సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్‌పై అసత్య ప్రచారం చేస్తూ బట్టకాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెబుతున్న భూములు ఆక్రమించినవి కావని, 2014 అఫిడవిట్‌లోనే కేటీఆర్ పేర్కొన్నారని తెలిపారు. 8 ఎకరాల 9 గుంటల భూమి కేటీఆర్ సతీమణి పేరుమీద ఉన్నట్లు వివరించారు. గండిపేట సమీపంలోని ఫామ్‌హౌస్‌ను నాలుగు ఏళ్ల క్రితం కేటీఆర్ లీజుకు తీసుకున్నారని వెల్లడించారు. ఫామ్‌హౌస్‌కు రేవంత్ చెబుతున్న భూమికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని రేవంత్ క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. (ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్)
సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్.. గోపనపల్లిలో దళితుల భూములను రేవంత్ తన సోదరులతో కలసి ఆక్రమించారని, ఆయన నేరాల పుట్ట బయటపడిందని ఆరోపించారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్‌పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను కాదుకదా ఏమీ పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా ప్రభుత్వ నిబంధనలకు అతిక్రమించి మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్ నిర్మించారని రేవంత్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దానిని ముట్టడించేందుకు అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లిన రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment