేశ్వరం వెళ్లనున్నారు. అక్కడ ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని దర్శించుకొని.. తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తారు.
రాజకీయాల్లోకి వస్తున్నానని గతంలోనే ప్రకటించిన కమల్ రాష్ట్రమంతటా పర్యటిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఆయన తమిళనాడు ప్రజలను నేరుగా కలుసుకొని.. వారి కష్టనష్టాలు, ఆకాంక్షలు తెలుసుకొన్నారు. ఈ సన్నాహాల్లో భాగంగా ఇప్పటికే కమల్ సూపర్ స్టార్ రజనీకాంత్, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్‌లతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే.