సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే కేజ్రీవాల్ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తూ వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ (మహాకూటమి)కి మద్దతు ఇచ్చే విషయంపై కేజ్రీవాల్ స్పష్టతనిచ్చారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీని అధికారంలోంచి దించే పోరాటంలో నేను ముందుంటాను. దీని కోసం అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలి. మోదీ, అమిత్‌షా ద్వయం ఇప్పటికే దేశాన్ని సర్వనాశనం చేసింది. 2019లో మరోసారి గెలిస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు. కావునా అందరూ కలిసి బీజేపీని అధికారానికి దూరం చేయాలి’’ అని వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో రహస్య మంతనాలు చేస్తున్నారంటూ గత కొంతకాలంగా ఎన్డీయే నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కూడా మహాకూటమికి తొలి అడుగుగా ప్రతిపక్షాలు భావించిన కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. నాలుగేళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న కేజ్రీవాల్ ఇటీవల తొలిసారి రాహుల్‌తో కలిసి వేదికను పంచుకున్నాడు. ఢిల్లీలో రైతన్నల నిరసనకు మద్దతుగా విపక్షాలు ఏర్పాటు చేసిన సమావేశంలో అరవింద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో రాహుల్, కేజ్రీవాల్ తొలిసారి చేతులు కలిపారు.
దూతల మంతనాలు..
బీజేపీని గద్దెదిపేందుకు ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పాడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మయావతితో సహా ఇతర పార్టీల నేతలు కూడా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్న విభేదాలను పక్కన పెట్టి కూటమిలో చేరాలని మమతా, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌లు కేజ్రీవాల్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో కీలక నేత అయినందుకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజకీయ కార్యచరణ ప్రకటకించవద్దని స్టాలిన్ ఆయనతో చెప్పినట్లు తెలిసింది.
కీలక పదవితో వల..
పదిహేన్నేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పిన (షీలా దీక్షిత్) కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీని అధికారంలోకి రాకుండా, విభేదాలు పక్కనపెట్టి కాంగ్రెస్, ఆప్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో కాంగ్రెస్ వెనకడుగు వేయడంతో 49 రోజులకే సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా 70 సీట్లకు గాను ఆప్ 67 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
అప్పటితో పోల్చుకుంటే రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పరిస్థితులు పూర్తిగా మారినందున కాంగ్రెస్‌తో దోస్తిగా కేజ్రీవాల్ సై అంటారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే కేజ్రీవాల్‌కి కీలక పదవి దక్కుతుందని కొంతమంది నేతలు ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మహా కూటమిలో చేరుతున్నట్లు ఆప్ అధికారికంగా ప్రకటించకపోవడంతో.. 2019 ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే కేజ్రీవాల్ నిర్ణయం ఏవిధంగా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment