అమరావతి: వారం రోజుల క్రితం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంతో పాటు భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమాలకు దూరమైన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు మరోసారి పార్టీ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కిశోర్ చంద్రదేవ్ ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సైతం అశోక్ గజపతిరాజు హాజరు కాలేదు. దాంతో వరుసగా టీడీపీ కార్యక్రమాలకు అశోక్ గజపతిరాజు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
కొంతకాలంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపట్ల గజపతిరాజు అసంతృప్తిగా ఉన్నారు. దానిలో భాగంగానే టీడీపీ కార్యక్రమాలకు అశోక్ గజపతిరాజు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తికి ప‍్రధాన కారణంగా తెలుస్తోంది. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి అశోక్‌గజపతి రాజు రాకపోవడానికి కారణం ఇదేనని సమాచారం. కిశోర్ చంద్రదేవ్ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్‌గజపతి మధ్య దూరం పెరగడానికి మరో కారణమన్న వాదన కూడా ఉంది. ఇందుకు అశోక్ గజపతిరాజు గైర్హాజరీ కావడం మరింత బలాన్ని చేకూర్చింది. కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరిక గురించి తనతో చంద్రబాబు చర్చించకపోవడం అశోక్‌గజపతికి కోపం తెప్పించిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కిశోర్ పార్టీలో చేరిక కార్యక్రమానికి ఆయన గైర్హాజరైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment