ఆత్రం సక్కు
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గులాబీ గూటికి చేరడం ఖరారైంది. ఉమ్మడి జిల్లాలోని ఉన్న పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చెందిన ఏకైక ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌లో చేరికపై గత రెండు మాసాలుగా మంత్రాంగాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరునున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, ఆసిఫాబాద్‌లో 174 ఓట్ల స్వల్ప మెజార్టీతో సక్కు గెలుపొందారు. ఆదివాసీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. డీసీసీ అధ్యక్షుడి రేసులో జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నా.. ముందు జాగ్రత్తగా పార్టీ వీడకుండా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఈ పదవి సక్కుకే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే సక్కు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆదివాసీ సమస్యలపై చర్చించినట్లు సమాచారం.
ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన ఒక్కరే సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సక్కు టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఆయన డీసీసీ అధ్యక్ష పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, ఆదివారం రాజీనామా పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడికి అందజేసి త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెల 22న ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 1997 నుంచి ట్రైబల్ రైట్స్ ఆర్గనైజేషన్‌లో పని చేసిన సక్కు 2008లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగానికి రాజీనామా చేశారు.
నవంబర్ 2008లో కాంగ్రెస్‌లో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ అ సెంబ్లీకి స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఎస్టీ వెల్ఫేర్ కమిటీ, ట్రైబల్ అడ్వయిజర్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ కార్యదర్శి, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేసిన సక్కు ఇటీవల ఎమ్మెల్యేగా గెలు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మిపై 174 ఓట్ల మెజార్టీతో విజ యం సాధించారు. ఇటీవల గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలోనూ సక్కు పాల్గొన్నారు.
కేసీఆర్‌పై నమ్మకంతోనే..
ఇటీవల సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆదివాసీ సమస్యలతోపాటు పోడు భూముల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాది సమస్యలతోపాటు ఇతర అంశాలపై చర్చించామని, సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ముఖ్య అధికారులందరినీ వెంటబెట్టుకొని వచ్చి ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని, ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కూడా అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే ఆదివాసీలు అన్ని రకాల అభివృద్ధి చెందుతారనే నమ్మకంతోనే టీఆర్‌ఎస్‌లో చేరడానికి నిశ్చయించుకున్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరే విషయంపై విధివిధానాలు రూపొందించుకుంటామని, అవసరమైతే శాసన సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి, తిరిగి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment