
పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న బాలకృష్ణ
హిందూపురం: అడ్డుకునేవారు లేరు..బుద్ధి చెప్పేవారసలే లేరు..పైగా ఎక్కడికక్కడ జనం నిలదీతలు...అందుకే బాలకృష్ణ అసహనంతో రగిలిపోతున్నారు. ఎవరైనా ఒక్క మాట ఎదురు మాట్లాడినా బూతులతో రెచ్చిపోతున్నారు. తాజాగా శుక్రవారం హిందూపురంలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరి ఓటింగ్ కొనసాగిస్తుండగా.. నిబంధనలకు విరుద్ధంగా బాలకృష్ణ, పెద్దసంఖ్యలో పార్టీనాయకులతో కలిసి వచ్చి నేరుగా ఉద్యోగుల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. సెల్ఫీలు తీసుకుని వారితో కరచాలనం చేస్తూ సహకరించాలని చెప్పుకుంటూ వెళ్లసాగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న దళిత సంఘం నాయకుడు ఉదయ్, ఇతర నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయవచ్చా ..? అని నిలదీశారు. దీంతో బాలకృష్ణ ‘‘ఆ.. ఎవడొచ్చాడిక్కడ.. పగులుద్ది’’ అని తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తూ మరోకౌంటర్ వద్దకు వెళ్లారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు ప్రశ్నించిన తమపై నోరుపారేసుకున్న బాలయ్య తీరుకు నిరసనగా ఉదయ్, మరికొందరు దళితనాయకులు ఆందోళనకు దిగారు. ‘‘ఓట్లు వేసిన పాపానికి మీతో తిట్లు తినాలా’’ అంటూ నిరసనకు దిగారు. అయినా బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోకుండా ఫొటోలు దిగి ప్రచారం ముగించుకుని వెళ్లి పోయారు. అంతవరకు బాలకృష్ణ చుట్టూ తిరిగిన పోలీసులు...ఆయన వెళ్లిపోగానే ఒక్కసారిగా ఆందోళన చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. నాయకులు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఉండరాదంటూ బయటకు పంపించారు. దీంతో అక్కడున్న వారంతా బాలకృష్ణకు ఒక న్యాయం..మిగతా వారికి ఒక న్యాయమా..అని ప్రశ్నించినా...సమాధానం చెప్పేవారే కరువయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment