అది 1990ల కాలం... సంకీర్ణ రాజకీయాల్లో సంధి సమయం... 1996లో ఏర్పడిన అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం 13 రోజులకే కుప్పకూలగా ఆ తర్వాత కొలువుదీరిన హెచ్.డి. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్ ప్రభుత్వాలు కూడా కొంత కాలానికే పడిపోయాయి. ముఖ్యంగా 1996 నుంచి 1998 వరకు కేంద్రంలో రాజకీయ అనిశ్చితి చోటుచేసుకుంది. చిన్న కారణాలకే ప్రభుత్వాలు కుప్పకూలేవి. ఈ పరిణామాలపై వాజ్‌పేయి ఎంతో కలత చెందారు.
ప్రభుత్వాల అస్థిరత ఆయన్ను కలవరపెట్టింది. దీంతో ఆయన ఎవరూ ఊహించని ప్రతిపాదన చేశారు. నేటి కాలానికి, ప్రస్తుత రాజకీయ వాతావరణ పరిస్థితులకు ఏమాత్రం సరిపడని ఆలోచనను తెరపైకి తెచ్చారు. దేశంలో రాజకీయ సుస్థిరత కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనూహ్యంగా బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే ఇందుకు డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ను ప్రధానిని చేయాలనే షరతు విధించారు. కానీ ఈ ప్రతిపాదన ఆదిలోనే ఆగిపోయింది.
అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే..
ఈ ప్రతిపాదన గురించి తొలుత పార్టీలోని తన సహచరుడు, ఆప్తమిత్రుడైన ఎల్.కె. ఆద్వాణీతో వాజ్‌పేయి చర్చించారు. దేశ ఆర్థిక రంగాన్ని గాడినపెట్టేందుకు ‘బలమైన కేంద్ర ప్రభుత్వం’ఉండాలని, ఇందుకు ప్రధానిగా డాక్టర్ మన్మోహన్‌సింగ్ అయితే బాగుంటుందని వాజ్‌పేయి ప్రతిపాదించారు. 1991–92 దేశ ఆర్థిక సంస్కరణల విషయంలో మన్మోహన్‌సింగ్ చూపిన తెగువను వాజ్‌పేయి ఎంతగానో మెచ్చుకున్నారు.
ముఖ్యంగా 1991 ఆర్థిక సరళీకరణల బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వాజ్‌పేయి పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ స్టాక్ మార్కెట్లకు ప్రపంచ ద్వారాలు తెరిచేందుకు మార్గం చేసిన మన్మోహన్‌పై మాత్రం ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అందువల్ల మన్మోహన్ సారధ్యంలో స్థిరమైన కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుందని వాజ్‌పేయి విశ్వసించారు. చివరకు ఈ ప్రతిపాదన గురించి మన్మోహన్‌కు తెలియజేసేందుకు తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్.వి. పండిట్‌ను ఆంతరంగిక దూతగా పంపారు.
అయితే ‘ఇందుకు కాంగ్రెస్ ఏమాత్రం అంగీకరించదు’అంటూ మన్మోహన్ పేర్కొనడంతో ఈ ప్రతిపాదనకు అక్కడితో తెరపడింది. ఈ పరిణామాల గురించి ఆర్.వి. పండిట్ ఆ తర్వాతి కాలంలో ఓ జాతీయ దినపత్రికలో రాసుకొచ్చారు. కాగా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వాజ్‌పేయి ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసి గద్దెనెక్కినా ఆయన ప్రభుత్వం 13 నెలలపాటే కొనసాగింది. తదనంతరం జరిగిన ఎన్నికల్లో మాత్రం ఎన్డీయే ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment